మర్చిపోతే అల్జీమర్స్ ఉన్నట్టేనా.? లక్షణాలు ఇలా

మర్చిపోతే అల్జీమర్స్ ఉన్నట్టేనా.? లక్షణాలు ఇలా

లత వాళ్ల అమ్మ సరితకు వాళ్ల కాలనీలో మంచిపేరుంది. అన్ని విషయాల్లో చురుకుగా ఉండేది. ఇంట్లో ఏదైనా ఫంక్షన్​ చేయాలంటే ఆమెదే పెత్తనం. ఇరుగుపొరుగువాళ్లు కూడా ఆమె సలహాలు తీసుకోకుండా ఏ పనీ చేయరు. అంతేకాదు.. ఆమె చేతి వంట ఒక్కసారి తింటే ఎన్నేళ్లయినా గుర్తుపెట్టుకుంటారు. అలాంటిది ఆమె ఈ మధ్య ఏ పనీ సరిగా చేయలేకపోతోందట! వంట అయితే ఒకసారి చప్పగా, మరోసారి ఉప్పగా.. చేస్తోంది. ‘ఎందుకు ఇలా చేశావు?’ అని అడిగితే ‘మర్చిపోయా’ అంటోంది. ఏడాదికి ఒకసారి చెకప్​లు చేయించే లత.. ఈసారి కూడా షుగర్​, బీపీ ఏమైనా ఉందేమో చెక్​ చేయించాలని తల్లిని డాక్టర్​ దగ్గరకి తీసుకెళ్లింది. మాటల్లో మాటగా.. ఈ విషయాలన్నీ చెప్పింది. అది విన్న డాక్టర్​ ‘అల్జీమర్స్’ వచ్చిందేమో అన్నాడు. ఎక్స్​పర్ట్​ డాక్టర్​కి చూపిస్తే అదేనని తేలింది. 

ఎప్పటిలానే ఆ రోజు కూడా రామచంద్రయ్య ఒక్కడే మార్నింగ్​ వాక్​కి వెళ్లాడు. కానీ, ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. ఏమైందో? అని తండ్రిని వెతికేందుకు కంగారుగా బయల్దేరాడు మణికంఠ. తండ్రిని వెతుకుతూ పోతుంటే దారి మధ్యలో తెలిసిన వ్యక్తి ఎదురై ‘మీ నాన్న అక్కడున్నారు. పలకరిస్తే.. ఎవరో అన్నట్టు చూశార’ని చెప్పాడు. ఆ మాట వినగానే గుండె జారినంత పనైంది మణికంఠకు. వెంటనే అతను చెప్పిన ప్లేస్​కి వెళ్లి తండ్రిని ఇంటికి తీసుకొచ్చేశాడు. ‘ఎందుకు నాన్నా అక్కడే కూర్చున్నావు?’ అని అడిగితే ‘ఏమోరా నాకు దారి తెలియలేదు’ అన్నాడు. అప్పటినుంచి ఆయన్ని ఒంటరిగా వదిలేస్తే ఏం జరుగుతుందోననే ఆందోళన ఒకచోట నిలవనివ్వలేదు మణికంఠను. మాటల సందర్భంలో ఈ విషయాలను తన డాక్టర్​ ఫ్రెండ్​కి చెప్పాడు. అతని సలహా మేరకు హాస్పిటల్​కి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది అది ‘అల్జీమర్స్’ అని.


దాదాపు 65 ఏండ్లు పైబడిన వృద్ధుల్లో సాధారణంగా కనిపించే సమస్య ఇది. లైఫ్​లో జరిగే ప్రతి మూమెంట్ ఎంతో స్పెషల్. గడిచిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మారుతుంది. అందుకే కొత్త ఉదయాన్ని స్వాగతిస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలి. నిన్నటి రోజు రేపు గుర్తుండకపోవచ్చు. ఈరోజు కలిగే సంతోషం, బాధ, కోపం ఏదైనా సరే.. ఏదో ఒక రోజు మర్చిపోక తప్పదు. అప్పుడు అవి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ, దానికి కూడా ఒక లిమిట్ ఉంది. పరిమితి దాటాక జ్ఞాపకాలకు చెక్​ పెడుతుంటుంది కాలం. 

ఆరుపదులు నిండాక ఏడు దశాబ్దాలకు చేరువయ్యే తరుణంలో అప్పటివరకు చూసిన జీవితం, పదిలపరుచుకున్న జ్ఞాపకాలు.. అన్నీ మసకబారిపోతాయి. కన్నబిడ్డల్ని, వాళ్ల పేర్లని మర్చిపోతారు. అంతెందుకు ఒక్కోసారి వాళ్ల పేరు వాళ్లకే గుర్తుండదు. అద్దంలో చూపించినా వాళ్లని వాళ్లు గుర్తుపట్టలేరు! ఎంతో జీవితాన్ని, బిడ్డల ఎదుగుదలను చూసి, మనవళ్లు మనవరాళ్లతో ఆనందంగా గడపాల్సిన టైంలో ఈ పరిస్థితి రావడం బాధాకరం. ఈ స్థితినే అల్జీమర్స్, డిమెన్షియా అంటారు. 

నిజానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టైంలో ‘మరుపు’ సహజం. కానీ, వయసు పైబడిన తర్వాత అదో జబ్బుగా ఇబ్బంది పెట్టడం గురించి ఎక్కువ దృష్టి పెట్టాలి. అసలు ‘మతిమరుపు’ని జబ్బుగా అనుకోనివాళ్లు చాలామందే ఉండొచ్చు. కానీ ఈ మధ్య నడివయసు వాళ్లను కూడా మతిమరుపు సమస్య వేధిస్తోంది! మరీ ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కోవడం, ఆర్టిఫిషియల్​ లైటింగ్​​కి ఎక్స్​పోజ్​  కావడం వంటివి ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే లైఫ్​స్టయిల్​లో మార్పులు చేసుకోవాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.

మెదడు నెమ్మదిస్తుందా?

మనిషి శరీరానికి బాస్.. మెదడు. బాడీలో అన్ని అవయవాలకు ఆదేశాలు, సూచనలు, సలహాలు మెదడు నుంచే వెళ్తాయి. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా ఆదేశం మెదడు నుంచే రావాలి. రోజువారీ జీవితం​లో మనం చేసే పనులన్నీ మెదడు ఇచ్చే సూచనల ఆధారంగానే  జరుగుతాయి. అంటే.. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం సక్రమంగా తన పనులు చేయగలదు. జరిగిన ప్రతి విషయాన్ని మెదడు స్టోర్‌‌ చేసుకుని, సమయానుగుణంగా గుర్తు చేస్తుంటుంది. అలాంటి మెదడు ఆరోగ్యంపై దృష్టిపెట్టకపోతే కాలక్రమంలో మతిమరుపు బారినపడాల్సి వస్తుంది. మరుపు కొన్నిసార్లు మంచిదేమో కానీ, అన్నిసార్లు కాదు. ఎందుకంటే.. జ్ఞాపకశక్తి లోపిస్తే అల్జీమర్స్ లేదా డిమెన్షియా వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆలోచనాశక్తి దెబ్బతింటుంది. ఏ విషయమూ గుర్తుండదు. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్.

సాధారణంగా వయసు పైబడే కొద్దీ మరుపు సమస్యగా మారుతుంది. ఎక్కువగా 60 నుంచి 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో అల్జీమర్స్‌‌, డిమెన్షియా లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ రెండూ ఒకటేనా అంటే.. కాదు. ఈ రెండూ మెదడు సంబంధిత వ్యాధులే అయినా డిమెన్షియా రావడానికి ప్రధాన కారణం మాత్రం అల్జీమర్స్. అంటే ముందు అల్జీమర్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే 65 ఏండ్ల వయసులో 6 శాతం, 85 ఏండ్ల తర్వాత 30 శాతం మంది అల్జీమర్స్ బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ ఏడాదిలో 65 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 6.9 మిలియన్ల మంది అమెరికన్లలో అల్జీమర్స్ ఉన్నట్టు గుర్తించారు. అందులో 73 శాతం మంది 75 ఏండ్లు, అంతకంటే పెద్దవాళ్లు ఉన్నారు. 

అల్జీమర్స్ అంటే..

అల్జీమర్స్ వల్ల నెమ్మదినెమ్మదిగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఆలోచనా నైపుణ్యాలు దెబ్బతింటాయి. చివరికి చాలా సింపుల్​ పనులు కూడా చేయలేని పరిస్థితికి మనిషిని తీసుకెళ్తుంది. దాంతో మనిషి ప్రవర్తన మీద కూడా ప్రభావం పడుతుంది. దీనిని త్వరగా గుర్తించకపోతే రోజువారీ పనులు కూడా చేసుకోలేరు. అల్జీమర్స్ అసోసియేషన్ చెప్తున్న దాని ప్రకారం అల్జీమర్స్ అనేది డిమెన్షియాకు ప్రధాన కారణం. దాదాపు 60 నుంచి 80 శాతం డిమెన్షియా కేసుల్లో అల్జీమర్స్ ఉన్నవాళ్లే ఉంటారు.

కారణం...

మెదడులోని టెంపోరల్​(కణతకు సంబంధించిన) భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. అల్జీమర్స్ బారినపడినవాళ్లలో ఈ కణాలు సన్నగా, చిన్నగా అయిపోతాయి. దాంతో టెంపోరల్ భాగం చిన్నగా అవుతుంది. అంతేకాదు.. మెదడుకి గ్లూకోజ్ తక్కువగా అందుతుంది. దీన్ని ‘హైపోమెటబాలిజం’ అంటారు. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. ఆలోచనాశక్తి తగ్గిపోతుంది. మతిమరుపు మొదలవుతుంది. 

అల్జీమర్స్ లక్షణాలు ఇలా..

ఈ మధ్య జరిగిన సంఘటనలు లేదా సంభాషణలు మర్చిపోతారు. స్పష్టంగా ఏది చెప్పలేరు. డిప్రెషన్, దిక్కుతోచని స్థితి, గందరగోళం, ప్రవర్తనలో మార్పులు, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, కోపం రావడం, జీవనశైలిని మర్చిపోవడం, మూడ్ మారిపోతుంటుంది. జబ్బు బాగా ముదిరిపోయిన దశల్లో మాట్లాడటం, మింగడం, నడవడం కూడా కష్టమవుతుంది.

లైట్​ ఎఫెక్ట్ అని లైట్​గా తీసుకోవద్దు!

అప్పటికే అల్జీమర్స్ ఉన్నవాళ్లకు ఆ వ్యాధి పెరగడానికి గల కారణాల్లో నైట్​ లైట్ కూడా ఒకటి. నేషనల్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్ గ్రాంట్ చేసిన రీసెర్చ్​ గురించి ఫ్రాంటీర్స్ ఇన్ న్యూరోసైన్స్ అనే జర్నల్​లో పబ్లిష్​ అయింది. దాని సారాంశం ఏంటంటే.. అప్పటికే అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్​ రాత్రిపూట ఆర్టిఫిషియల్​ లైట్​కి ఎక్కువగా ఎక్స్​పోజ్​ అయితే వ్యాధి​ మరింత పెరిగే ఛాన్స్ ఉందని తేలింది. ​అమెరికాలో చేసిన ఈ రీసెర్చ్​లో అక్కడున్న రాష్ట్రాల్లో లైట్​ పొల్యూషన్​ని తగ్గించే చట్టాలు కూడా ఉన్నాయట. అయితే, మిగతా ప్రాంతాల్లో మాత్రం రాత్రిపూట లైటింగ్​ ఎక్కువగా ఉంటోంది. అందులో స్ట్రీట్​ లైట్స్, రోడ్ వే లైటింగ్, ఇల్యూమినేటెడ్ సైన్స్ వంటివి ఉన్నాయి. నిజానికి ఇవి క్రైమ్ జరగకుండా, ప్రయాణీకుల సేఫ్టీకి ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని తీసేయడం కుదరదు. అయితే, ఈ రీసెర్చ్​లో రాత్రిపూట బయట, ఇంట్లో లైట్​కి ఎంతసేపు ఎక్స్​పోజ్ అవుతున్నారు? అనేది మొత్తంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆయా స్టేట్స్​లో యావరేజ్ నైట్​ టైం లైట్​ ఇంటెన్సిటీ ఎలా ఉందో చెక్ చేశారు. 2012 నుంచి 2018 వరకు ఉన్న శాటిలైట్ అక్వైర్డ్​ లైట్ పొల్యూషన్ డాటా, మెడికేర్ డాటా చూస్తే అల్జీమర్స్ వ్యాప్తికి కారణమవుతుందా? అనే విషయం మీద స్టడీ చేశారు. రిస్క్ ఫ్యాక్టర్స్​గా అనుమానించిన వాటిలో మెడికల్ డాటా కూడా చేర్చారు. రాత్రిపూట లైట్​ కంటే డయాబెటిస్, హైపర్ టెన్షన్​, ఇతర అనారోగ్య సమస్యలు వంటివి అల్జీమర్స్ వ్యాధికి ఎక్కువగా కారణం అవుతున్నాయి. అయితే ఆల్కహాల్, ఒబెసిటీ, హార్ట్ ఫెయిల్యూర్, డిప్రెషన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వంటి వాటి కంటే నైట్​ లైట్ ఎఫెక్ట్​ ఎక్కువగా ఉందని క్లినికల్ రీసెర్చర్స్ అంటున్నారు. 65 ఏండ్లు దాటిన వాళ్లు రాత్రిపూట ఎక్కువగా లైట్​కి ఎక్స్​పోజ్ అయితే ఇతర వ్యాధుల సంగతేమో కానీ అల్జీమర్స్ వచ్చే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువని తేలింది. యువత కూడా రాత్రిపూట లైట్​కి ఎంత తక్కువ ఎక్స్​పోజ్ అయితే అంత బెటర్ అని చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్.

యువతకు కూడా ముప్పే 

ఈరోజుల్లో చాలామంది అర్బన్, సబర్బన్ ఏరియాల్లో ఉంటున్నారు. వాళ్లకు నేచురల్ లైట్ సరిగా అందకపోగా నైట్​ లైట్​కి ఎక్కువగా ఎక్స్​పోజ్ అవుతున్నారు. అందులో 80 శాతం మంది గ్లోబల్ పాపులేషన్ లైట్​ పొల్యూషన్​కి గురవుతున్నారు. అయితే నైట్​ లైట్​కి ఎక్స్​పోజ్ అయినప్పుడు కొన్ని జన్యురకాలు ప్రభావితం అవుతాయి. పెద్దవాళ్లంటే వయసు వల్ల నిద్ర పట్టక లేదా ఇతర కారణాల వల్ల మేల్కొని ఉండడం వల్ల నైట్​ లైట్​కి ఎక్స్​పోజ్ అవుతారు. కానీ, యువత అలా కాదు. సిటీల్లో ఉండే వాళ్లు చాలా వరకు నైట్​ లైఫ్​ని ఇష్టపడుతున్నారు. దాంతో రాత్రుళ్లు లైటింగ్​కి ఎక్కువగా ఎక్స్​పోజ్ అవుతుంటారు. కాబట్టి వయసు పైబడ్డాక వచ్చే వ్యాధులు కూడా యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. దీనివల్ల యువతలో కూడా మతిమరుపు సమస్య కనిపిస్తోంది. వృద్ధులకు వయసు వల్ల వచ్చేది కావడంతో దాన్ని తగ్గించడం కాస్త కష్టమే. అయితే, యువత తమ లైఫ్​ స్టయిల్​ని మార్చుకుంటే మాత్రం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు. ముఖ్యంగా రాత్రుళ్లు లైటింగ్​కి ఎక్స్​పోజ్ కాకుండా ఉండడం ఉత్తమం.

సృష్టికి విరుద్ధంగా...

‘‘మన ఇంటర్నల్ క్లాక్ (సర్కేడియన్ రిథమ్స్) సరిగా పనిచేయడానికి బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది. పర్యావరణ మార్పులకు అనుగుణంగా పొద్దున అయితే లేవమని, రాత్రి కాగానే నిద్రపోవాలని  గుర్తుచేస్తుంటుంది. అలాంటిది టైం కాని టైంలో లైటింగ్​ ఉంటే అది బ్రెయిన్​ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది వ్యాధి రావడానికి కారణమవుతుంది” అని డాక్టర్ రాబిన్ జువాలా వివరించాడు. ఈ స్టేట్​మెంట్​ను  సమర్థిస్తూ శామ్యూల్ గాండీ అనే రీసెర్చర్​‘‘ లైట్​ వల్ల నిద్ర ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర తగినంత లేకపోతే అల్జీమర్స్ వచ్చే రిస్క్​ చాలా ఎక్కువ. అయితే దీనికోసం అంతగా భయపడాల్సిన పనేం లేదు. లైఫ్ స్టయిల్ మార్పులు చేసుకోవాలి.  రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోకుండా, లైట్స్ ఆఫ్ చేసి లేదా కళ్లకు మాస్క్​ పెట్టుకుని, లైటింగ్​ గదిలో పడకుండా కర్టెన్స్ మూసేయడం వంటివి చేయాలి” అని చెప్పాడు. 

అలవాట్లు మార్చుకుంటే.. కొంత లాభం

అల్జీమర్స్ ఉన్నవాళ్లు రోజూ పుస్తకం చదవాలి. పాటలు వినాలి. డాన్స్ చేయాలి. షటిల్ వంటి ఆటలు ఆడడం వల్ల మతిమరుపు కొంచెం తగ్గుతుంది. రోజూ ఎక్సర్​సైజ్​ చేయాలి. అల్జీమర్స్ పేషెంట్ల మీద కోప్పడటం, అరవడం వంటివి చేయొద్దు. వాళ్లను యాంగ్జైటీ, స్ట్రెస్​కి లోనుకాకుండా చూసుకోవాలి. యాక్టివ్​గా ఉండేందుకు పండ్లు, నట్స్, చేపలు, అన్​ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తినిపించాలి. ఇవన్నీ చేస్తే అల్జీమర్స్ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 మిలియన్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారని ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ రిపోర్ట్ చెప్తోంది. ఏటా దాదాపు10 మిలియన్ల కొత్త కేసులు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల్లో వైకల్యం కలగడానికి అలాగే వాళ్లు ఇంకొకరిపై ఆధారపడటానికి కూడా ఇదే కారణం. కాబట్టి డిమెన్షియా రిస్క్​ను తగ్గించాలంటే లైఫ్ స్టయిల్ మార్పులు తప్పనిసరి అని స్టడీస్ చెప్తున్నాయి. అందుకని మధ్య వయసుకు రాగానే హెల్త్ గురించి మరింత కేర్ తీసుకోవడం అవసరం. డిప్రెషన్, వినపడకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టర్లకు చూపించాలి. 

డిమెన్షియా లక్షణాలు

  • డిమెన్షియా ఉన్న వాళ్లలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అంటే జరిగిన విషయాలు గుర్తుపెట్టుకునే సామర్థ్యం కోల్పోతారు. 
  • ప్రతి దానికి టెన్షన్ పడతారు. మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. టైంకి సరైన పదాలు గుర్తుకు రాక, ఆలోచిస్తుంటారు.
  • డ్రైవింగ్ చేసే సమయంలో కళ్లు మసకబారతాయి. దూరాన్ని సరిగ్గా అంచనా వేయలేరు. 
  • సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఉండదు. లాజికల్ థింకింగ్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ వంటివి సరిగ్గా చేయలేరు.
  • ఒకేసారి ఎక్కువ పనులు (మల్టీ టాస్కింగ్) చేయలేరు. 
  • గందరగోళంగా ఫీల్ అవుతుంటారు. దిక్కుతోచని స్థితిలో ఉంటారు.