యువకుడిని రైళ్లో నుంచి తోసేసిన ట్రాన్స్​జెండర్లు

కోల్​బెల్ట్, వెలుగు: రైళ్లో ప్రయాణిస్తున్న తమ స్నేహితుడితో ట్రాన్స్​జెండర్లు గొడవపడి అతడిని తోసేశారని తోటి మిత్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో సదరు యువకుడు తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సత్యేందర్(25) మరికొందరు మిత్రులతో కలిసి పనికోసం దానాపూర్-సికింద్రాబాద్​ఎక్స్​ప్రెస్ రైల్లో హైదరాబాద్​కు బయలుదేరారు. అయితే, రైళ్లో ట్రాన్స్​జెండర్లతో సత్యేందర్​కు గొడవ జరిగింది. దీంతో అతడిని కొట్టి మందమర్రి రైల్వే స్టేషన్​సమీపంలోని రైల్వే గేటు వద్ద తోసేశారని తోటి మిత్రులు పేర్కొంటున్నారు. 

వారిచ్చిన సమాచారంతో మంచిర్యాల రైల్వే పోలీసులు సత్యేందర్​కోసం గాలించి మందమర్రి రైల్వే గేటు సమీపంలో అతడిని గుర్తించారు. తీవ్రంగా గాయపడి ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతిచెందాడు. అయితే, ఈ మృతిపట్ల రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్​జెండర్లు తోయడం వల్ల పడిపోయాడా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే  విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.