338 కోట్లు మోసం చేసిన ‘రోబో’ తెలుగు నిర్మాత

  • కెనెరా బ్యాంకుకు రూ.281.61 కోట్లు 
  • ఐడీబీఐ బ్యాంకుకు రూ.53.76 కోట్లు  

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘రోబో’ సినిమాను తెలుగులో విడుదల చేసి లాభాలు గడించిన నిర్మాత తోట కన్నారావు.. నిజజీవితంలో బ్యాంకులకు రోబో సినిమా స్టైల్ లో గ్రాఫిక్స్ మాయాజాలం సృష్టించి చేసిన భారీ మోసం విలువ రూ.338 కోట్లుగా తేలింది. ఈ మేరకు కెనెరా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి. 
నిర్మాత తోట కన్నారావు కంపెనీని పెట్టి ఫేక్ పత్రాలతో బ్యాంకుల దగ్గర పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని 2017లోనే దివాళ తీసిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట కన్నారావు  మొక్క జొన్న, వేప గింజల వ్యాపారం చేసేవాడు. 2010లో  ‘రోబో’ సినిమాను తెలుగులో విడుదల చేసి భారీ లాభాలు గడించాడు. సినిమా విజయం తెచ్చిన ఉత్సాహమో లేక మరే ఉద్దేశంతో చేశాడోగాని నిజ జీవితంలో మల్టీ కలర్‌ గ్రాఫిక్స్  సినిమా చూపించాడని బ్యాంకర్లు చెబుతున్నారు. 
తన వ్యాపార సంస్థ శ్రీ కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్  నెట్‌వర్త్‌ రూ. 744.88 కోట్లని, తన భార్య నెట్‌వర్త్‌ రూ.62.70 కోట్లని బ్యాంకులకు  నమ్మించారు. శంకర్‌, రాజమౌళి సినిమాల్లోని గ్రాఫిక్స్ ను మరింపించే రేంజిలో తన వద్ద సరుకు స్టాక్‌ ఉందని బ్యాంకులకు తప్పుడు  లెక్కలు చూపారు. 2014లో రూ.232.08 కోట్ల నిల్వలు ఉన్నాయని సర్టిఫికెట్లు చూపించి ఆడిటర్‌ సర్టిఫికేషన్‌ కూడా ఇచ్చి రుణాలు తీసుకున్నాడు. వేర్వేరు ప్రాంతాల్లో తనకు ఉన్న 13 ఓపెన్ ప్లాట్లు, ఒక రెసిడిన్షిల్ ఫ్లాట్ ను తాకట్టుపెట్టి కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో కన్సార్టియం రూ.152 కోట్లు, ఐడిబీఐ బ్యాంక్‌ రూ.30 కోట్ల రుణం తీసుకున్నాడు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చిందని 2017లో దివాలా తీయడంతో తాము మార్టగేజ్ చేసుకున్న సరుకు ఎంతుందో చూసేందుకు వెళ్లిన బ్యాంకులకు స్టాక్‌ విలువ కేవలం రూ.28.34 కోట్లని తెలిసి తెల్ల మొహం వేశారు. 
తూర్పు గోదావరి జిల్లాలో ఆయన చూపిన ఆ ఆస్తుల విలువ రూ.232.23 కోట్లు. ఎపిట్కో, మిట్కాన్‌  సంస్థల వాల్యూయేషన్‌ను బట్టి రుణాలు ఇచ్చిన బ్యా బ్యాంకులు ఆస్తులను వేలం వేయడానికి ప్రయత్నించగా రోబో సినిమా స్టైల్ లో గ్రాఫిక్స్ కనిపించాయి. 2019 జూన్ 12నాటికి మొత్తం 14 ఆస్తుల విలువ కేవలం రూ. 31.15 కోట్లని తేలింది. వీటిని అమ్మితే  కొంచెం అటు ఇటుగా 30 కోట్లు కూడా రావని తెలిసి బ్యాంకులు తెల్లమొహం వేశాయి. తమకు బకాయిపడిన మొత్తం దాదాపు రూ.281.61 కోట్లు అని, ఐడీబీఐకు ఇవ్వాల్సింది రూ.53.76 కోట్లు అని వెరశి మొత్తం 3338.37 కోట్లు చెల్లించాల్సి ఉందని సీబీఐకు ఫిర్యాదు చేశాయి. ఈ కేసును  గత నెల 30న హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో బ్యాంకు అధికారులు దాఖలు చేశారు.