
- పెండింగ్ లో ఉన్న లక్షన్నర దరఖాస్తులను
- పరిష్కరించాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ సిఫార్సు
- వచ్చే నెలలో సర్కార్‌కు పూర్తిస్థాయి నివేదిక
- పోర్టల్‌లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చ
- ఇతర రాష్ట్రాల్లోని భూచట్టాలపై అధ్యయనం చేయాలని మీటింగ్‌లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు : పెండింగ్‌లో ఉన్న ధరణి అప్లికేషన్లు అన్నింటినీ క్లియర్ చేయాలని ధరణి కమిటీ నిర్ణయించింది. దాదాపు లక్షన్నర అప్లికేషన్లు వివిధ దశల్లో ఉండగా, వాటన్నింటినీ జూన్ 4లోగా పరిష్కరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలు ఇక రోజువారీగా ధరణి అప్లికేషన్లను క్లియర్ చేయనున్నట్టు తెలుస్తున్నది. సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కన్వీనర్‌గా ఏర్పాటైన ధరణి కమిటీ సమావేశం శనివారం సెక్రటేరియెట్‌లో జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెలలో ధరణి కమిటీ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ శాఖ, ధరణిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో వైట్ పేపర్ పై కమిటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ధరణి పోర్టల్‌లో తీసుకురావాల్సిన మార్పులు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న భూచట్టాలపైనా చర్చించారు. కాగా, గతంలో మార్చి ఒకటో తేదీ నుంచి 17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో స్పెషల్ డ్రైవ్‌తో పాటు మిగిలిన పనులను రెవెన్యూ యంత్రాంగం పక్కన పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో పోలింగ్ ముగియడంతో ధరణి అప్లికేషన్లను పరిష్కరించనున్నారు. వరుసగా 10–12 రోజుల పాటు పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను క్లియర్ చేయనున్నారు.
రిపోర్టులు రెడీ..
ధరణికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన 2,46,536 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు కమిటీ మొదట గుర్తించింది. వీటి పరిష్కారానికి మార్చి 1 నుంచి 17 వరకు ఎమార్వో స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో ఎలాంటి ఇబ్బందుల్లేని కొన్ని దరఖాస్తులను పరిష్కరించారు. దాదాపు లక్ష దరఖాస్తులను పరిష్కరించగా, ఇంకో లక్షన్నర పెండింగ్ లో ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా మరికొన్ని అప్లికేషన్లు కూడా వచ్చాయి. ఇందులో పెండింగ్ మ్యుటేషన్, గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్, పాస్ బుక్ డేటా కరెక్షన్, కోర్టు కేసులకు సంబంధించినవి ఉన్నాయి. ఈ అప్లికేషన్లకు సంబంధించి వివిధ స్థాయిల్లో రిపోర్టులు రెడీ చేశారు. ఇప్పుడు వీటన్నింటిని క్లియర్ చేయనున్నారు. ఎండోమెంట్, వక్ఫ్, టీఎస్ఐఐసీ, అసైన్డ్, ప్రభుత్వ భూములు మిస్సింగ్ అయినట్టు గుర్తించగా.. వాటిని ధరణిలో అప్ డేట్చేయాలని ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేయనుంది.
పోర్టల్‌లో మార్పులు..
కలెక్టర్ కేంద్రీకృతంగా కాకుండా ఎమ్మార్వో, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ లెవెల్లోనే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని ధరణి కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. అందుకు అనుగుణంగా పోర్టల్‌లో పూర్తి స్థాయిలో మాడ్యూల్స్ కూడా మార్చనున్నారు. ఇప్పటికే అందరికీ లాగిన్స్ ఇచ్చినప్పటికీ, అది ఇంకా అమల్లోకి రాలేదు. మ్యుటేషన్, సక్సెషన్, పీవోబీ సమస్యలు, సెమీ అర్బన్ ఏరియాలో పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, కోర్టు తీర్పుల ఆధారంగా పాసు పుస్తకాల జారీ, ఇండ్లు లేదా నివాస స్థలాలుగా మారిన భూముల నాలా కన్వర్షన్ వంటివి కలెక్టర్ చూస్తారు. అన్ని మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను కిందిస్థాయి రిపోర్టుల ఆధారంగా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. టీఎం 33 కింద వచ్చిన పాస్ బుక్ డేటా కరెక్షన్ లో పేరు మార్పు, ధరణి రాకముందే చదరపు గజాల్లో అమ్మేసిన భూములు, ఎకరం రూ.5 లక్షలకు పైగా విలువైన భూముల విస్తీర్ణం, సర్వే నంబర్ మిస్సింగ్ వంటి సమస్యలను కలెక్టర్లు పరిష్కరిస్తారు. ఎమ్మార్వో లెవెల్ లో టీఎం4 కింద విరాసత్ (అసైన్డ్ భూములతో సహా), టీఎం10 కింద జీపీఏ, ఎస్పీఏ, టీఎం14 కింద స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, టీఎం 32 కింద ఖాతా మెర్జింగ్ చేయనున్నారు. ఇక ఆర్డీఓ లెవెల్లో టీఎం 7 కింద పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్, టీఎం 16 కింద ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, టీఎం 20 కింద ఎన్ఆర్ఐ లకు సంబంధించిన సమస్యలు, టీఎం 22 కింద సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, టీఎం 26 కింద కోర్టు కేసులు, సమాచారం, టీఎం 33 కింద డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ మిస్సింగ్స్(ఎకరం రూ.5 లక్షల లోపు ఉన్న ఏరియాల్లో) చేయనున్నారు.
ఇతర రాష్ట్రాల్లోని భూచట్టాలపై అధ్యయనం
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న భూచట్టాలపై ధరణి కమిటీలో చర్చించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ల్యాండ్‌టైటిలింగ్ యాక్ట్, ఇతర చట్టాలపై స్టడీ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న ఆర్ఓఆర్చట్టానికి ఎలాంటి మార్పులు చేయాలనే దానిపైనా చర్చించారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఎకరాలు ధరణి పేరుతో మాయం చేశారని, గత ప్రభుత్వ పెద్దలే ధరణి దందాలకు అండగా నిలిచారనే విమర్శలు ఉన్నాయి. ధరణి అక్రమాలపై వైట్ పేపర్ విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎక్కడెక్కడ భూదందాలు చేశారనే దానిపై ధరణి కమిటీనే కాకుండా ప్రభుత్వం కూడా ఇంటర్నల్‌గా ఎంక్వైరీ చేయిస్తున్నది.