గంజాయి తాగుతూ పోలీస్​ స్టేషన్​ ఎదుట రీల్స్..​సీఎం రేవంత్​ ట్యాగ్​ చేసిన నెటిజన్లు

గంజాయి తాగుతూ పోలీస్​ స్టేషన్​ ఎదుట రీల్స్..​సీఎం రేవంత్​ ట్యాగ్​ చేసిన నెటిజన్లు

ఫేమస్ అయిపోయి మస్తుగా డబ్బులు సంపాదించాలన్న మోజులో.. కొంత మంది ఓవరాక్షన్‌ చేస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. మరికొంత మందైతే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలా ఓవరాక్షన్ చేసిన యువకుడు ఇప్పుడు జైలు పాలయ్యాడు. జైల్‌లో పెట్టేంతా ఓవరాక్షన్ ఆ యువకుడు ఏం చేశాడంటే..

సోషల్​ మీడియాలో రీల్స్​.. షార్ట్​ వీడియోలకు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఇది ఫేమస్​ అయ్యేందుకే కాదు... .. లైకులు కురిసినట్టుగానే కాసులు కూడా కురిపిస్తాయి ఈ వీడియోలు. అందుకే చాలా మంది యువత ఇప్పుడు వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఓ యువకుడు రాంగోపాల్​ పేట పోలీస్​ స్టేషన్​ ఎదుట ఓవర్​ యాక్షన్​ చేశాడు.  ఇక అంతే... ఈ వీడియోను చూసిన నెటిజన్లు సీఎం రేవంత్​ రెడ్డికి ట్యాగ్​ చేశారు.   ఆతరువాత పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి ఎనిమిదిరోజుల పాటు జైలు శిక్ష విదించారు. 

సికింద్రాబాద్ రాంగోపాలపేట పోలీస్ స్టేషన్ ముందు వంశీకృష్ణ అనే యువకుడు ఓవరాక్షన్ చేశాడు. పోలీస్ స్టేషన్ ముందే గంజాయి తాగుతూ.. ఓ ర్యాప్ సాంగ్‌కు రీల్ చేశాడు. చేసినోడు ఊరికే ఉంటాడా.. ఆ రీల్‌ను ఇన్‌స్టాగ్రాంలో పెట్టాడు. అయితే.. ఇన్‌స్టాగ్రాంలో వంశీకృష్ణ పోస్టును చూసిన పలువురు నెటిజన్లు.. ఆ పోస్టును ట్విట్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు వంశీ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా.. వంశీకృష్ణకు ఎనిమిది రోజుల జైలు శిక్షను విధించారు.

అయితే.. పోలీసులు ఆ యువకున్ని కేవలం అరెస్ట్ చేయటంతో పాటు రీల్ వర్సెస్ జైలు అనే పేరుతో.. పాత వీడియోతో పాటు వంశీకృష్ణను చంచల్ గూడ్ జైలుకు పంపించే వీడియోను కూడా కలిపి రీల్ క్రియేట్ చేసి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి ఓవరాక్షన్లు చేస్తే.. జైలుకు వెళ్లటం పక్కా అన్న వార్నింగ్‌ను ఈ వీడియో ద్వారా యువతకు పోలీసులు జారీ చేశారు.

ఇప్పటికే.. మత్తు పదార్థాలపై దృష్టి సారించిన పోలీసులు.. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు.   పోలీసులు కూడా ఎక్కడ చిన్న క్లూ దొరికినా.. ఛాన్స్ తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్తే.. కఠిన చర్యలు తప్పవని యువతకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.