
- మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
- ఈ నెల మూడో వారంలో సెంటర్లు ప్రారంభం
- డీసీఎమ్మెస్ ఔట్.. మహిళా సంఘాలకు ప్రాధాన్యం
మంచిర్యాల, వెలుగు: యాసంగి వరి కోతలు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం రెడీ అవుతోంది. ఈసారి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 320 సెంటర్లు ఏర్పాటుచేసి 2 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 308 సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నెల మూడో వారంలో సెంటర్లను ఓపెన్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వరి సాగు విస్తీర్ణం తక్కువ కాగా, కోతలు ఇప్పుడే మొదలయ్యేలా కనిపించడంలేదు.
సగానికి పైగా సన్నాలే..
రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్ నుంచి సన్నాలు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడం తెలిసిందే. దీంతో ఈ యాసంగిలోనూ మెజారిటీ రైతులు సన్నాలు సాగు చేశారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా లక్షా 30 వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టగా, ఇందులో 70 శాతం సన్న రకాలు వేశారు. మొత్తం 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో 1,17,850 ఎకరాలు వరి సాగు చేశారు. 1,62,414 మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం గ్రేడ్ఏ రకం క్వింటాలుకు రూ.2,320, గ్రేడ్ బీ రకం రూ.2,300 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. సన్నాలకు బోనస్రూ.500 కలిపి క్వింటాలుకు రూ.2,820 చెల్లించనున్నారు.
మహిళా సంఘాలకు ప్రాధాన్యం
కాంగ్రెస్ సర్కారు మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వహణలోనూ వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ జోక్యం, అవినీతి అక్రమాలు జరుగుతున్నందున ఈసారి డీసీఎమ్మెస్ సెంటర్లను రద్దు చేశారు.
డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ, మెప్మా సంఘాలకు ఎక్కువ సంఖ్యలో సెంటర్లను కేటాయించారు. అలాగే పీఏసీఎస్(పాక్స్)లకు సైతం సెంటర్లను కేటాయించారు. ఈ మేరకు గ్రామాల వారిగా డీఆర్డీఏ, పాక్స్సెంటర్ల లిస్టులు రెడీ చేశారు. సెంటర్ల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లతో గత సోమవారం అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) సబావత్ మోతీలాల్ మీటింగ్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు చేశారు.
డీఫాల్ట్ మిల్లులకు నో
మంచిర్యాల జిల్లాలో మొత్తం 54 రైస్‌మిల్లులు ఉండగా ప్రభుత్వానికి దాదాపు రూ.130 కోట్ల విలువైన సీఎమ్మార్ ధాన్యం అప్పజెప్పాల్సి ఉంది. దీంతో ఈ మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే డీఫాల్ట్ మిల్లులకు ఈసారి యాసంగి ధాన్యం ఇచ్చేది లేదని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 14 బాయిల్డ్ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ మిల్లులకు కేటాయించగా మిగిలిన ధాన్యాన్ని పక్క జిల్లాల్లోని మిల్లులకు పంపనున్నారు.