- శ్రీశైలంలో 10, సాగర్‌లో 26 గేట్లు ఓపెన్
శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్‌కు రెండు రోజులుగా ఇన్‌ఫ్లో భారీగా వస్తోంది. గురువారం వరకు ప్రాజెక్ట్‌కు 2,82,827 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో పది గేట్లను పది మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగుల మేర నీరు చేరింది.
రిజర్వాయర్ కెపాసిటీ 215.8070 టీఎంసీలు కాగా 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి కొనసాగుతోంది. గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మొత్తం 3,48,235 క్యూసెక్కుల నీటిని విడుదల వదులుతున్నారు.
నాగార్జునసాగర్ 26 గేట్లు ఓపెన్
హాలియా, వెలుగు: శ్రీశైలం నుంచి దిగువకు భారీ మొత్తంలో నీటిని విడుదల చేస్తుండడంతో సాగర్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో సాగర్ 26 క్రస్ట్ గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 2,65,904 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీ) కాగా పూర్తిస్థాయిలో నిండుకుండలా మారింది. సాగర్ నుంచి కుడి కాల్వకు 9,550 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,280, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,029, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్ ప్రాజెక్ట్ అన్ని గేట్లు ఓపెన్ కావ డంతో పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రధాన డ్యాంతో పాటు బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం, సమ్మక్క సారక్క, ప్రధాన డ్యాం, శివాలయం ఘాట్, పవర్ హౌస్, ఎత్తిపోతలు, అనుపు, కొత్త, పాత వంతెన, ప్రధాన గేట్లు, కొత్త బ్రిడ్జి తదితర ప్రదేశాలను సందర్శిస్తున్నారు.