Solar Power: వేగంగా సోలార్‌కి మారుతున్న భారత్.. ప్రతి 45 రోజుల్లో లక్ష గృహాలకు..

Solar Power: వేగంగా సోలార్‌కి మారుతున్న భారత్.. ప్రతి 45 రోజుల్లో లక్ష గృహాలకు..

Solar Energy: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో పాటు ప్రకృతి అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ మార్గాల వైపు ప్రజలు మళ్లుతున్నారు. దీంతో సోలార్ ఎనర్జీ ఉత్పత్తితో పాటు స్వీకరణకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ప్రధాని మోదీ ముందు చూపుతో దేశంలోని గృహాలకు సోలార్ వెలుగులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనను ప్రవేశపెట్టారు. 

ఈ స్కీమ్ ప్రారంభంతో గృహ వినియోగదారులు సోలార్ వైపు అడుగులు వేస్తున్నారని సోలార్ స్క్వేర్ సీఈవో శ్రయ మిశ్రా వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ప్రతి 40 నుంచి 45 రోజులకు కొత్తగా లక్ష నివాస గృహాలకు సోలార్ అమర్చబడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 2019లో లక్ష గహాలను చేరుకోవటానికి ఐదేళ్లు పట్టింది. అయితే ఇది ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతోందని మిశ్రా పేర్కొన్నారు. 

►ALSO READ | Honor Power:బడ్జెట్ స్మార్ట్ఫోన్..8000mAh బిగ్ బ్యాటరీ..ఫీచర్లు అదుర్స్

సాధారణంగా మార్కెట్లలో కమర్షియల్, ఇండస్ట్రియల్ యూజర్ల నుంచి డిమాండ్ ఉంటుందని.. అయితే భారత ప్రభుత్వం సోలార్ ఎనర్జీని ప్రజలకు చేరువచేసేందుకు చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఇళ్లలో ఉపయోగించే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్‌కి డిమాండ్ భారీగా పెరుగుతోందని స్పష్టం చేశారామె. 2024 మార్చి ముగింపు నాటికి దేశంలోని ఇళ్లల్లో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ కెపాసిటీ 3.5 గిగావాట్లుగా ఉందని వివరించారు మిశ్రా. దేశవ్యాప్తంగా ఇళ్లల్లో ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సోలార్‌ పవర్ సామర్థ్యం 27 శాతంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా సోలార్ పవర్ వినియోగం వేగంగా జరుగుతోందని.. అందులో తమ కంపెనీ వాటా చాలా మెరుగ్గా ఉందని వెల్లడించారామె. 

కంపెనీ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజలీ యోజన కింద ఎంపానల్ చేయబడిందని మిశ్రా వెల్లడించారు. మెుదట్లో కంపెనీ బిజినెస్ టూ బిజినెస్ ప్రాతిపదికన ప్రారంభమైనప్పటికీ 2021లో రెసిడెన్షియల్ సోలార్‌కి మారింది. ప్రజల్లో సోలార్ పై పెరుగుతున్న అవగాహన, పెరుగుతున్న కరెంట్ బిల్లుల నుంచి ఉపశమనం కోసం వారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా స్వీకరణ పెరుగుతోందని కంపెనీ పేర్కొంది. అలాగే ప్రజల జీవనశైలి మార్పుల వల్ల పెరుగుతున్న విద్యుత్ వినియోగం కూడా మరో కారణంగా చెప్పుకొచ్చారు మిశ్రా.