చాలామందికి టూర్లకు వెళ్లాలని ఉంటుంది. కానీ.. ఖర్చుకు భయపడి వెళ్లలేకపోతుంటారు. వ్లాగర్ జిన్షా బషీర్ మాత్రం అలా ట్రిప్‌కి వెళ్లినప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలతో అక్కడ ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువే సంపాదిస్తోంది. ఇంజనీర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఫుల్ టైం యూట్యూబర్ వ్లాగర్‌గా మారిన జిన్షా గురించి మరిన్ని విశేషాలు..
జిన్షా ఒకసారి పెట్రోల్ బంక్‌కు వెళ్లి బైక్‌లో ఫ్యూయెల్ కొట్టించింది.అప్పుడు బంక్ ఉద్యోగి మెషీన్ ట్యాంపరింగ్ చేసి.. వాళ్లు ఇచ్చినడబ్బుకంటే తక్కువ పెట్రోల్ పోశాడు. అది గమనించిన జిన్షా వెంటనే అతన్ని నిలదీసింది. కానీ.. అతను రచ్చ చేయొద్దని ఇది అందరికీ తెలిసిందేనని ఆమెతో వాదించాడు. ఆ తర్వాత జిన్షా పెట్రోల్ బంక్‌లోని మరో ఉద్యోగిని పిలిచి ట్యాంపరింగ్ గురించి అడిగింది. అప్పుడు అతను ఆమెకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాడు.
అదేంటంటే.. సాధారణంగా అందరూ 100, 200, 300.. ఇలా రౌండ్ ఫిగర్ అమౌంట్‌కి పెట్రోల్ కొట్టిస్తుంటారు. కొందరు సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్ చేసి అలాంటి అమౌంట్స్తో పెట్రోల్ కొట్టించినప్పుడు కాస్త తక్కువగా వచ్చేలా సెట్ చేస్తుంటారు. కాబట్టి 105, 110.. ఇలా కాస్త ఎక్కువ, లేదా కాస్త తక్కువ అమౌంట్‌కి పెట్రోల్ కొట్టించాలని సలహా ఇచ్చాడు. ఆ విషయాన్ని అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో జిన్షా ఒక వీడియో రికార్డ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ ఒక్క వీడియోతో జిన్షా సెలబ్రిటీ అయిపోయింది. ఒక్కరోజులోనే తన పేజీకి 5,000 లైక్స్ వచ్చాయి. అప్పటినుంచి రెగ్యులర్‌గా వీడియోలు చేస్తోంది.
నెగెటివిటీ
వీడియోలు చేయడం మొదలుపెట్టిన కొత్తలోనే సోషల్ మీడియాలో కొందరు ఆమెపై ట్రోలింగ్ చేశారు. నెగెటివిటీ పెరిగింది. అలాంటి పరిస్థితులను కూడా ఆమె ఈజీగా ఎదుర్కొంది. ఆమెపై, ఆమె తండ్రిపై అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లు పెట్టిన వ్యక్తి ఫేస్‌బుక్ పేజీని స్క్రీన్‌షాట్ తీసి దానిని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. కొన్ని నిమిషాల్లో ఆ వ్యక్తి పిల్లలు, బంధువులు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ఫేస్‌బుక్ పేజీని కూడా డిలీట్ చేశారు.
సాయం చేసే గుణం
జిన్షా తన ప్రయాణంలో ఎదురుపడే వాళ్లలో ఎవరికైనా సాయం అవసరమైతే కచ్చితంగా చేస్తుంది. మలప్పురానికి చెందిన ఏడాది వయసున్న ఆయేషాకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న జిన్షా ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. నెల రోజుల్లోనే అయేషా కుటుంబానికి రూ.30 లక్షలు విరాళంగా వచ్చాయి. కేరళలోని కోజికోడ్‌లో ఉంటున్న మునీర్‌కు ముగ్గురు కూతుళ్లు. సొంతిల్లు కూడా లేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడని తెలిసి జిన్షా అతనికి సాయం చేయాలి అనుకుంది. అతని పరిస్థితిని వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇప్పుడు మునీర్ కష్టాలు దాదాపుగా తీరిపోయాయి. అతనికి ఇంటి కోసం సుమారు రూ. 4 లక్షల సాయం అందింది.
ఫేస్‌బుక్‌లోనే ఎక్కువ
జిన్షా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఎక్కువగా వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ‘జిన్షా బషీర్’ పేరుతో 2015లోనే యూట్యూబ్ చానెల్ పెట్టింది. ఏడేండ్ల నుంచి ఇప్పటివరకు 462 వీడియోలు అప్లోడ్ చేసింది. కానీ.. చానెల్‌కు 2 లక్షల 74 వేల మంది సబ్స్క్రయిబర్లు మాత్రమే ఉన్నారు. ఆమె ఫేస్‌బుక్ పేజీని మాత్రం ఏకంగా 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అందుకే ఆమె వీడియోలకు ఫేస్‌బుక్‌లోనే రీచ్ ఎక్కువ వస్తుంటుంది.
ట్రావెలింగ్ అంటే ఇష్టం
జిన్షా బషీర్ ఉత్తరప్రదేశ్‌లోని ఉత్రౌలాలో పుట్టింది. వాళ్ల నాన్న బషీర్ సైనికాధికారిగా పనిచేసేవాడు. అమ్మ బరీషా నర్సు. జిన్షాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం కేరళలోని తిరువళ్లకు దగ్గర్లోని చారుమ్మూడు గ్రామానికి వచ్చేసింది. జిన్షా ఇంజినీరింగ్ పూర్తైన తర్వాత ఐటీ సంస్థలో ఉద్యోగంలో చేరింది. ఆమెకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఇష్టం. చదువుకునే టైంలోనే మైసూరు, మధురై లాంటి దగ్గర్లో ఉన్న సిటీలకు వెళ్లింది. తాజ్‌మహల్, ఆగ్రా, కుతుబ్ మినార్ లాంటివి అప్పట్లో ఆమె డ్రీమ్ డెస్టినేషన్లు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఫైజల్‌ను పెండ్లి చేసుకుంది. పెండ్లి తర్వాత మొదటి వీకెండ్లోనే ఇద్దరూ కలిసి వాగమోన్‌కు టూర్ వెళ్లారు.
తర్వాత ఐటీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆమెకు ఖతార్‌లో టీచర్ జాబ్ ఆఫర్ వచ్చింది. స్కూల్ మేనేజ్మెంట్ ఆమెను పిల్లలకు పాఠాలు చెప్తూ ఒక వీడియో తీసి పంపమని అడిగింది. ఆమె కూడా తీసి పంపింది. దానికి వాళ్లు రిప్లై ఇచ్చే లోపే ఇక్కడ ‘పెట్రోల్ బంక్’ వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది. దాంతో జిన్షా ఖతార్‌కు వెళ్లాలనే నిర్ణయాన్ని మార్చుకుని వ్లాగింగ్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఫైజల్ కూడా తన నిర్ణయాన్ని గౌరవించాడు. తర్వాత తన మొదటి వ్లాగ్ ట్రిప్‌లో భాగంగా మసినగుడి నుండి కల్లట్టి పాస్ మీదుగా ఊటీకి వెళ్లింది. అప్పటినుంచి రెగ్యులర్‌గా వ్లాగ్‌లు, బైక్ రైడ్స్ చేస్తోంది జిన్షా. ఆమె విదేశాలకు కూడా వెళ్లొచ్చింది.