వాటర్ క్యాన్లు కొంటున్న 10 లక్షల కుటుంబాలు

  • గ్రేటర్​ జనం వారం తాగునీటి ఖర్చు 40 కోట్లు
  • వాటర్ క్యాన్లు కొంటున్న 10 లక్షల కుటుంబాలు
  • వాటర్ లైన్ లేకపోవడం, లోప్రెషర్, కలుషిత నీటి భయమే కారణం
  • డిమాండుకు తగ్గట్టుగా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు

హైదరాబాద్, వెలుగు: సిటీతోపాటు శివారు ప్రాంతాల్లోని జనం మంచి నీటిని కొనుక్కునే తాగుతున్నారు. జలమండలి పరిధిలోని సుమారు10 లక్షల కుటుంబాలు ప్రస్తుతం వారానికి దాదాపుగా రూ. 40 కోట్లను తాగునీటికి ఖర్చు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు జలమండలి వాటర్​పైప్​లైన్లు లేకపోవడం, ఉన్నా సరిగ్గా సప్లై కాకపోవడం, ఇంకొన్ని ప్రాంతాల్లో తరచూ కలుషిత నీరు సరఫరా అవడంతోనే మంచినీటిని కొంటున్నారు. ఎండాకాలం స్టార్ట్​అయ్యాక మంచినీటికి డిమాండ్ పెరగడంతో అన్నిచోట్ల వాటర్​ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. మొన్నటివరకు రూ.15 నుంచి రూ.25 ఉన్న 20 లీటర్ల క్యాన్  మరింత పిరెం అయ్యిది. కరెంట్ చార్జీలు పెరిగాయని చెబుతూ క్యాన్ల రేట్లు పెంచేశారు. హోం డెలివరీ అయితే మరింత ఎక్కువగా ఉన్నాయి. జలమండలి పరిధిలో 10 వేలకు పైగా వాటర్ ప్లాంట్లు ఉండగా, వీటిలో బ్రాండెడ్​వాటికి మంచి డిమాండ్ ఉంది. ఐటీ కంపెనీలు పూర్తిగా ఓపెన్ కాకపోయినప్పటికీ అపార్ట్​మెంట్లు, విల్లాల్లో ఎక్కువగా బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. బ్రాండెడ్​ కంపెనీ 20 లీటర్ల క్యాన్​రూ.85 నుంచి 150 వరకు ఉంది. డైలీ15 లక్షల వాటర్​క్యాన్లు అమ్ముతున్నట్లు బ్రాండెడ్​కంపెనీల డీలర్లు చెబుతున్నారు.

ఆ నీటిని ఇంట్లో అవసరాలకు..
సిటీలోని వాటర్ ప్లాంట్లను చూస్తుంటే జలమండలి సరఫరా చేస్తున్న నీటిని తాగేందుకు జనం ఇంట్రస్ట్ చూపించట్లేదని తెలుస్తోంది.  ఒక్కోసారి కలుషిత నీరు సప్లై అవుతుండడంతో సర్కారు సప్లై చేస్తున్న నీటిని తాగట్లేదని జనం చెబుతున్నారు. పైసలు పోయినా సరే కొనుక్కునే తాగుతున్నామని అంటున్నారు. కొన్ని ఏరియాలకు ఏ టైంలో సరఫరా అవుతుందో తెలియక బయట కొనుక్కుంటున్నట్లు చెబుతున్నారు. అంబర్ పేట, సులేమాన్ నగర్, లంగర్ హౌస్, చిక్కడపల్లిలోని అరోరానగర్, జహనుమా తదితర ప్రాంతాల్లో జలమండలి నీరు కలుషితం అయ్యి సప్లై అవుతుండడంతో తాగడమే మానేశారు. ఇదే విషయంపై అక్కడి జనం జలమండలికి వరుసగా ట్వీట్​చేస్తున్నారు. అయినప్పటికీ ప్రాబ్లమ్ సాల్వ్ కావడంలేదు.

అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నరు
నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం డైలీ సగటున 20 లీటర్ల వాటర్‌‌ క్యాన్‌‌ను వినియోగిస్తోంది. ఆ క్యాన్‌‌ ప్రాంతాన్ని, పోటీని బట్టి రూ.15 నుంచి 25 వరకు అమ్ముతున్నారు. డోర్‌‌ డెలివరీ చేస్తే అదనంగా మరో రూ.10–15 వసూలు తీసుకుంటున్నారు. ఇలా ఒక్కో కుటుంబం నెలకు సగటున రూ.30 చొప్పున రూ.900 వరకు ఖర్చు చేస్తోంది. వాటర్​డిమాండ్​ను ఆదాయ వనరుగా మార్చుకున్న వ్యాపారులు పుట్టగొడుగుల్లా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు, మినరల్స్​లేకుండానే నీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇవీ నిబంధనలు

  • ప్యాకేజ్డ్‌‌ డ్రింకింగ్‌‌ వాటర్‌‌ ప్లాంట్‌‌ ఏర్పాటుకు వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలవనరుల శాఖ అనుమతి ఉండాలి. 500 మీటర్ల పరిధిలో మరో బోరు తవ్వకూడదు. కెమికల్​ఫ్యాక్టరీలు చోట ఏర్పాటు చేయకూడదు. 
  • స్థానిక సంస్థలు, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి, ప్రజారోగ్య శాఖ, తూనికలు, కొలతల శాఖ, ఆహార భద్రత అధికారి, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలతో పాటు తదితర శాఖల నుంచి అనుమతి పొందాలి. వీరి అనుమతి లేకుండా ప్లాంట్‌‌ ఏర్పాటు చేస్తే సంబంధిత ఆఫీసర్లు సీజ్‌‌ చేయొచ్చు.  
  • ప్యాకింగ్, బాట్లింగ్‌‌ చేసే ప్లాంట్‌‌కు ఐఎస్‌‌ఐ గుర్తింపు తప్పనిసరి. దీనిని భారత ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. ఐఎస్‌‌ఐ గుర్తింపును బ్యూరో ఆఫ్‌‌ ఇండియన్‌‌ స్టాండర్డ్స్‌‌(బీఐఎస్‌‌) జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్‌‌ను ప్లాంట్‌‌లో కనిపించేలా ఉంచాలి. ఇది లేకుండా నడిచే ప్లాంటును సీజ్‌‌ చేసే అధికారం రెవెన్యూ అధికారులది.
  • ఒక్కసారి బీఐఎస్‌‌/ఐఎస్‌‌ఐ సర్టిఫికేషన్‌‌ వచ్చాక ఏటా రెన్యువల్‌‌ చేయించుకోవాలి. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే రెన్యువల్‌‌ చేస్తారు.  
  • ఫుడ్‌‌ సేఫ్టీ అండ్‌‌ స్టాండర్డ్స్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా(ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ) సర్టిఫికేషన్‌‌ కూడా ఉండాలి.   
  • బీఐఎస్‌‌ సర్టిఫికేషన్‌‌ ఉంటేనే ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ లైసెన్స్‌‌ జారీ చేస్తుంది. 
  • ఈ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేయాలి.  
  • శుద్ధి చేసిన నీటిలో టోటల్‌‌ డిజాల్డ్‌‌ సాల్వెంట్స్ స్థాయి లీటరుకు 500 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. అది తెలియజేయడానికి డిజిటల్‌‌ మీటర్‌‌ ఏర్పాటు చేయాలి.  
  • టీడీఎస్‌‌ చెక్‌‌ చేయడానికి ప్లాంట్‌‌లో ల్యాబ్‌‌ ఉండాలి. ఈ ల్యాబ్‌‌లో ల్యాబ్‌‌ టెక్నీషియన్‌‌ను నియమించాలి. నీటిని స్టోర్‌‌ చేయడానికి ట్యాంకులు ఉండాలి.

రెండు ప్రాజెక్టులున్నా కొంటున్నం
పక్కనే గండిపేట, హిమాయత్ సాగర్​ప్రాజెక్టులు ఉన్నప్పటికీ నీళ్లను కొనుక్కునే తాగుతున్నం. నల్లా నీళ్లు సరిగ్గా సరఫరా కాకపోవడంతోనే ఈ సమస్య ఉంది. మంచినీళ్లకే దాదాపుగా నెలకు వెయ్యి ఖర్చు చేస్తున్నాం. 
– సుజాత, హైదర్​షా కోట్, బండ్లగూడ జాగీర్

సరిగ్గా వస్తే ఈ బాధ ఉండదు
జలమండలి సరఫరా చేసే నీరు సరిగ్గా సరఫరా అయితే సమస్య ఉండదు. టైంకి రాకపోవడంతోనే నీళ్లు కొనాల్సి వస్తోంది. నల్లా నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియట్లేదు. రెగ్యులర్​గా వాటర్ క్యాన్ కొనక తప్పట్లేదు. 
– సుద్దాల దక్షిణామూర్తి, బోడుప్పల్  

సేల్స్ డబుల్ అయ్యాయి
మొన్నటివరకు డైలీ150 నుంచి 200 వాటర్​ క్యాన్లు సేల్​అయ్యేవి. సమ్మర్ స్టార్ట్​అయ్యాక 400 వరకు సేల్​అవుతున్నాయి. ఎక్కువగా అపార్టుమెంట్లలో ఉంటున్న వారు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నీటికి బాగా డిమాండ్ ఉంది. – అన్వర్, ఓ బ్రాండెడ్  వాటర్ కంపెనీ డీలర్

ఇల్లీగల్​ వాటిపై చర్యలు తీసుకుంటం
ఇల్లీగల్​గా కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లపై దాడులు జరిపి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్నింటిపై చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా అటువంటి వాటర్ ప్లాంట్లు ఉంటే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. 
– వెంకటేశ్వర్లు, ఆర్డీఓ, హైదరాబాద్