రూ.5 కోట్లిస్తావా..వీడియోలు బయటపెట్టాలా.?.. జుక్కల్ ఎమ్మెల్యేకు బెదిరింపు

రూ.5 కోట్లిస్తావా..వీడియోలు బయటపెట్టాలా.?.. జుక్కల్ ఎమ్మెల్యేకు బెదిరింపు
  • జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు బెదిరింపులు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జుక్కల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును బ్లాక్‌‌‌‌‌‌‌‌ మెయిల్‌‌‌‌‌‌‌‌ చేసిన యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ చానల్​ రిపోర్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనం శ్యామ్‌‌‌‌‌‌‌‌, దండానియ నిరూప అనే మహిళను రాజేంద్రనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పోలీసుల ప్రకారం.. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు రాజేంద్రనగర్ సన్ సిటీలో నివాసం ఉంటున్నారు. రెండు వారాల క్రితం  ‘ప్రజా వాయిస్ న్యూస్‌‌‌‌‌‌‌‌ ఛానల్’ పేరుతో మేనం శ్యామ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి కాల్‌‌‌‌‌‌‌‌ చేశాడు. తానను తాను జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌గా పరిచయం చేసుకున్నాడు. 

ఈ నెల15న కలిసేందుకు అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని కోరాడు. అదే రోజు సాయంత్రం 7.30 గంటలకు నిరూప, మరికొందరితో కలిసి మేనం శ్యామ్‌‌‌‌‌‌‌‌  హైదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు వచ్చాడు.  లక్ష్మీకాంతరావు వ్యక్తిగత వీడియోలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడ్తామని నిందితులు బెదిరించారు. వాటిని తమ యూట్యూబ్​చానెల్ లో ప్రసారం చేయకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

పొలిటికల్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాశనం అవుతుదంటూ బ్లాక్ మెయిల్‌‌‌‌‌‌‌‌ చేశారు. శ్యామ్‌‌‌‌‌‌‌‌, నిరూప వేధింపులు పెరిగిపోవడంతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును మంగళవారం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి..శ్యామ్‌‌‌‌‌‌‌‌, నిరూపను గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, డెస్క్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌‌‌‌‌ విధించడంతో నిందితులను చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు తరలించారు.