- తిరుపతి ఆస్పత్రి ఘటన కలచివేసింది:సీఎం జగన్
- కరోనా చికిత్స విషయంలో కలెక్టర్లందరూ అప్రమత్తంగా ఉండాలి
- జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో కొద్దిసేపు అంతరాయం వల్ల 11 మంది చనిపోయిన ఘటన తనను కలచివేసిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో తన క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై సమీక్షించిన ఆయన కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ జలకళ, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, హౌసింగ్, స్పందనకు వచ్చిన వినతులు, ఖరీఫ్‌కు సన్నద్ధత కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు.
కరోనాతో సహజీవనం తప్పడం లేదు
ప్రస్తుతం అందరం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసిందని, వారిని ఆదుకునే విషయంలో ఎంత చేసినా తక్కువేనంటూ ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ‘‘తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్ కొరత ఏర్పడిందని.. 11 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కలెక్టర్లందరికీ చెప్తున్నా... చాలా అప్రమత్తతో వ్యవహరించాలి, ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది, కోవిడ్ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కోవాల్సి ఉందని’’ సీఎం అన్నారు.
వ్యాక్సిన్ సమస్య తీవ్రంగా ఉంది..
వ్యాక్సినేషన్ కార్యక్రమంపై చర్చిస్తూ డబ్బులు తీసుకుని మాకు సప్లై చేయండని కోరినా సరే కంపెనీలు తీసుకోవడం లేదని, వ్యాక్సిన్ల పంపిణీ అన్నది కేంద్రం నియంత్రణలో ఉంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం కూడా అఫడవిట్‌కూడా దాఖలు చేసింది. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్దారిస్తామని అఫడవిట్లో పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఉండి కూడా ప్రతిపక్షం నేతలు విమర్శలు చేయడం సరికాదని.. ప్రజల్లో అలజడిని రేకెత్తించడానికి, భయాందోళనలు సృష్టించడానికి, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని’ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అదించగలుగుతున్నాం, మరణాల రేటు పరిశీలిస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాం. కలెక్టర్ల స్థాయి నుంచి ఆశా వర్కర్, వాలంటీర్ స్థాయి వరకూ ఎంతో కమిట్‌మెంట్‌గా చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం. అయినా సరే కొన్ని కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. అయినా సరే.. మరింత సమర్థవంతంగా, మానవత్వంగా, సానుభూతి చూపించి పనిచేద్దాం. మన తప్పు కాకపోయినా, పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్ సకాలానికి రాకపోయినా సరే ... బాధ్యత తీసుకుని నిన్నటి రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం. వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం ఇవ్వండి, వారి బాసటగా ఉండండి. తప్పులు మళ్లీ జరక్కుండా... చూసుకోవాలని జగన్ ఆదేశించారు.