- యుటిలిటీ వెహికల్స్‌కు పెరిగిన డిమాండ్
- క్యూ1 లో 64 లక్షల పైన మొత్తం బండ్ల అమ్మకాలు: సియామ్
న్యూఢిల్లీ : ప్యాసింజర్ వెహికల్స్ (కార్లు, వ్యాన్లు, ట్రక్‌లు) హోల్‌సేల్స్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో 10 లక్షల మార్క్‌ను దాటాయి. యుటిలిటీ వెహికల్స్ (ట్రక్కులు వంటివి) కు డిమాండ్ బాగుండడంతో రికార్డ్ లెవెల్‌లో హోల్‌సేల్స్ జరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. డీలర్లకు బండ్ల తయారీ కంపెనీలు జూన్ క్వార్టర్‌లో 10,26,006 ప్యాసింజర్ బండ్లను డిస్పాచ్ చేశాయి. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో ఈ నెంబర్ 9,96,565 యూనిట్లుగా రికార్డయ్యింది.
వీటిలో యుటిలిటీ వెహికల్స్ అమ్మకాలు 6,45,794 యూనిట్లుగా ఉన్నాయి. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో అమ్ముడైన 5,47,194 యూనిట్లతో పోలిస్తే 18 శాతం పెరిగాయి. వ్యాన్ల హోల్‌సేల్స్ 35,648 యూనిట్ల నుంచి 9 శాతం పెరిగి 38,919 యూనిట్లకు పెరిగాయి. ప్యాసింజర్ కార్ల అమ్మకాలు మాత్రం 14 శాతం తగ్గాయి. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో 4,13,723 ప్యాసింజర్ కార్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 3,41,293 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. జూన్ క్వార్టర్‌లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వెహికల్స్‌లో 63 శాతం వాటా యుటిలిటీ వెహికల్స్‌దే ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు.
సెడాన్‌ల నుంచి ఎస్‌యూవీలకు కస్టమర్లు షిఫ్ట్ అవుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఏ క్వార్టర్‌లోనూ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 10 లక్షల మార్క్‌ను దాటలేదని, ఇదే మొదటిసారి అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు. మరోవైపు టూవీలర్ల హోల్‌సేల్స్ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 49,85,631 యూనిట్లకు పెరిగాయి. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో జరిగిన హోల్‌సేల్స్ 41,40,964 యూనిట్లతో పోలిస్తే 20 శాతం పెరిగాయి. టూవీలర్లలో కూడా స్కూటర్లకు మంచి గిరాకీ ఉందని, వీటి సేల్స్ భారీగా పెరిగాయని అగర్వాల్ అన్నారు.
త్రీవీలర్ల హోల్‌సేల్స్ 14 శాతం పెరిగి 1,44,530 యూనిట్ల నుంచి 1,65,081 కి చేరుకున్నాయి. కమర్షియల్ వెహికల్స్ హోల్‌సేల్స్ ఏడాది ప్రాతిపదికన 3.5 శాతం వృద్ధి చెంది 2,24,209 యూనిట్లకు చేరుకున్నాయి. బండ్ల మొత్తం హోల్‌సేల్స్ జూన్ క్వార్టర్‌లో 16 శాతం పెరిగి 54,98,752 యూనిట్ల నుంచి 64,01,006 యూనిట్లకు ఎగిశాయి. ఫెస్టివల్ సీజన్‌తో పాటు ఈసారి వర్షాకాలం బాగుంటుందనే అంచనాల నేపథ్యంలో ఆటోమోటివ్ సెక్టార్ ఈ ఏడాది మరింత వృద్ధి చెంతుందని అగర్వాల్ పేర్కొన్నారు. కంపెనీల ఇన్వెంటరీ పెరగడంపై ఆందోళన పడాల్సిన పనిలేదని రాజేష్ చెప్పారు.