ఏండ్లనాటి కల తీరింది మున్సిపాలిటీగా మారనున్న ములుగు

ఏండ్లనాటి కల తీరింది మున్సిపాలిటీగా మారనున్న ములుగు
  • మంత్రి సీతక్క జోక్యం 
  • మంత్రి వర్గం ఆమోదం
  • నాలుగు జీపీలతో  ప్రపోజల్స్​
  • మిన్నంటిన సంబురాలు

జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, వెలుగు:  ములుగు ప్రజల ఏండ్ల నాటి కల నెరవేరనున్నది. జిల్లా కేంద్రం త్వరలో మున్సిపాలిటీగా మారబోతోంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు కానున్నది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ములుగును ఎన్నికల సమయంలో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఫైల్​ పంపించినా గవర్నర్​ వద్ద పెండింగ్ పడింది. 

ప్రస్తుత రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో గవర్నర్​ను కలిసి అడ్డంకులను తొలగించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గం ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటుచేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో ములుగులో సంబురాలు జరుపుకుంటున్నారు.

నాలుగు పంచాయతీలతో కలిపి..

ములుగు జిల్లాపై గత పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. జిల్లాల పునర్విభజన 2016 అక్టోబర్​ 11న జరిగాయి. అప్పుడు ములుగు జిల్లా ఏర్పాటు చేయలేదు. స్థానికుల పోరాటాలతో 2019, ఫిబ్రవరి 17న ములుగు జిల్లాను ప్రకటించారు. మల్లంపల్లి మండలం, ములుగు మున్సిపాలిటీలను సైతం 2023 ఎన్నికల సందర్భంలోనే గెజిట్​ నోటిఫికేషన్లు వెలువరించారు. 

కానీ, రిపోర్టులు సరిగా లేకపోవడంతో జాప్యం జరిగింది. స్థానిక మంత్రి సీతక్క చొరవతో ఇటీవల మల్లంపల్లిని మండలంగా ప్రకటించగా, శనివారం ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి, జాకారం గ్రామపంచాయతీలను కలుపుతూ ప్రభుత్వానికి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం అధికారులు ప్రపోజల్స్ పంపించారు. 

దీంతో నాలుగు పంచాయతీలతో ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 2011జనాభా లెక్కల ప్రకారం ములుగు జీపీ పరిధిలో 12,135 మంది, బండారుపల్లి, జీవంతరావుపల్లిలో 4398, జాకారంలో 1519 మంది, మొత్తం 18,052 మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిందని, సుమారు 25 వేల మంది జనాభా ఉండొచ్చిన ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. కాగా, ములుగు మున్సిపాలిటీకి మంత్రివర్గం ఆమోదం లభించగా గవర్నర్​ ఆమోదంతో ప్రక్రియ పూర్తికానుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలోనే పాలనాపరమైన ఏర్పాటు చేయనున్నట్లు డీపీవో దేవరాజ్​ తెలిపారు.

మిన్నంటిన సంబురాలు..

ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ బానోతు రవిచందర్​ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఆదివారం ములుగులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఫొటోలకు కాంగ్రెస్​నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. 

కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఎండీ.చాంద్ పాషా, ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మారం సుమన్ రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్ చిక్కుల రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నాం..

ప్రజలకు కనీస అవసరాలు తీర్చడమే లక్ష్యంగా మెరుగైన పాలన కోసం ప్రభుత్వం నిర్ణయాలను త్వరగా తీసుకుంటోంది. పెండింగ్​ ప్రక్రియలను పూర్తిచేస్తున్నాం. ఇటీవలే మల్లంపల్లి మండలాన్ని ప్రకటించుకొని, ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు. పట్టణ ప్రణాళిక రూపొందించుకొని ప్రణాళికా బద్ధంగా సుందరీకరణ చేపడుతాం. మెరుగైన సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నాం.– మంత్రి సీతక్క