హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ( నవంబర్ 1, 2024 ) చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఫలక్ నుమ కు చెందిన మహ్మద్ అబ్దుల్ రెహన్ తన స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో సంగారెడ్డికి బయిలుదేరాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై వట్టినాగులపల్లి వద్ద కారు టైర్ పగలి అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. మహ్మద్ అబ్దుల్ రెహన్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హస్పటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ ఘటనలో గాయపడ్డ ఆరుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు పోలీసులు.
డ్రైవర్ కారును నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహ్మద్ అబ్దుల్ రెహన్ బంధువులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.