బెంగళూరులో లేజర్ ఇంటర్నెట్
‘వైఫై డబ్బా’తో ఇంటర్నెట్ కనెక్షన్
సిటీ అంతటికీ ‘సస్తా నెట్’ ఇస్తామంటున్న కంపెనీ
ప్రధాన కంపెనీలకు గట్టి పోటీ తప్పదంటున్న అనలిస్టులు
ఒక్క రూపాయికే ఒక జీబీ డేటా. అది కూడా1జీబీపీఎస్ స్పీడ్‌తో. అంతేకాకుండా.. పైసల్లేకుండా ఫ్రీగా కూడా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మొబైల్లో క్యాప్చా కోడ్ పజిల్స్ సాల్వ్ చేసి, లేదా అడ్వర్టైజ్మెంట్ వీడియో చూసి కూడా ఫ్రీ వైఫైని వాడుకోవచ్చు. అవునా! ఏ కంపెనీ? ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నరా? ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ‘వైఫై డబ్బా’ అనే స్టార్టప్ ఈ ఒక్క రూపాయి ఇంటర్నెట్ ను ఇదివరకే విజయవంతంగా టెస్ట్ చేసింది. త్వరలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేనుంది. అవునూ.. పెద్ద పెద్ద కంపెనీలే చేతులెత్తేస్తున్నయ్. ఈ స్టార్టప్ కంపెనీ ఇంత డెడ్ చీప్‌గా ఇంటర్నెట్ ఎట్లిస్తది? అది కూడా1జీబీపీఎస్ స్పీడ్‌తో అని డౌటొచ్చిందా? అయితే అన్ని కంపెనీల మాదిరిగా ఈ కంపెనీ కేబుల్స్, ఫైబర్ ఆప్టిక్స్, ఇంకా బోలెడు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో ఇంటర్నెట్ ఇవ్వదు. ఈ కంపెనీ ఇచ్చేది ‘లేజర్ ఇంటర్నెట్’. అందుకే ఇది మస్త్ ‘సస్తా ఇంటర్నెట్’ అని ఈ స్టార్టప్ నిర్వాహకులు చెప్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ లైవ్
ఇంత చీప్ గా ఇంటర్నెట్ ఎలా?
ఇప్పుడున్న కంపెనీలకు భిన్నంగా తక్కువ ఖర్చుతోనే ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో వైఫై డబ్బాను2016లో ప్రారంభించారు ఆ సంస్థ సీఈఓ కరమ్ లక్ష్మణ్. మొదట్లో ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీపై ఆధారపడి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడంపై టెస్ట్ చేశారు. కానీ ఫైబర్ ఆప్టిక్ వల్ల సస్తా ఇంటర్నెట్ సాధ్యం కాదని కొద్దిరోజుల్లోనే తెలిసొచ్చింది. అందుకే వాళ్లు ‘సూపర్ నోడ్స్’ టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. థర్డ్ పార్టీ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, నెట్ వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల కారణంగానే ఇప్పటికీ ఇంటర్నెట్ అంత చౌకగా దొరకడం లేదని లక్ష్మణ్ చెప్తున్నారు. కేబుల్స్ వేయడం కోసం గుంతలు తవ్వాల్సి రావడం, మరోవైపు ఫైబర్ ఆప్టిక్స్ కాస్ట్ ఎక్కువ కావడం వంటివి అడ్డంకిగా మారాయన్నారు. అందుకే తాము చౌకగా డేటాను అందించేందుకు లేజర్లపై దృష్టి పెట్టామన్నారు.
వైఫై డబ్బాతో ఇంటర్నెట్ ఇలా..
సూపర్నోడ్స్ టెక్నాలజీ ద్వారా లేజర్ లైట్‌ను పంపి వైఫైతో ఇంటర్నెట్ను ఇస్తోంది వైఫై డబ్బా. ఈ పద్ధతిలో కంటికి ఎలాంటి హాని కలిగించని లేజర్లనే వాడతారు. ఒక టవర్ నుంచి ఈ లేజర్లను పంపితే మరో టవర్ వాటిని క్యాచ్ చేస్తాయి. ఇలా లేజర్ టవర్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి, సూపర్ నోడ్స్ పద్ధతిలో ఒక సర్క్యూట్‌ను ఏర్పరుస్తాయి. ఈ సూపర్ నోడ్స్ నుంచి అక్కడక్కడా ఉండే స్విచెస్ ద్వారా వైఫై డబ్బా రూటర్లు కనెక్ట్ అయి, వైఫై సిగ్నళ్లను రిలీజ్ చేస్తాయి. ఈ వైఫై సిగ్నల్స్ అందుకునే యూజర్లు మొబైల్ నెంబర్, ఓటీపీతో లాగిన్ కావచ్చు. సూపర్ నోడ్స్ టెక్నాలజీతో 2 కిలోమీటర్ల పరిధి వరకూ లేజర్లతో ఎలాంటి అంతరాయం లేకుండా కమ్యూనికేషన్ సర్వీసెస్ అందుతాయని, అవసరాన్ని బట్టి100 జీబీపీఎస్ వేగంతోనూ ఇంటర్నెట్ ప్రసారం చేయొచ్చని చెప్తున్నారు.
ట్రయల్స్ విజయవంతం
ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు బెంగళూరు బెల్లాండూర్ లోని ‘ది అడ్రస్’ అనే బిల్డింగ్‌పై టవర్ ఏర్పాటు చేశారు. దాని నుంచి డేటాను రిసీవ్ చేసుకునే మరో టవర్‌ను అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని కేశవాహనహల్లిలోని ‘జోర్డాన్’ అనే బిల్డింగ్‌పై రెడీ చేశారు. రెండింటి మధ్య సూపర్నోడ్ నెట్వర్క్ ఏర్పడేలా డివైస్ కాన్ఫిగరేషన్ చేశారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు సూపర్ నోడ్ టవర్ లో వెదర్ సెన్సర్, సీసీటీవీ, ఇతర డివైస్నూ అమర్చారు. తర్వాత ది అడ్రస్ టవర్ నుంచి డేటాను ట్రాన్స్ మిట్ చేయగా, జోర్డాన్ టవర్ బ్యాండ్ విడ్త్‌ను రిసీవ్ చేసుకుని, వైఫై రూటర్లకు సిగ్నళ్లను పంపింది. ప్రస్తుతం జోర్డాన్ టవర్ ఉన్న ఏరియాలో 80 ఇండ్లకు 1జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందుతోందని లక్ష్మణ్ వెల్లడించారు. ఇప్పటివరకూ వాతావరణం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదని తెలిపారు. అయితే, సూపర్నోడ్ టెక్నాలజీతో చౌకగా ఇంటర్నెట్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా, దీనిని కమర్షియల్‌గా పెద్ద ఎత్తున విస్తరించేందుకు అవకాశాలు తక్కువే ఉంటాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ నీల్ షా అంటున్నారు. దాదాపు పదేళ్ల కిందటి నుంచే పలు టెలికం కంపెనీలు ఈ లేజర్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టినా, పెద్దగా సక్సెస్ కాలేదని ఆయన పేర్కొంటున్నారు.
వైఫై డబ్బాను ఇలా తీసుకోవచ్చు..
హోం యూజర్లకు వైఫై డబ్బా కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు. డబ్బాఓఎస్తో సహా గిగాబైట్ రూటర్ కూడా ఫ్రీనే. దీనిని యూజర్‌కు సమీపంలోని సూపర్నోడ్కు కనెక్ట్ చేసిన వెంటనే వైఫై సిగ్నల్స్ అందుబాటులోకి వస్తాయి. పైసలు వద్దనుకుంటే ఫ్రీగా యాడ్లు చూసి లేదా పజిల్స్ సాల్వ్ చేసి నెట్ వాడుకోవచ్చు. అంతరాయం లేకుండా స్పీడ్ నెట్ కావాలంటే మాత్రం రూపాయికి జీబీ చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే డేటా సేవర్, ప్రైవేట్ ఎస్ఎస్ఐడీ, యాంటీ వైరస్ వంటి ఆన్ డిమాండ్ సేవలనూ ఈ కంపెనీ అందిస్తుంది. ఇక చిన్న చిన్న కంపెనీలు, దుకాణాలకు సైతం ప్రస్తుత డేటా కాస్ట్లో పదోవంతు చార్జీలకే వైఫై డబ్బాతో ఇంటర్నెట్ ఇస్తామని, ఎక్కువ మంది గ్రూపుగా వస్తే వాళ్లకు సొంత సూపర్నోడ్ ఇస్తామని లక్ష్మణ్ చెప్తున్నారు. ఇప్పటికే టెలికం డిపార్ట్మెంట్, ట్రాయ్‌తో అనుమతులు, గైడ్ లైన్స్‌కు సంబంధించి సంప్రదింపులు జరిపామని, బెంగళూరు సిటీ అంతటికీ సూపర్ నోడ్స్ రెడీ అయ్యాక తమ ‘వైఫై డబ్బా’లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. కాగా, ఇది గానీ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రధానమైన పెద్ద పెద్ద కంపెనీలకు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.