డోంట్ వర్రీ.. AI ఎంత దూసుకొచ్చినా ఈ 10 ఉద్యోగాలు సేఫ్..

డోంట్ వర్రీ.. AI ఎంత దూసుకొచ్చినా ఈ 10 ఉద్యోగాలు సేఫ్..

AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది.. ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయి.. ఏఐ వల్ల కంపెనీలు తమ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి.. ఏఐ ఎంత దూసుకొచ్చినా.. జనంలో భాగం అయినా.. ఓ పది ఉద్యోగాలకు మాత్రం ఢోకా లేదు.. ఇంకా డిమాండ్ పెరుగుతుంది.. ఏఐ కూడా ఏమీ చేయలేని.. ఏఐతో ఎలాంటి ఇబ్బంది లేని పది రంగాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం..

ఆర్టిస్టులు: ఏఐ (AI) అనేది మనిషి మేధా సృష్టే తప్ప కళాత్మక సృష్టి కాదు. కళతో మనిషిని కదిలించే శక్తి, మనిషిలో భావోద్వేగాలను స్ప్రుశించే శక్తి మనిషికి మాత్రమే ఉంది. సింపుల్గా చెప్పాలంటే కళా రంగంలో (అది ఏ కళ అయినా) కొనసాగే ఏ ఒక్కరి భవిష్యత్కు ఏఐ వల్ల వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు.

సైంటిస్టులు: శాస్త్రవేత్తలుగా కొనసాగుతున్న వారికి కూడా ఏఐ వల్ల అంత నష్టం ఉండకపోవచ్చు. మేధా శక్తితో సంక్లిష్ట అంశాలపై అధ్యయనం చేయడం శాస్త్రవేత్తల వల్ల అవుతుందే తప్ప ఏఐ వల్ల కాదు. శాస్త్రవేత్తలకు తన కృత్రిమ మేథా సంపత్తితో ఏఐ సాయపడగలదే తప్ప శాస్త్రవేత్తల స్థానాన్ని భర్తీ చేయగలిగే పరిస్థితి దాదాపు ఉండదు.

థెరపిస్టులు, కౌన్సిలర్లు: మానసిక నిపుణులుగా సమాజంలో కొనసాగుతున్న వారి ఉద్యోగాలకు కూడా ఏఐ వల్ల వచ్చిన ఢోకా అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే.. ఒక మనిషి మానసిక స్థితిని అంచనా వేయడం మరో మనిషికే సాధ్యమవుతుంది. అప్పుడే భావోద్వేగంతో కూడిన భరోసాను ఇచ్చి మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులకు ధైర్యాన్ని ఇవ్వగలం. ఈ పని చేసేది కౌన్సిలర్లు, థెరపిస్టులే కాబట్టి ఏఐ వల్ల ఈ రంగంలో ఉన్నవారికి పెద్ద ముప్పు ఉండకపోవచ్చు.

స్ట్రాటజిస్టులు, అనలిస్టులు: ప్రస్తుతం స్ట్రాటజిస్టులు, అనలిస్టులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాలిటిక్స్లో అయితే పార్టీ అధినేతలకే సూచనలు, సలహాలు ఇవ్వగలిగే రేంజ్లో స్ట్రాటజిస్టులు ఉన్నారు. ఏఐ ఒక డేటాను అనలైజ్ చేయగలదే తప్ప ఏ స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళితే సక్సెస్ అవుతామో చెప్పలేదు. సో.. ఏఐ వచ్చినా స్ట్రాటజిస్టులు, అనలిస్టులు తమ రంగంలో ప్రశాంతంగా ముందుకెళ్లొచ్చు.

లాయర్లు్: న్యాయవాద వృత్తిపై కూడా ఏఐ ప్రభావం అంతం మాత్రమే. సమాజపరంగా, కుటుంబపరంగా ఎదురయ్యే సమస్యలకు, సవాళ్లకు న్యాయపరంగా ఎలా ముందుకెళితే పరిష్కారం దొరుకుతుందో న్యాయవాదులు మాత్రమే చెప్పగలరు. న్యాయస్థానాల్లో వాదనలను బలంగా వినిపించగలరు. ఒక క్లైయింట్కు నమ్మకం కలిగించి కేసును టేకప్ చేయడం, ఆ కేసులో నెగ్గుకురావడం న్యాయవాదులకు సంబంధించిన అంశమే తప్ప ఏఐకి ఇందులో కలగజేసుకునే అవకాశం ఇసుమంతైనా లేదు.

జర్నలిస్టులు: సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపడం, ప్రజలకు ప్రతీ వ్యవస్థ జవాబుదారీగా వ్యవహరించేలా చూడటంలో మీడియాది కీలక పాత్ర. ఈ మీడియా రంగంలో కొనసాగుతున్న జర్నలిస్టులపై కూడా ఏఐ ప్రభావం అంతగా ఉండదు. చీకటి కోణాలను బయటపెట్టి బాధితుల పక్షాన నిలబడగలిగే అవకాశం గ్రౌండ్ రియాల్టీలో మీడియాకే ఉంది తప్ప ఏఐకి కాదు.

టీచర్లు: ఒక విద్యార్థిని తీర్చిదిద్దడంలో గురువుకు ఉండే స్థానం ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి టీచింగ్ ప్రొఫెషన్లో కొనసాగుతున్న వారికి కూడా ఏఐ వల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక విద్యార్థికి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇవ్వగలదే తప్ప విలువలు బోధించలేదు. సమాజంలో ఎలా బ్రతికితే గౌరవం దక్కుతుందో, తల్లిదండ్రులను బాధ్యతగా ఎలా చూసుకోవాలో, ఇతరత్రా మంచీచెడులన్నీ విద్యార్థి దశలో ఉన్నప్పుడే టీచర్లు బోధిస్తారు. టీచర్లు చెప్పిన మాట విని బాగుపడిన వాళ్లూ ఉంటారు. పెడచెవిన పెట్టి చెడిపోయిన వాళ్లూ ఉన్నారు. ఈ మంచీచెడు మధ్య వ్యత్యాసం చెప్పగలిగేది ఒక టీచరే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమాత్రం కాదు.

సర్జన్లు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్: వైద్య రంగంపై ఏఐ ప్రభావం దాదాపుగా ఉండదు. ఎందుకంటే.. ఒక మనిషికి చికిత్స అందించాలన్నా, సర్జరీ చేయాలన్నా సాంకేతికత సాయపడుతుందే తప్ప మనిషి ప్రమేయం లేనిదే ఏదీ కాదు. సో.. వైద్య రంగంలో కొనసాగుతున్న ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు కూడా సేఫ్.

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్: కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి గానీ, ఫిర్యాదులు స్వీకరించడంలో గానీ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ కీలక పాత్ర పోషిస్తారు. బీపీఓ, కాల్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులను ఏఐ భర్తీ చేయడం కష్టమే. ఎందుకంటే.. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలంటే ఓపిక, సహనం ఎంతో అవసరం. ఏఐకి అవంటే ఏంటో కూడా తెలియదు.

ప్రొఫెషనల్ అథ్లెట్లు: అథ్లెట్లుగా రాణించాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. మానసికంగా కూడా ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టే ముందుచూపు ఉండాలి. ఒక మనిషి మాత్రమే అథ్లెట్గా రాణించగలడు తప్ప ఏఐ ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ జీరో. సో.. ప్రొఫెషనల్ అథ్లెట్లకు కూడా ఏఐ వల్ల వచ్చిన నష్టం ఏం లేదు.