మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆదివారం రాత్రి ఆయనను బీజేపీ నుంచి ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో యెన్నం కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఏడాదిగా బీజేపీకి దూరం దూరం
మునుగోడు బైపోల్ తర్వాత అంటే దాదాపు ఏడాదిగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ హైకమాండ్ స్టాండ్ మార్చిందని గతంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో జాతీయ, రాష్ట్ర నాయకుల పర్యటనలకు కూడా కొన్ని సందర్భాల్లో వెళ్లలేదు. బీజేపీ స్టేట్ చీఫ్‌ను మార్చి తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని అప్పట్లో యెన్నం డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో యెన్నం నిరుత్సాహంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. రెండు నెలలుగా పార్టీకి ఆయన మరింత దూరం అయ్యారు.
కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్!
కొన్నిరోజులుగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని ఆయన ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది. ఇదే క్రమంలో గత ఆదివారం మహబూబ్‌నగర్ టౌన్‌తో పాటు హన్వాడ మండలానికి చెందిన లీడర్లతో యెన్నం రహస్యంగా భేటీ అయ్యారు. తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని, సపోర్ట్ చేయాలని కేడర్‌ను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదే రోజు రాత్రి యెన్నంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 9 లేదా 19వ తేదీన కాంగ్రెస్‌లో చేరేందుకు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈయన బాటలోనే దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన మరో లీడర్ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు లోకల్ పాలిటిక్స్‌లో టాక్ ఉంది.
2012 బైపోల్లో ఎమ్మెల్యేగా గెలుపు
యెన్నం తెలంగాణ ఉద్యమకారుడు. మొదట టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) చేరిన ఆయన 2004లో అసెంబ్లీ టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో ఈ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2012లో మహబూబ్‌నగర్ బై పోల్‌లో బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆయనకు 39,385 ఓట్లు పోల్ కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంకు 37,506 ఓట్లు పోల్ అయ్యాయి. 1,879 ఓట్ల మెజార్టీతో యెన్నం గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయగా వి.శ్రీనివాస్‌గౌడ్ యెన్నంపై 3,139 మెజార్టీతో గెలుపొందారు.