జగిత్యాల టౌన్, వెలుగు : కొడిమ్యాల ఎస్‌ఐ కొట్టాడని ఓ యువకుడు జగిత్యాల ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కొడిమ్యాల మండలకేంద్రంలో ఎస్‌ఐ సందీప్ సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించారు. అదే సమయంలో రాచకొండ రాజేందర్ అనే యువకుడు వారి నుంచి పట్టించుకోకుండా వెళ్లిపోయడు. ఆగ్రహించిన ఎస్‌ఐ యువకుడిని వెంబడించి అతని ఇంటికి వెళ్లి బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డుపై లాఠీ విరిగేదాకా కొట్టినట్లు ఆరోపించాడు. ఇంట్లో ఉన్న తన భార్య, తల్లి వచ్చి ఎస్ఐ కాళ్ల మీద పడినా కనికరించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడిలో రాజేందర్ చెవికి తీవ్ర గాయం కావడంతో హాస్పిటల్‌కు వెళ్లగా కర్ణభేరికి పగిలిందని చెప్పారు.
దీంతో సోమవారం జగిత్యాల ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ సందీప్ ను వివరణ కోరగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో సహరించకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని, ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశామన్నారు. రాజేందర్‌ను కొట్టలేదని, తాగిన మత్తులో వాహనం నడపడంతో కింద పడి గాయాలైనట్లు ఎస్‌ఐ తెలిపాడు. అలాగే కొడిమ్యాల ఎస్‌ఐపై మరికొందరు ఫిర్యాదు చేశారు. భూ తగాదాలో ఎలాంటి విచారణ చేయకుండానే తమపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారని మండల కేంద్రానికి చెందిన నాంపల్లి హన్మండ్లు, శ్రీధర్, శ్రీకాంత్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.