మణిపూర్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. బాబుపరా వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
మరోవైపు బాబుపరా ప్రాంతంలో పలు పార్టీల ఆఫీసులు ఆందోళనకారులు దాడులు చేశారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్ కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఆఫీసుల్లో చొరబడిన ప్రొటెస్టర్లు.. ఫర్నీచర్ దోచుకొని ఆఫీసులను తగలబెట్టారు. దీంతో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ALSO READ : మణిపూర్లో మళ్లీ అల్లర్లు..సీఎం బీరేన్, మంత్రుల ఇండ్లపై దాడి
మరోవైపు మణిపూర్ లో పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం (నవంబర్ 18) అధికారులతో సమావేశం కానున్నారు. హోంమంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికిచెందిన సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి , ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ , అస్సాం రైఫిల్స్ అధికారులతో అమిత్ షా మణిపూర్ పరిస్థితిపై చర్చించనున్నారు.
ఇటీవల ఇంఫాల్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కుకి మిలిటెంట్లు చంపడంతో మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. ఈ సంక్షోభానికి నిరసనగా నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు పరిష్కారం చూపడంలో విఫలమైందని ఆరోపించింది.