గండిపేటలో కీచక టీచర్​పై సస్పెన్షన్ వేటు

గండిపేట, వెలుగు: అమ్మాయిలకు మాత్రమే స్పెషల్​ క్లాసులు పెట్టి, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్​పై సస్పెన్షన్ వేటు పడింది. రాజేంద్రనగర పరిధిలోని బుద్వేల్‌‌ జడ్పీహెచ్ఎస్​లో ఎన్‌‌. వేణుగోపాల్‌‌ ఆరున్నర ఏళ్లుగా ఫిజిక్స్, సైన్స్‌‌ పాఠాలు చెప్తున్నాడు. సాయంత్రం స్కూల్​ ముగిసినప్పటికీ బాలికలను ఇంటికి పంపకుండా రాత్రి 8 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పలువురు బాలికల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థులు మహిళా టీచర్లకు చెప్పగా, వారు స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు.

 దీంతో ప్రశ్నించిన ప్రిన్సిపల్​ను కూడా అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం స్కూల్​కు చేరుకొని, సదరు టీచర్​ను చితకబాదారు. రాజేంద్రనగర్​ ఎంఈవోకు ఫిర్యాదు చేయడంతో  వేణుగోపాల్‌‌ను విధుల నుంచి సస్పెండ్‌‌ చేశారు. మరోవైపు, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.