కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామబాద్ జిల్లాలో యాసంగి సీజన్ వరి కోతలు షురూ అయినా.. ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. ముందుగానే నాట్లు వేసిన చాలా ప్రాంతాల్లో కోతలు 10 రోజుల కిందనే మొదలయ్యాయి. పచ్చిగా ఉన్న వడ్లను రైతులు కల్లాల్లో, రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోస్తూ కుప్పలు కొడుతున్నారు. ఇటీవల తరచుగా అకాల వర్షాలు వస్తుండడంతో చేతికొచ్చిన పంట వరదల పాలవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
5. 40 లక్షల ఎకరాల్లో వరి సాగు..
యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో 5.40 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఆరంభం నుంచే తెగుళ్ల వ్యాప్తితో పంటను కాపాడేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. జిల్లాలో ముందుగా నాట్లేసిన కొన్ని ప్రాంతాల్లో పది రోజుల కిందనే పంట చేతికొచ్చింది.
కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, బీర్కుర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి , నిజాంసాగర్, నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, బోధన్, రుద్రూర్, కోటగిరి మండలాల్లో వడ్లను రోజూ ఆరబోసి కుప్పకొడుతున్నారు. రెండు రోజుల కింద నిజామాబాద్జిల్లా ఎడపల్లి, రెంజల్ మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి.
5. 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి..
కామారెడ్డి జిల్లాలో 5.80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 350 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆఫీసర్లు ప్రపోజల్స్రెడీ చేశారు. వారం రోజులైతే వరి కోతలు మరింత పెరుగనుండడంతో ఎక్కువ రోజులు వడ్లు ఆరబోస్తే వడ్లలో పొల్లు పెరిగే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు.
వడ్లు ఆరబోసేందుకు టార్పాలిన్లు కిరాయికి తీసుకుంటున్నామని, ఒక్కో కవర్‌కు రోజుకు రూ. 20 కిరాయి చెల్లిస్తున్నామని వాపోతున్నారు. ఇతర వ్యవసాయ పనులు వదులుకొని వడ్ల కుప్పల వద్దనే కాపలా ఉండాల్సి వస్తోందని వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి వడ్లు కొనాలని కోరుతున్నారు.
కాంటాలు పెట్టేదెప్పుడో?
వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారోనని రైతులు రోజూ ఎదురుచూస్తున్నారు. పంట సాగు, దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కొద్ది రోజుల కింద కామారెడ్డి కలెక్టర్ జితేశ్వి పాటిల్ ఆయా శాఖల అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఇంకా క్షేత్ర స్థాయి సిబ్బందితో మీటింగ్స్ మాత్రం జరగలేదు. కాంటాలు పెట్టడానికి అవసరమైన సామగ్రి, హమాలీలు, కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వడ్లు తరలించేందుకు లారీలు, గన్నీ బ్యాగులు లాంటి ఏర్పాట్లు ఇంకా జరగలేదు. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే 10 రోజులకు పైగా టైం పడుతుందని సంబంధిత శాఖల అధికారులు చెప్తున్నారు.
వరి కోసి వారం రోజులైంది
4 ఎకరాల్లో వరి వేసిన. చేనుకు తెగుళ్లు రావడంతో ఈ యేడు దిగుబడి తక్కువగానే వచ్చింది. వరి కోసి వారం రోజులైనా ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరవలే. సొసైటీ వాళ్లను అడిగితే 20 తారీఖు తర్వాత కాంట పెడుతమని చెబుతున్రు. 20 రోజులు ఎండబోస్తే వడ్లు బియ్యమైతయ్. పొలం వద్ద పనులు చేసుకోకుండా వడ్ల కావలే ఉండాల్సి వస్తోంది. తొందరగా కాంటా పెడితే బాగుండు. - పరమేశ్వర్, గండిమాసానిపల్లి
వడ్లు తడుస్తయేమోనని భయమైతాంది..
8 ఎకరాల్లో వరి సాగు చేసిన. వారం కింద వరి కోసి రోడ్డు పక్కనే వడ్లు ఆరబోస్తున్నా. అమ్ముదామంటే కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుస్తలేరు. ఎండలు బాగనే కొడుతున్నా.. మధ్య మధ్యలో మొగులై వాన చినుకులు పడుతున్నయ్. వాన పడితే ఎండిన వడ్లు తడిసి పోతయ్. 20 టార్పాలిన్ కవర్లు కిరాయికి తెచ్చిన. ఒక్కో కవర్‌కు రోజుకు రూ.20 కిరాయి ఇస్తున్న. వెంటనే వడ్లు కొనాలె. - నామనాయక్, మేళ్లకుంట తండా