దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్: గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 చట్టాల అమలు

దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్: గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 చట్టాల అమలు
  • దేశంలోనే తొలిసారి తమిళనాడు సర్కార్ గెజిట్ నోటిఫికేషన్
  • బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు
  • గవర్నర్ ఆమోదం పొందినట్టుగానే భావించాలని తీర్పు 
  • కోర్టు తీర్పు కాపీ పబ్లిష్ అయిన వెంటనే గెజిట్ జారీ చేసిన సర్కార్

చెన్నై: గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 బిల్లులను చట్టాలుగా అమలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సంచలన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం పొందని బిల్లును చట్టంగా అమలు చేస్తూ గెజిట్ జారీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. తమిళనాడులోని సీఎం ఎంకే స్టాలిన్ సర్కారు పంపిన బిల్లులను సుదీర్ఘకాలంపాటు గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్ లో పెట్టడాన్ని తప్పు పడుతూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించగా.. ఆ తీర్పు కాపీ శుక్రవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పబ్లిష్ అయింది. 

దీంతో దేశ లెజిస్లేచర్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని కొత్త సంప్రదాయానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులు పబ్లిష్ అయిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఆయా చట్టాలు అమలులోకి వచ్చాయని పేర్కొంటూ గెజిట్ విడుదల చేసింది. ‘తమిళనాడు గవర్నమెంట్ గెజిట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ ట్రార్డినరీ’ పేరుతో రాష్ట్ర న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆయా బిల్లుల పూర్వాపరాలను పేర్కొన్నారు. బిల్లులను అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించడం, గవర్నర్ తిరస్కరించి, రాష్ట్రపతికి పంపడం, ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమగ్రంగా వివరించారు. 

ఇదీ వివాదం..

రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం.. సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు గవర్నర్ ఆమోదించిన తర్వాత చట్టంగా మారుతుంది. అయితే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా పున:పరిశీలించాలని తిప్పి పంపవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం కూడా పంపవచ్చు. అయితే, అదే బిల్లును అసెంబ్లీ రెండోసారి పాస్ చేసి పంపితే మాత్రం గవర్నర్ తప్పనిసరిగా దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. హైకోర్టు లేదా కేంద్రానికి సంబంధించిన అంశాలు ప్రభావితమయ్యే సందర్భాల్లో మాత్రమే సంబంధిత బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. కానీ తమిళనాడు గవర్నర్ రెండోసారి అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించకుండా, రాష్ట్రపతికి పంపుతూ తప్పుగా నిర్ణయం తీసుకోవడంతో వివాదానికి దారితీసింది.