బిజినెస్ డెస్క్, వెలుగు: ప్రస్తుతం దేశంలో సుమారు 92,683 స్టార్టప్‌లు, 108 యూనికార్న్‌లు ఉండగా, మరో 96 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారడానికి రెడీగా ఉన్నాయని హురున్ ఇండియా ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్ల) కంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలుస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ, క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో, ఎడ్‌టెక్ కంపెనీ లీప్ స్కాలర్ యూనికార్న్‌లుగా మారనున్న స్టార్టప్‌ల లిస్టులో ముందున్నాయి. స్టార్టప్‌లకు ఫండింగ్ దొరకడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా, రెగ్యులేటరీ స్క్రూటినీ ఎక్కువగా ఉన్నా ఈ కంపెనీలు యూనికార్న్‌లుగా త్వరలో మారబోతున్నాయి.
భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా మారే సత్తా ఉన్న స్టార్టప్‌ల మొత్తం వాల్యుయేషన్ 57 బిలియన్ డాలర్లుగా ఉందని, ఇది కిందటేడాదితో పోలిస్తే 16 % ఎక్కువని హురున్ ఇండియా, ఏఎస్‌కే ప్రైవేట్ వెల్త్ ప్రకటించాయి. బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌కు చేరువలో ఉన్న స్టార్టప్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ అబ్జర్వ్. ఏఐ, అగ్రిటెక్ వెంచర్ నింజాకార్ట్‌లు కూడా ఉన్నాయి. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో యూనికార్న్‌లుగా మారే సత్తా ఉన్న స్టార్టప్‌ల లిస్ట్‌ను హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసింది. ‘ఏఎస్‌కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ 2023’ పేరుతో ఈ లిస్ట్‌ను బయటపెట్టింది. 2000 తర్వాత ఏర్పడిన, కనీసం 200 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్‌లను పరిగణనలోకి తీసుకుంది.
ఇంకో మూడేళ్లలో 51 యూనికార్న్‌లు..
ఇంకో మూడేళ్లలో సుమారు 51 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారుతాయని, అదే ఐదేళ్లలో అయితే 96 యూనికార్న్‌లు పుట్టుకొస్తాయని హురున్ లిస్ట్ వెల్లడించింది. గ్లోబల్‌గా ఎకానమీ స్లోడౌన్ ఉండడంతో కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయని, కిందటేడాది లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న స్టార్టప్‌లలో కనీసం 20 శాతం లిస్ట్ నుంచి వైదొలగడమో లేదా ర్యాంక్ పడిపోవడమో చూశామని హురున్ ఇండియా ఫౌండర్ అనస్ రెహ్మన్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరగడం, జియోపొలిటికల్ టెన్షన్లతో ఫండ్స్ సేకరించడంలో స్టార్టప్‌లు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. వడ్డీ రేట్లు పెరగడం వలన ఇన్వెస్టర్లు స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించడం తగ్గిందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 147 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారే సత్తా ఉందని వెల్లడించారు. హురున్ లిస్ట్ ప్రకారం, ఫిన్‌టెక్ సెక్టార్ నుంచి 11 స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) సెక్టార్ నుంచి ఆరు కంపెనీలు, ఈ–కామర్స్, అగ్రిటెక్ సెక్టార్ల నుంచి నాలుగేసి స్టార్టప్‌లకు యూనికార్న్‌లుగా మారే సత్తా ఉంది.
తాజా ఫండింగ్ రౌండ్‌లో వాల్యుయేషన్‌ను ఆధారంగా హురున్ లిస్ట్‌ను తయారు చేసింది. అంతేకాకుండా రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఇతర ఎంటర్‌ప్రెనూర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను, వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండ్స్, ఏంజెల్ ఇన్వెస్టర్లను పరిగణనలోకి తీసుకుంది. లిస్ట్‌లో దిగువన ఉన్న స్టార్టప్‌లు కూడా తొందరగా యూనికార్న్‌లు అవ్వొచ్చని, అలాంటి సంఘటనలు గతంలో చూశామని అనస్ రెహ్మన్ జునైద్ అన్నారు. ఇండియన్ స్టార్టప్‌లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్‌లలో పీక్ ఎక్స్‌వీ పార్టనర్స్ (సెకోయి క్యాపిటల్ ఇండియా అండ్ ఎస్‌ఈఏ) టాప్‌లో ఉంది. ఈ కంపెనీ 37 ఇన్వెస్ట్‌మెంట్లు చేసింది. ఆ తర్వాత ఇన్నోవెన్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, ఏసెల్, బ్లూమ్ వెంచర్స్ వంటి ఇతర కంపెనీలు ఉన్నాయి. ఏంజెల్ ఇన్వెస్టర్లలో జనరల్ కెటలిస్ట్ పార్టనర్ ఆనంద్ చంద్రశేఖరన్ ముందున్నారు. ఆయన 16 ఇన్వెస్ట్‌మెంట్లు చేశారు. 12 ఇన్వెస్ట్‌మెంట్లతో కునాల్ షా రెండో ప్లేస్‌లో, రోహిత్ బన్సాల్, కునాల్ బాల్ ఎనిమిదేసి ఇన్వెస్ట్‌మెంట్లను ఫ్యూచర్ యూనికార్న్‌లలో చేశారు.