రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎంపీల్లో పదిమంది లోక్ సభ స్థానాలకు రాజీనామా చేశారు. రాజీనామాలు సమర్పిం చిన ఎంపీల్లో మధ్యప్రదేశ్ కు చెందిన నరేంద్ర తోమర్ సింగ్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.
రాజస్థాన్ నుంచి రాజ్యవర్థన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా, దియా కుమార్ పార్లమెంట్ కు రాజీనామా చేశారు. రాజస్థాన్ నుంచి బాబా బాలక్ నాథ్, చత్తీస్ గఢ్ నుంచి రేణుగా సింగ్ ఇంకా రాజీనామా చేయలేదు. రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లలో ముఖ్యమంత్రి పదవికి బాలక్ నాథ్, రేణుకా సింగ్ పోటీ పడే అవకాశం ఉంది.
ఛత్తీస్ గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలను సమర్పించేందుకు బీజేపీ చీఫ్ నడ్డా ఆధ్వర్యంలో ఎంపీల బృందం స్పీకర్ ను కలిసింది.
ఇటీవల జరిగిన రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలువురు సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపింది. వారిలో కొందరు నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్ వంటి వారు మోదీ మంత్రి వర్గంలో కూడా ఉన్నారు. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లను కాంగ్రెస్ నుంచి బీజేపీ కైవసం చేసుకోగా.. మధ్యప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకుంది.
అయితే ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిగిన తెలంగాణలో బీఆర్ఎస్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించి అధికారాన్ని కైవసం చేసుకుంది.