కరీంనగర్, వెలుగు: నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు లీడర్లు లోక్సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మొన్న అసెంబ్లీ మెట్లెక్కలేకపోయినా ఈ సారి పార్లమెంట్లో అయినా అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఏమాత్రం కుంగిపోకుండా మరో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోకి వచ్చే కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్ సభ స్థానాలతోపాటు రాష్ట్రంలోని ఇతర స్థానాల్లోనూ ఉండడం విశేషం. ఓడిపోయినోళ్లేగాక సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్ కూడా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు.
ఇలాంటివాళ్లు 10 మందికి పైనే..
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో నిలిచారు. నిజామాబాద్ లోక్ సభ స్థానంలో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే. కోరుట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఇదే నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నిజామాబాద్రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్..లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అలాగే ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణకుమార్ చేతిలో ఓడిపోయిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలైన ఈటల రాజేందర్ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అరూరి రమేశ్.. వరంగల్ బీజేపీ అభ్యర్థిగా తలపడుతున్నారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన రఘునందన్ రావు..అదే పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. పటాన్ చెరు అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి అపజయం పొందిన నీలం మధు ముదిరాజ్..ఈ సారి మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇటీవల బీఆర్ఎస్ లో చేరారు. ఈయన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎమ్మెల్యేలుగా ఓడినా.. ఎంపీలుగా గెలిచినోళ్లు..
రాష్ట్రంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన పలువురు నేతలు..ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలుపొందారు. ఇలా గెలవడం కూడా కొందరు నేతలకు కలిసొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి 2018లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన తర్వాత.. 2019లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆయన టీపీసీసీ అధ్యక్షుడు కావడం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠమెక్కడం తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచాక ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగింది.
సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాక రాష్ట్రంలో ఆ పార్టీకి ఊపు తీసుకొచ్చి.. ఓ సందర్భంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలిపారు. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా 2018 ఎన్నికల్లో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి..తిరిగి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాతే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. రెండోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సోయం బాబురావు, వెంకటేశ్ నేతకాని, నామా నాగేశ్వర్‌రావు కూడా 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందారు.