పెళ్లికాని వారు చేసే హోమం ఇదే..

పెళ్లికాని వారు చేసే హోమం ఇదే..

పూర్వ కాలం నుండి  హోమాలు నిర్వహించే సంప్రదాయం ఉంది. గ్రహాల ప్రభావంతో ఏమైనా ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటే.. వాటిని శాంత పరచేందుకు హోమం నిర్వహిస్తారు. హోమంలో మనం సమర్పించే వస్తువులతో, మనం కోరుకున్న కోరికలను అగ్నిదేవుడు నేరుగా దేవుళ్లకు చెబుతారని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా హోమాల్లో ఎన్ని రకాలున్నాయి?  వివాహ విషయంలో ఆటంకాలు ఎదురైతే ఏ హోమం చేయాలి.. ఇంకా కొన్ని హోమాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హిందూ మత విశ్వాసాల ప్రకారం, హోమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఎవరి జాతకంలో ఏదైనా దోషం ఉంటే హోమం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అలాగే సకాలంలో వర్షాలు కురవాలని పండితులు హోమం చేస్తుంటారు. ఈ హోమానికి మతపరంగా మాత్రమే కాదు.. శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. 

 గణపతి హోమం.. ఎవరైతే తమ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో.. వాటి నుండి బయటపడేందుకు.. వినాయకుని అనుగ్రహం పొందడానికి గణేష్ హోమం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుండి సులభంగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉందని పండితులు చెబుతున్నారు.
 
శివ హోమం:  ఎవరైతే పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో.. ఇరు కుటుంబాల వారు మాట్లాడుకున్న క్యాన్సిల్ అయ్యే సందర్భాలను ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో.. అలాంటి వాటి నుండి ఉపశమనం పొందడానికి సోమవారం రోజున శివుడిని స్మరించుకుంటూ నలుగురు పండితుల సమక్షంలో శివ హోమం చేస్తే పెళ్లి సంబంధిత సమస్యలకు కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. 

సరస్వతీ హోమం: ఎవరైతే విద్యలో వెనుకబడి ఉంటారో.. వారు ఈ హోమాలను కచ్చితంగా చేయాలంటున్నారు పండితులు. నీల సరస్వతీ దేవి హోమం, దక్షిణా మూర్తి హోమం, విద్యా గణపతి హోమం, బుద్ధి గణపతి హోమం, సిద్ధి గణపతి హోమం వంటివి చేయడం వల్ల మీరు పిల్లల విద్య సంబంధిత సమస్యల నుండి కచ్చితంగా పరిష్కారాన్ని పొందుతారు. 

మహా సుదర్శన హోమం:  మనలో చాలా మందికి ప్రత్యర్థులు ఉంటారు. కొందరు ప్రత్యర్థులు నేరుగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తే.. మరి కొందరు పరోక్షంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారి నుండి రక్షణ పొందడం కోసం మహా సుదర్శన హోమం, అఘోరాష్ట హోమం, ప్రతియాంగిర హోమం, బగల ముఖ హోమం చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

 కుబేర లక్ష్మీ హోమం:  హిందూ ధర్మానుసారంగా... సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరున్ని పూజిస్తాము.జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం సూచింపబడేదే లక్ష్మి కుబేర పాశుపతహోమం.జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీ వా పరిగణిస్తాము కనుక. హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి నిర్ణయించబడిన ముహూర్తానికి ఈ హోమం చేయబడును. ఈ హోమం చేయడానికి కమలాలని వాడడం జరుగుతుంది.. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారో.. వాటి నుండి బయటపడేందుకు లక్ష్మీ నారాయణ హ్రుదయ నిలయం, కుభేర లక్ష్మీ హోమం,

చండి హోమం: హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరిసంపదల కోసం చండి హోమం నిర్వహించడం జరుగుతుంది. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవమి రోజులలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది. చండికా హోమం వంటివి చేస్తే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.

 ధన్వంతరీ హోమం.. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారో.. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదో.. అలాంటి సమయంలో ఆ వ్యాధి నుండి ఉపశమనం పొందేందుకు ధన్వంతరీ హోమం, నవగ్రహ హోమం వంటివి చేస్తే కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది