కిచెన్ తెలంగాణ : బ్రెడ్తో సూపర్ టేస్టీ వెరైటీ వంటకాలు..

కిచెన్ తెలంగాణ :  బ్రెడ్తో సూపర్ టేస్టీ  వెరైటీ వంటకాలు..

ఏదైనా స్పెషల్ డే గుర్తుండిపోవాలంటే ఆరోజు ఏదో ఒక స్పెషల్ రెసిపీ టేస్ట్ చేయాల్సిందే. ఇవాళ రిపబ్లిక్ డే.. ఇది ఇండియన్స్​ అందరికీ స్పెషల్​ మాత్రమే కాదు ఇంపార్టెంట్ డే కూడా. మరి ఈ డేని స్పెషల్​గా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే కదా. అయితే తక్కువ టైంలో సింపుల్​గా, హెల్దీగా తినాలంటే.. బ్రెడ్ చాలా బెటర్. అందుకే ఈ రిపబ్లిక్​ డేకి బ్రెడ్​తో ముచ్చటగా మూడు రకాల టోస్ట్​లు, వాటిని తయారుచేసుకునే విధానం మీకోసం.  ​ 

బనానా – బ్రెడ్ టోస్ట్ 

కావాల్సినవి :
బ్రెడ్ స్లైసులు – ఐదు 
అరటి పండ్లు – రెండు
వెన్న – ఒక టేబుల్ స్పూన్
కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు
చక్కెర – అర టీస్పూన్
తయారీ : అరటి పండ్లను తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోయాలి. పాన్​లో వెన్న వేడి చేసి అందులో అరటి పండు ముక్కల్ని వేసి ఉడికించాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలో వేయాలి. బ్రెడ్​ స్లైస్​లకు చివర్లు కత్తించాలి. తర్వాత చపాతీ కర్రతో వత్తి, దాని మధ్యలో అరటి పండు గుజ్జు, కొబ్బరి పొడి పెట్టి, మడతపెట్టాలి. రెండు వైపులా చివర్ల నుంచి లీక్ అవ్వకుండా మూసేయాలి. వాటిని పాన్​లో రెండు వైపులా కాల్చుకోవాలి. అవి ప్లేట్​లోకి తీసుకున్న తర్వాత వాటిమీద చక్కెర చల్లుకుంటే సరి. సింపుల్​గా రెడీ చేసుకునే ఈ స్వీట్ పిల్లలకు బాగా నచ్చుతుంది. 

చిల్లీ చీజ్ టోస్ట్

కావాల్సినవి:
బ్రెడ్ స్లైసులు – ఆరు
చీజ్ – ఒక కప్పు, క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ తరుగు, పాలు, వెన్న – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – పావు టీస్పూన్

ఉప్పు – సరిపడా
తయారీ : ఒక గిన్నెలో చీజ్ వేసి పాలు పోసి మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ వేసి అవన్నీ కలిసేలా బాగా కలపాలి. బ్రెడ్ స్లైస్​లకు రెండు వైపులా వెన్న పూయాలి. పాన్ వేడి చేసి అందులో వెన్న పూసిన బ్రెడ్ స్లైసులను రెండు వైపులా కాల్చాలి. ఆ తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ మీద రెడీ చేసుకున్న స్టఫింగ్ పూసి దానిపై మరో బ్రెడ్ పెట్టాలి. ఆపై మరోసారి పాన్​లో పెట్టి కాసేపు ఉడికించాలి. వేడిగా ఉన్నప్పుడే వాటిని శాండ్​ విచ్​ ఆకారంలో చాకుతో కట్ చేయాలి. స్పైసీ, యమ్మీగా ఉండే చిల్లీ చీజ్ టోస్ట్ తినడానికి రెడీ.

ఎగ్ మసాలా టోస్ట్ 

కావాల్సినవి :
కోడిగుడ్లు – ఐదు, ఉల్లిగడ్డ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు, పసుపు – పావు టీస్పూన్
మిరియాల పొడి – అర టీస్పూన్
ఉప్పు – సరిపడా, కారం లేదా చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీస్పూన్, కొత్తిమీర – కొంచెం
వెన్న – సరిపడా

తయారీ :  ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి బాగా కలపాలి. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి బాగా కలపాలి. బ్రెడ్ స్లైస్ మీద స్టఫింగ్ పూసి, పాన్​లో వెన్న వేడి చేసి అందులో బ్రెడ్ స్లైస్​ పెట్టాలి. తర్వాత రెండో వైపు కూడా స్టఫింగ్​ వేయాలి. అలా స్టఫింగ్ వేసిన బ్రెడ్ స్లైస్​లను రెండు వైపులా కాల్చాలి.