
గత కొన్నియేండ్లుగా మనదేశంలో మహిళల హక్కులు బాగా అభివృద్ధి చెందాయి. స్ట్రీల గౌరవం, భద్రత, అవకాశాలను కాపాడే చట్టాలు వచ్చాయి. సమాన వేతనం, ప్రసూతి ప్రయోజనాల హక్కు నుంచి గృహహింస నుంచి రక్షణ వరకు భారతీయ చట్టాలు వివిధ రంగాలలో మహిళలకు సాధికారత కల్పించాయి. భారతదేశంలో మహిళల గౌరవం, స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడుకోవడానికి రూపొందించబడిన అనేక చట్టపరమైన హక్కులతో సాధికారత పొందుతున్నారు. లింగ సమానత్వం ఇంకా పురోగతిలో ఉన్నప్పటికీ ఈ హక్కులను తెలుసుకోవడం వ్యక్తిగత, వృత్తిపరమైన ,సామాజిక సవాళ్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన పది కీలకమైన చట్టాలను గురించి చూద్దాం..
గృహ హింస నిరోధక చట్టం 2005 ..
జీవిత భాగస్వామి, అత్తమామలు లేదా కుటుంబ సభ్యుల నుంచి శారీరక, మానసిక, లైంగిక లేదా ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలు ఈ చట్టం కింద రక్షణ పొందవచ్చు. ఇది భర్త లేదా అత్తమామల యాజమాన్యంలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కును మంజూరు చేస్తుంది. జీవన భృతి, కస్టడీ ఉత్తర్వులు,చట్టపరమైన రక్షణను అందిస్తుంది.
సమాన వేతన హక్కు (సమాన వేతన చట్టం, 1976)..
ఏ యజమాని కూడా వేతనాలు లేదా నియామకాలలో లింగం వివక్ష చూపకూడదు. స్త్రీలు పురుష సహచరులతో సమానమైన పనికి సమాన వేతనం పొందాలి. వేతన వివక్షను ఎదుర్కొంటుంటే మీరు లేబర్ కోర్టును సంప్రదించవచ్చు లేదా సంస్థ HR విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు.
ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హక్కు (POSH చట్టం, 2013)..
ఆఫీసుల్లో లైంగిక వేధింపులు తీవ్రమైన నేరం. లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ప్రతి సంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)ని ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. మహిళా ఉద్యోగులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు.
ప్రసూతి సెలవు హక్కు..
ప్రసూతి ప్రయోజన చట్టం,1961 ను- 2017 సవరించారు. దీని ప్రకారం ప్రభుత్వ ,ప్రైవేట్ రంగాలలో పనిచేసే మహిళలు మొదటి ఇద్దరు పిల్లలకు 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, తరువాతి పిల్లలకు 12 వారాలకు సెలవులు పొందవచ్చు. ఈ చట్టం నర్సింగ్ తల్లులకు క్రెచ్‌లు, సౌకర్యవంతమైన పని గంటల కోసం నిబంధనలను కూడా తప్పనిసరి చేస్తుంది.
గర్భస్రావం హక్కు..
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971 లో ఈహక్కును కల్పించారు. - 2021లో సవరించబడింది.దీని ప్రకారం చట్టపరమైన వైద్య పర్యవేక్షణలో 24 వారాల వరకు అవాంఛిత గర్భధారణను తొలగించే హక్కు స్త్రీకి ఉంది. అత్యాచారం, అశ్లీల లైంగిక సంబంధం లేదా పిండం అసాధారణతల కేసులలో వైద్య బోర్డు ఆమోదంతో ఈ కాలానికి మించి కూడా గర్భస్రావాలు అనుమతించబడతాయి.
వరకట్న వ్యతిరేక హక్కు
కట్న నిషేధ చట్టం, 1961 చట్ట ప్రకారం వివాహానికి ముందు, వివాహం సమయంలో లేదా తర్వాత వరకట్నం డిమాండ్ చేయడం, ఇవ్వడం లేదా తీసుకోవడం చట్టవిరుద్ధం. వరకట్న వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలు ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు నమోదు చేయవచ్చు. ఇది నేరస్థులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
పూర్వీకుల ఆస్తి హక్కు
హిందూ వారసత్వ చట్టం,1956 ద్వారా ఈ హక్కును కల్పించారు. -2005లో సవరించబడింది. కుమార్తెలకు వారి పూర్వీకుల ఆస్తిలో కొడుకులతో సమాన హక్కులు ఉన్నాయి. తండ్రి వీలునామా లేకుండా మరణించినప్పటికీ కుమార్తెకు ఆమె సోదరులతో సమాన వాటా ఉంటుంది. ఇది వివాహిత కుమార్తెలకు కూడా వర్తిస్తుంది. వారి ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది.
గౌరవం, గోప్యతతో జీవించే హక్కు..
గోప్యత హక్కు, ఆర్టికల్ 21 ద్వారా ఈ హక్కు కల్పించారు. వైద్య పరమైన కాంప్లికెంట్స్, లైంగిక స్వయం ప్రతిపత్తి లేదా వ్యక్తిగత సమాచారం విషయంలో స్త్రీకి గోప్యతపై సంపూర్ణ హక్కు ఉంది. ప్రభుత్వం లేదా కుటుంబ సభ్యులతో సహా ఎవరూ ఆమె ఇష్టానికి విరుద్ధంగా వ్యక్తిగత వివరాలను వెల్లడించకూడదు.. అది చట్ట రీత్యా నేరం.
ఉచిత న్యాయ సహాయం హక్కు
చట్టపరమైన సేవల అధికారుల చట్టం, 1987 ద్వారా ఈ హక్కు లభించింది. ముఖ్యంగా బలహీన వర్గాల మహిళలు గృహ హింస, విడాకులు, పిల్లల కస్టడీ లేదా ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాలకు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. ప్రతి జిల్లాలో లా హెల్పింగ్ సెల్ ఉంటుంది. ఇక్కడ మహిళలు కోర్టులో ఉచిత సంప్రదింపులు, ప్రాతినిధ్యం పొందవచ్చు.
వేధింపులు, సైబర్ వేధింపులకు వ్యతిరేకంగా హక్కు:
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అయినా, వెంటపడి వేధించడం అయినా శిక్షార్హమైన నేరం. కాల్స్, మేసేజ్ లు, బెదిరింపులు, కదలికలను ట్రాక్ చేయడం వంటి చర్యలకు జైలు శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన శిక్షలు ఉంటాయి. మహిళలు సైబర్ క్రైమ్ సెల్‌లు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేయవచ్చు.