భారత్‌‌ పే పేరుతో లక్ష ఇరవై ఎనిమిది వేలు మోసం

భారత్‌‌ పే పేరుతో లక్ష ఇరవై ఎనిమిది వేలు మోసం

నర్సాపూర్, వెలుగు : భారత్‌‌ పే యాప్‌‌ ఎంప్లాయ్‌‌నంటూ వచ్చిన ఓ వ్యక్తి కిరాణ షాపు యజమాని అకౌంట్‌‌లో నుంచి రూ. 1.28 లక్షలు కాజేశాడు. మెదక్‌‌ జిల్లా నర్సాపూర్‌‌ పట్టణానికి చెందిన ఇమ్మడి విశ్వనాథం స్థానికంగా కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. ఇతడు భారత్‌‌ పే సౌండ్‌‌ బాక్స్‌‌ కోసం గతంలో రూ. 14 వేలు చెల్లించాడు. అయినా బాక్స్‌‌ రాకపోవడంతో భారత్‌‌ పే వారికి ఫోన్‌‌ చేయగా డబ్బులను అకౌంట్‌‌లో వేశామని చెప్పారు. 

కానీ డబ్బులు డిపాజిట్‌‌ కాలేదని మళ్లీ ఫోన్‌‌ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో బుధవారం ఓ వ్యక్తి భారత్‌‌ పే టీషర్ట్‌‌ వేసుకొని విశ్వనాథం దుకాణం వద్దకు వచ్చాడు. దీంతో విశ్వనాథం తన సమస్యను ఆ వ్యక్తికి చెప్పాడు. అతడు విశ్వనాథం అకౌంట్‌‌ నుంచి ఒక రూపాయి సెండ్‌‌ చేయమని చెప్పడంతో అలాగే చేశాడు. తర్వాత తాను మెసేజ్‌‌ 

పెడతానని ఫోన్‌‌ తీసుకున్న ఆ వ్యక్తి విశ్వనాథం క్రెడిట్‌‌ కార్డ్‌‌ నుంచి రూ. లక్ష, అకౌంట్‌‌ నుంచి రూ. 28 వేలు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేసుకొని అక్కడి నుంచి పరార్‌‌ అయ్యాడు. డబ్బులు పోయినట్లు కొద్దిసేపటి తర్వాత గుర్తించిన విశ్వనాథం వెంటనే 1930కు ఫోన్‌‌ చేయడంతో స్థానిక పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో గురువారం స్టేషన్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.