గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర బుధవారం 10 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర 37.500 మీటర్ల లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని గేట్ల ద్వారా 39,300 క్యూసెక్కులు, కరెంట్ ఉత్పత్తి ద్వారా 38,621 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 1,500 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-–2కు 650 క్యూసెక్కులు, బీమా లిఫ్టు-2కు 750 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు,ప్యార్లల్ కెనాల్ కు 700 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ కు 730 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 81 వేల 904 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం జలాశయానికి రోజురోజుకూ వరద ఉధృతి కొనసాగుతోంది. 78,245 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగనున్నది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 853.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుండగా, ప్రస్తుతం 88.8820 టీఎంసీల నీరు ఉంది.