- కోత పెట్టిన ఆయిల్ ఆఫీసర్ల వాహనాలకు..
- 4 వీలర్ వాహనాలకూ ఫ్యూయల్ సరిపోతలేదంటున్న ఎస్‌హెచ్‌వోలు
- స్టేషన్ మెయింటనెన్స్ బిల్లులు పెండింగ్‌లోనే..
కరీంనగర్ క్రైం, వెలుగు: పోలీసుల పెట్రోలింగ్ బండ్లకు ఫ్యూయల్ కోత పెట్టిన్రు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఏర్పాటు చేసి నెలనెలా 30 లీటర్లు పెట్రోల్ఇచ్చేది. దీనిలో 10లీటర్లు కోత పెడుతుండడంతో బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కోత పెట్టిన పెట్రోల్ ఖర్చును ఆఫీసర్ల తమ వాహనాల్లో డీజిల్ కోసం వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టేషన్లలోని ఇన్నోవాలు, బొలేరోలకు కూడా ప్రభుత్వం నెలకు 80 లీటర్ల డీజిల్ వరకే టోకెన్స్ ఇస్తోంది. కానీ ఒక్కో వాహనానికి నెలకు 200 లీటర్ల వరకు అవసరమవుతోందని, మిగతా ఫ్యూయల్తామే పోయించుకోవాల్సి వస్తోందని ఎస్‌హెచ్‌వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టేషన్ల మెయింటనెన్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఈ ఏడాది ప్రారంభం నుంచి రావడం లేదని తెలిసింది. దీంతో పెట్రోల్ బంకులు, స్టేషనరీల్లో ఉద్దెర పెట్టాల్సి వస్తోందని, లేదంటే తామే జేబులో నుంచి ఇవ్వాల్సి వస్తోందని ఎస్సైలు, సీఐలు వాపోతున్నారు.
పెట్రోలింగ్‌కు ఇబ్బందే..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖకు ప్రభుత్వం కొత్తగా ఇన్నోవాలు, బొలేరోలు, బైక్‌లు ఇచ్చింది. 100 నంబర్‌కు కంప్లైంట్ వచ్చినా, ఎక్కడైనా గొడవ జరుగుతుందని తెలిసినా మొదట చేరుకునేది బ్లూకోల్ట్స్ సిబ్బందే. వీరు నిరంతరం గస్తీ తిరగాల్సి ఉంటుంది. అందుకే వీరి బైక్‌లకు నెలకు 30 లీటర్ల చొప్పున పెట్రోల్ ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అయితే పలువురు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో బ్లూకోల్ట్స్ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వీరికి కేటాయించిన పెట్రోల్ కోటాలో 10 లీటర్ల చొప్పున అధికారులు తమ వాహనాల్లో వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మిగిలిన 20 లీటర్లతో నెలంతా తిరగడం ఇబ్బందవుతోందని, మరో 10 లీటర్ల వరకు తామే సొంతంగా పోయించుకోవాల్సి వస్తోందని బ్లూకోల్ట్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరికి బదులు ఒక్కరే..
గతంలో ఒక్కో బైక్‌పై బ్లూకోల్ట్ సిబ్బంది ఇద్దరు డ్యూటీ చేసేవారు. అయితే కమిషనరేట్ పరిధిలో మూడు షిఫ్టులకు సరిపోనూ సిబ్బంది లేకపోవడంతో బైక్‌పై ఒక్కరే తిరగాల్సి వస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో దొంగతనాలు, హత్యలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కరే విధులు నిర్వహించడం ప్రమాదకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్లూకోల్ట్ సిబ్బంది వద్ద ఆత్మరక్షణ కోసం వెపన్ మాట అటుంచితే కనీసం లాఠీ కూడా ఉండడం లేదు. నేరాలకు పాల్పడే వారి వద్ద ఆయుధాలుంటే ఒక్కరే వారిని ఎలా నిలువరించగలరనే ప్రశ్న తలెత్తుతోంది. బ్లూకోల్ట్ షిఫ్ట్ డ్యూటీ అయిపోయాక ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వెంటనే డ్యూటీలు వేస్తున్నారని కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.