ఆస్పత్రిలో మంటలు.. 10 మంది చిన్నారులు మృతి

ఆస్పత్రిలో మంటలు.. 10 మంది చిన్నారులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయి ఆస్పత్రి, మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పేషెంట్లందరూ ఒక్కసారిగా ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.  మరో 37 మందిని అతికష్టం మీద రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. 

శుక్రవారం రాత్రి 10.35 గంటల సమయంలో  ఆస్పత్రిలోని ఐసీయూలో షార్ట్  సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్​లతో స్పాట్​కు చేరుకుని మంటలను కంట్రోల్ చేసినట్లు తెలిపారు. మృతులందరూ చిన్నారులే కావడంతో వారి తల్లిదండ్రులు, బంధువుల  రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై ఝాన్సీ కలెక్టర్ అవినాష్ కుమార్ స్పందించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తేల్చడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.