చైనా క్యాంపుల్లో పది లక్షల మంది

చిన్నపాటి పట్నంలా.. అతి పెద్ద క్యాంపు. దానిలోకి వెళ్లడమే తప్ప బయటకు రావడం దాదాపు అసాధ్యం. పెద్ద పెద్ద గేట్లు, ఎత్తయిన గోడలు, వాచ్ టవర్స్ వీటిని చూస్తే జైలు గుర్తుకొస్తుంది. అయితే అది జైలూ కాదు , లోపల ఉన్నది ఖైదీలూ కారు. లోపలివాళ్లంతా బందీలు కాని బందీలు. అది చైనాలోని క్యాంపు. వీగర్ ముస్లింలను ఉంచిన క్యాంపు అది. ఇట్టాంటి క్యాంపులు చైనాలో లెక్కలేనన్ని ఏర్పాటయ్యాయి. ఈ వీగర్ ముస్లింలెవరో, ఈ క్యాంపులెందుకో ఒకసారి చూద్దాం.

వీగర్ ముస్లింలు …చైనాలో సెటిలైన జాతి ఇది. టర్కీ భాష మాట్లాడే వీరు సెంట్రల్ ఆసియా నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు వలసపోయారు. వీరిలో ఎక్కువ మంది చైనాలోని  జిన్ జియాంగ్  ప్రాంతంలో సెటిలయ్యారు. అయితే కొంతకాలం నుంచి వీగర్ ముస్లింలపై  చైనా ప్రభుత్వం దారుణాలకు ఒడిగడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీగర్ ముస్లింలను పెద్ద సంఖ్యలో డిటెన్షన్​ సెంటర్ల​లో బంధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెయ్యో, పదివేలో కాదు పది లక్షల మందికి పైగా వీగర్ ముస్లింలు ప్రస్తుతం ఈ   కేంద్రాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ క్యాంప్​లను ‘వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్’ పేరుతో చైనా వ్యవహరిస్తోంది.  ఈ కేంద్రాల్లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు బయటి దేశాలు ఆరోపిస్తున్నాయి.

ఎందుకు అరెస్టు చేస్తారో తెలియదు!

ఎప్పుడు ఎవరిని ఈ  కేంద్రాలకు తరలిస్తారో తెలియని పరిస్థితులు జిన్ జియాంగ్  ప్రాంతంలో నెలకొన్నాయి. సర్కారుకు ఇష్టంలేని ఏ చిన్న పనిచేసినా అదేదో దేశద్రోహం అన్నట్లు ఈ  కేంద్రాలకు తరలిస్తున్నారని ఇక్కడి ముస్లింలు లబోదిబోమంటున్నట్లు వార్తలందుతున్నాయి.  చాలా  కుటుంబాల్లో సడన్​గా ఎవరో  మిస్సవుతారు. వాళ్ల కోసం అయినవాళ్లంతా వెతుకుతారు. వెతికివెతికి వేసారిపోయిన టైమ్ లో వాళ్లను సెంటర్లకు తరలించినట్లు సమాచారం అందుతుంది. ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియని నిస్సహాయ పరిస్థితి.  ‘మా మత విశ్వాసాలను, నమ్మకాలను వదిలేయాలని చైనా ప్రభుత్వం అంటోంది. ఇస్లాంకు సంబంధించిన చిన్న చిన్న ఆచారాలను పాటించినా సర్కార్ ఊరుకోవడం లేదు. డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు’ అంటున్నారు వీగర్ ముస్లింలు. కొన్నేళ్ల కిందట వీగర్ ముస్లిం కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి గల్ఫ్​లోని ఒక ఫ్రెండ్​కి మొబైల్​లో టెక్ట్స్ మెసేజ్ పెట్టిందట. దీనిని కూడా భూతద్దంలో చూసి ఆ అమ్మాయిని అరెస్టు చేశారు. జిన్​జియాంగ్​ ప్రాంతంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటున్నాయన్నారు ముస్లింలు.

వీగర్లపై వీగర్లే గూఢచారులు

‘నీ వేలుతోనే నీ కన్ను పొడిచేస్తా’ అనే తీరులో వీగర్ ముస్లింలతో చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. వీగర్ ముస్లింల కదలికలు, ఎవరేం చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి తమకు అనుకూలంగా ఉండే  కొంతమంది వీగర్లను చైనా ప్రభుత్వం ఏజెంట్లుగా నియమించుకుంటోంది. వీరు తోటి ముస్లింలపై  గూఢచర్యం చేస్తుంటారు. ఎప్పటికప్పుడు  ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంటారు. వీరి గూఢచర్యం ఏ రేంజ్​లో ఉంటుందంటే.. సడెన్​గా ఎవరైనా ముస్లిం సిగరెట్​ తాగడం మానేసినా, ఆల్కహాల్ వదిలేసినా కూడా వెంటనే సర్కార్​కి రిపోర్ట్ చేస్తారు. ‘మతం ఇన్​ఫ్ల్యూయెన్స్​కి లోనైనందువల్లే ఇలా చేశారా!’ అని సర్కార్ అనుమానపడటం, వెంటనే వాళ్లను డిటెన్షన్ సెంటర్లకు తరలించడం చకచకా జరిగిపోతుంటాయని చెప్తున్నారు.

క్యాంపుల్లో చిత్రహింసలు?

ఈ  కేంద్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు కొన్నాళ్లు ఈ శిబిరాల్లో బందీలుగా ఉన్నవాళ్లు. ఎవరిని పడితే వాళ్లను కొట్టడం మామూలు.  అసలు ఎందుకు కొడుతున్నారో, చేసిన తప్పేంటో కూడా చెప్పేవాళ్లు కాదంటున్నారు ఇక్కడి ముస్లింలు. కొంతమందైతే తమను కమ్యూనిస్టు పార్టీ పాటలు పాడాలని బలవంతం చేసేవారని చెప్పారు. చైనాలో ఉన్న బంధువులను చూడటానికి వచ్చిన కజకిస్తానీ యువకుడు ఓర్యాన్ బెక్​ని పోలీసులు వారం రోజులపాటు డిటెన్షన్​ సెంటర్​లో ఉంచారు. ఈ వారం రోజులు నరకం అంటే ఏమిటో తెలిసిందన్నాడు ఆ కజకిస్తాన్ యువకుడు. ‘చేతులకు సంకెళ్లు వేశారు.

కాళ్లు కట్టి పడేశారు. ఓ గుంతలోకి నెట్టేశారు. బకెట్​తో నెత్తి మీద నీళ్లు పోశారు. అరవడం తప్ప నేనేమీ చేయలేకపోయాను’ అన్నాడు ఓర్యాన్ బెక్. చైనాలో విద్వేషం రగల్చడానికి కజకిస్తాన్ నుంచి వచ్చావంటూ దారుణంగా కొట్టారని చెప్పాడు.  శిబిరాల్లో బందీలుగా ఉన్న వీగర్ ముస్లింలలో మేధావులు  కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రచయితలు, కవులు, కళాకారులు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు, జర్నలిస్టులు వంటివారు చాలా మంది ఉన్నారు. చైనా విధానాలకు సంబంధించి  చిన్న పాటి విమర్శ చేసిన ఇల్హామ్ తొహ్ తి అనే ఎకనమిక్స్ ప్రొఫెసర్​పై  టెర్రరిస్టుగా  ముద్రవేసి, 2014 లో ప్రభుత్వం అరెస్టు చేసి, నానా రకాల కేసులు పెట్టింది. ప్రస్తుతం ఆయన యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్నాడు. చైనాలో ఇలాంటి  వీగర్ ముస్లింలు ఎంతోమంది ఉన్నారు.

అమెరికన్ ఆఫీసర్ నిలదీసింది

యునైటెడ్ నేషన్స్ వేదికగా పాకిస్తాన్​కి అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. ఇండియాలోని ముస్లింలపై దారుణాలు పెరిగాయని పదేపదే ఆరోపణలు చేసే పాకిస్తాన్… చైనాలోని వీగర్ ముస్లింలపై జరుగుతున్న దారుణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని అమెరికా పెద్దాఫీసర్​ను  ఒకరు సూటిగా ప్రశ్నించారు. ‘మానవ హక్కులు చైనా ముస్లింలకు వర్తించవా?’ అంటూ పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణిని ఎండగట్టారు. ప్రపంచంలోని ముస్లింలందరికీ కస్టోడియన్​గా తనకు తాను భావించే పాకిస్తాన్.. చైనాలో కొన్నేళ్లుగా అక్కడి ముస్లింల పరిస్థితులపై సోయి లేకుండా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇండియాను ఇరుకున పెట్టాలన్న కుతంత్రమే తప్ప పాకిస్తాన్​కి ముస్లింల పట్ల, వారి సమస్యల పట్ల నిజాయితీ లేదని ఆరోపించారు.

చైనా వదిలివెళ్లడానికీ ఒప్పుకోవట్లేదు

చైనా ప్రభుత్వం పెట్టే బాధలు తట్టుకోలేక వేరే దేశాలకు వెళ్లడానికి వీగర్ ముస్లింలు ప్రయత్నించినా వారికి పర్మిషన్ దొరకడం లేదు. వయసు మీద పడ్డ తల్లిదండ్రులు చాలా రోజుల నుంచి కజకిస్తాన్ వెళ్లిపోవాలనుకుంటున్నారని నర్ బులత్ తుర్ సుంజన్ ఉలూ అనే యువకుడు చెప్పాడు. పాస్ పోర్టులు తీసుకోవడంతో కజకిస్తాన్ వెళ్లలేకపోతున్నారని బాధగా  చెప్పాడు. బెక్ మూరత్ ఉలూది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఆయనకు చైనాలో చుట్టాలున్నారు. తనతో ఫోన్​లో మాట్లాడటానికి సైతం వాళ్లు  భయపడుతున్నారని చెప్పాడు బెక్ మూరత్ ఉలూ. ‘మాట్లాడటం కాదు కదా కనీసం మెసేజ్  పెట్టాలన్నా వణికిపోతున్నారు’ అని బాధపడ్డాడు. కజకిస్తాన్​లో ఉన్న  తండ్రితో మాట్లాడినందుకు చైనాలో ఉన్న తన బావమరిదిని పోలీసులు అరెస్టు చేసి క్యాంప్​కి పంపారని లబోదిబోమన్నాడు. ఇలా ఈ  కేంద్రాలకు తరలించిన వ్యక్తులకు ఏ హక్కులూ ఉండవు. లాయర్లను పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ పేర్కొంది.

లోపలికి పోనివ్వరు

జిన్ జియాంగ్​లోని డిటెన్షన్​ కేంద్రాలున్న ప్రాంతాల దరిదాపులకు వెళ్లడానికి ఎవరికీ పర్మిషన్ దొరకదు. విదేశాల నుంచి వచ్చే మానవ హక్కుల కార్యకర్తలనైనా అడ్డుకుంటారు. రిపేర్ చేస్తున్నామంటూ రోడ్లను మూసేస్తారు. ఆ ప్రాంతాలకు  వెళ్లడానికి అడుగడుగునా అవరోధాలే ఎదురవుతాయి. ప్రతి డిటెన్షన్​ సెంటర్​ చుట్టూ పెద్ద ఎత్తున పోలీస్​ పహారా ఉంటుంది. పోలీసులతో పాటు నిఘా టవర్లు కూడా ఉంటాయి.

ఎందుకీ అరెస్టులు, క్యాంపులు?

వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానికి కొన్ని భయాలున్నట్లు కనిపిస్తోంది. మతం పేరిట,  ఆచార వ్యవహారాల పేరిట రాబోయే రోజుల్లో వీరంతా టెర్రరిస్టులుగా మారతారన్న భయం చైనా సర్కార్​కి పట్టుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో దేశానికి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలున్నాయని చైనా సర్కార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ఒక్క మాటలో చెప్పాలంటే వీగర్ ముస్లింలను ఓ టెర్రరిస్టు గ్రూపు కింద చైనా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జిన్ జియాంగ్  ప్రాంతంపై అంతా గట్టి నిఘా పెట్టింది. కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న చైనా.. దేశంలో సమైక్యతకు టాప్ ప్రయారిటీ ఇస్తోంది. ప్రభుత్వం పట్ల చిన్నపాటి విమర్శను కూడా సహించదు. ‘వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్’ పేరుతో  వీగర్ ముస్లింలను  క్యాంపుల్లో  ఉంచడాన్ని  చైనా సమర్థించుకుంటోంది. ఇప్పటికైనా మిగతా దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వీగర్ ముస్లింలు కోరుతున్నారు.

అమెరికాతో గొడవ మొదలు

వీగర్ల అంశం లేటెస్ట్ గా అమెరికా, చైనాల మధ్య గొడవకు దారితీసింది. వీగర్ల అణచివేతతో సంబంధమున్న చైనా అధికారులపై వీసా ఆంక్షలను అమలు చేస్తున్నట్లు అమెరికా తెగేసి చెప్పింది. అధికారులతోపాటు చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పై కూడా వీసా ఆంక్షలు అమలు చేస్తామని అమెరికా హెచ్చరించింది. అంతకుముందు  చైనాకు చెందిన 28 వాణిజ్య సంస్థలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన సంగతి తెలిసిందే.

ఇతరులపైనా వేధింపులు

వీగర్లను శిబిరాల్లో నిర్బంధించి వారి పట్ల చైనా అధికారులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. శిబిరాల్లో ఉన్న వారిని విపరీతంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. వీగర్లతో పాటు కజక్ లు, ఇతర ముస్లిం మైనారిటీలపై దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ముస్లింల కదలికలపై  మోడ్రన్ టెక్నాలజీ సాయంతో నిఘా పెట్టారన్నారు.

తోసిపుచ్చిన చైనా

శిబిరాల్లో ఉన్న ముస్లింలను హింసిస్తున్నారంటూ అమెరికా చేసిన ఆరోపణలను చైనా ప్రభుత్వం తోసిపుచ్చింది. వీగర్ ముస్లింల ఇష్యూను అడ్డం పెట్టుకుని తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా పేర్కొంది. ‘వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ల ’ లో అనేక వృత్తులకు సంబంధించి వీగర్ ముస్లింలకు తాము ట్రైనింగ్ ఇస్తున్నట్లు చైనా ప్రభుత్వం పేర్కొంది.  ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి  ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు.వీగర్ ముస్లింలకు సంబంధించి ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అనేదే జరగలేదని పేర్కొంది. అమెరికా ఆరోపణలన్నీ అవాస్తవాలేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు.

కొందరు తప్పించుకున్నారు

తరీమ్…జిన్ జియాంగ్ ప్రాంతానికి ఓ పెద్దాయన. ఫ్రూట్ బిజినెస్ లో సెటిలైన ఈ వీగర్ ముస్లింకు 2016 లో పోలీసు అధికారుల నుంచి సడెన్  గా ఫోన్ కాల్ వచ్చింది. పోలీసు హెడ్ క్వార్టర్స్ కు వచ్చి కలవాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. పోలీసులు మాట్లాడిన తీరు వినగానే తాను డేంజర్ జోన్ లో చిక్కుకున్నానన్న సంగతి తరీమ్ కు తెలిసిపోయింది. అనారోగ్యం సాకు చెప్పి  పోలీసు అధికారులను కలవకుండా తప్పించుకున్నాడు. మెల్లగా ఎయిర్ పోర్టుకు వెళ్లి  టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కు వెళ్లే టికెట్ తీసుకున్నాడు. విమానం రాగానే ఎక్కి ‘హమ్మయ్య’ అనుకున్నాడు.

క్యాంప్ లో తరీమ్ అక్క

తరీమ్ అయితే చైనా నుంచి పారిపోయి ఇస్తాంబుల్ లో సెటిలయ్యాడు కానీ వాళ్ల ఫ్యామిలీ మాత్రం జిన్ జియాంగ్ లోనే ఉండిపోయింది. ఆ తరువాత తరీమ్ అక్క జొహ్రాను పోలీసులు క్యాంప్ కు తరలించారు. ఎందుకు తరలించారో కారణం కూడా చెప్పలేదు.జొహ్రాతో పాటు దాదాపు మూడు వేల మంది ఈ శిబిరంలో ఉన్నారు. రోజులు, నెలలు, ఏళ్లు గడిచాయి. కానీ శిబిరం నుంచి జొహ్రా విడుదల కాలేదు. ఇక లాభం లేదనుకుని అక్కయ్యను  చూడటానికి  టర్కీ  నుంచి చైనాకు వచ్చాడు తరీమ్. రెండు రోజుల పాటు ఎదురు చూస్తే కానీ,  జొహ్రా ఉన్న శిబిరం దగ్గరకు వెళ్లడానికి తరీమ్ కు పర్మిషన్ దొరకలేదు. సీన్ కట్ చేస్తే ….వెయిటింగ్ హాల్ లో తరీమ్ చెల్లెలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కాసేపటి తరువాత భయపడుతూ జొహ్రా అక్కడికి వచ్చింది. ముఖంలో నీరసం…ఏదో జరగబోతోందన్న భయం. కన్నీళ్లు తుడుచుకుంటూ తరీమ్ తో మంచీ చెడూ మాట్లాడింది జొహ్రా. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ఓ లేడీ సెక్యూరిటీ గార్డు అక్కడే పచార్లు చేయడం మొదలెట్టింది.  పట్టుమని పదినిమిషాలు గడిచాయో లేదో ‘టైమ్ అయిపోయిందంటూ ’ సెక్యూరిటీ గార్డులు వచ్చారు. జొహ్రా ను లోపలికి తీసుకువెళ్లిపోయారు. తరీమ్ అక్కడి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వచ్చి ఇస్తాంబుల్ చేరుకున్నాడు.

నరకం చూపిస్తున్న  సెక్యూరిటీ సిబ్బంది

చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతంలో  వీగర్ ముస్లింలను హింసిస్తున్న మాట వాస్తవమేనని ఇస్తాంబుల్ వచ్చాక తరీమ్ చెప్పాడు. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ల పేరుతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాల్లో వీగర్లకు చైనా అధికారులు నరకం చూపిస్తున్నారన్నారు.  జొహ్రా తో మరికాసేపు మాట్లాడితే  శిబిరాల్లో హింసకు సంబంధించి ఇంకొన్ని వివరాలు తెలిసేవన్నాడు. జొహ్రా ను  ఎప్పుడు క్యాంపు నుంచి విడుదల చేస్తారో తెలియడం లేదన్నాడు.

మా వాళ్లు ఎలా ఉన్నారో ?

జిన్ జియాంగ్ నుంచి పారిపోయి వచ్చి ఇస్తాంబుల్ లో సెటిలైన  38 ఏళ్ల బిల్కీస్ ది ఒక దయనీయ గాథ. తన తల్లిదండ్రులను, భర్తను, పాపను  చైనా అధికారులు 2017 ఏప్రిల్ లో  క్యాంప్ కు  తరలించినట్లు బిల్కీస్ చెప్పారు. వాళ్లెలా ఉన్నారో…అసలు ఉన్నారో లేదో కూడా  తెలియడం లేదని ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ బిల్కీస్ చెప్పారు. శిబిరాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.