తెలంగాణ గ్రామంలో 10 రోజుల లాక్ డౌన్

రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 14 కేసులు నమోదయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన గూడెం వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. దీంతో అతడి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారి శాంపిల్స్ కూడా సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. అయితే తాజాగా ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లి, భార్యకు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో గూడెం గ్రామంలో లాక్ డౌన్ విధించారు. పదిరోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. గ్రామస్థులు బయటకు వెళ్లొద్దన్నారు. అలాగే బయట వ్యక్తులు కూడా గూడెంలోకి రావొద్దని సూచించారు. 

మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 38కి చేరింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరిలో వేరియంట్ గుర్తించారు. ఇప్పటి వరకు రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఆరుగురిలో ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 31 మందిలో వైరస్ గుర్తించారు. ఒకరికి కాంట్రాక్ట్ ద్వారా ఒమిక్రాన్ సోకినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన 9 వేల 381 మంది ప్రయాణికులకు RTPCR పరీక్షలు చేయగా.... 63 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సీ కోసం అధికారులు పంపగా.... వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చింది. మిగిలిన 38 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. మరో నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది. ఇక తెలంగాణలో నిన్న 187 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 6 లక్షల 80 వేల మందికిపైగా కోవిడ్ సోకింది. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య తెలంగాణలో 4 వేలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల 610 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.