- కొత్త ఆర్వోఆర్ చట్టం–2024ను అసెంబ్లీలో ఆమోదిస్తం: మంత్రి పొంగులేటి
- ధరణి పోర్టల్ ప్రక్షాళనకు చర్యలు చేపడ్తున్నం
- ప్రతి గ్రామానికో రెవెన్యూ అధికారి ఉండేలా కార్యాచరణ
- జర్నలిస్టుల జాగాలపై త్వరలో మీటింగ్ నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎర్రవల్లిని రాజధానిగా.. ఫామ్‌హౌస్ ను సెక్రటేరియెట్ గా చేసుకొని.. ఎవరి మాటా వినకుండా ఒక రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్టు పాలించిన వారిది (కేసీఆర్) తుగ్లక్ పాలన కాదా? అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. సచివాలయం నుంచి ప్రజా పాలన నిర్వహిస్తూ.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజలకు మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటూ ప్రజా వాణిని నిర్వహిస్తున్న తమ ప్రభుత్వానిది తుగ్లక్ పాలన ఎలా అవుతుందని అన్నారు. ఆదివారం సెక్రటేరియెట్‌లో ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ శతాబ్దానికి కేసీఆర్ ఒక్కడే తుగ్లక్ అని విమర్శించారు. పదేండ్లు ప్రజల నెత్తిన టోపీ పెట్టిన అసలు సిసలు తుగ్లక్ మహారాజ్ కేసీఆర్ అని, ఆ టైటిల్ కు ఇప్పుడే కాదు మరో 50 ఏండ్ల వరకు కూడా ఎవరూ పోటీకి రారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఏడాదిలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ప్రగతిని మీడియాకు వివరించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో రెవెన్యూ పెరిగిందని, అయితే తాము అంచనా వేసినంత మేర పెరగలేదని చెప్పారు. దేశమంతా రియల్ ఎస్టేట్ కొంత స్లో ఉన్నదని తెలిపారు.
రాష్ట్రంలో రెవెన్యూ, ఆదాయం తగ్గిందని, హైదరాబాద్ లో మాత్రమే రియల్ ఎస్టేట్ స్లో అయిందని ప్రతిపక్షాలు చేసే విమర్శలు కరెక్ట్ కాదని అన్నారు. ఏడాది ఉత్సవాల తర్వాత జాగాలపై జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహిస్తానని, అనంతరం సీఎం తో చర్చిస్తామని తెలిపారు. జర్నలిస్టుల సొసైటీ భూముల రద్దు తీర్పు బాధాకరమన్నారు.
ఒక్కో గ్రామానికి ఒక్కో రెవెన్యూ ఉద్యోగి!
రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక్కో గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగిని నియమించేందుకు కార్యాచరణ రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే 4 ఏండ్లలో దశలవారీగా సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 –4,000 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 34,544 డబుల్ బెడ్ రూం ఇండ్లను రూ.305 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా అర్హులైన వారికి ఈ ఇండ్లను పంపిణీ చేస్తామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
ధరణి ప్రక్షాళనకు చర్యలు
ఒక వైపు ధరణి పోర్టల్ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు చేపడుతూనే.. మరోవైపు ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కరిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 2024 మార్చి ఒకటి నుంచి మార్చి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 2.46 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా.. 1.38 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని వివరించారు.
2020 ఆర్‌వోఆర్ చట్టంలో లోపాలు సవరించి.. 2024 ఆర్‌వోఆర్ చట్టం తెస్తున్నాం. కొత్త చట్టాన్ని సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తాం. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది’’ అని తెలిపారు. గత ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందని, కానీ, రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని చెప్పారు.