ప్రతి మూడు సెకండ్లకు ఒక ఆత్మహత్యాయత్నం

ప్రతి మూడు సెకండ్లకు ఒక ఆత్మహత్యాయత్నం

గేమ్​ఆడుకోవడానికి ఫోన్​అడిగితే ఇవ్వలేదని 8వ తరగతి స్టూడెంట్​ఇంట్లో ప్రాణం తీసుకున్నాడు. తెలిసినవారు డబ్బులు తీసుకొని మోసం చేశారని ఓ ఇంటిపెద్ద ఉరేసుకున్నాడు. ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని ఇద్దరు మైనర్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా.. వివిధ కారణాలతో నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అయినా ప్రభుత్వాలు, పౌర సమాజం దీన్నో సమస్యగా చూడటం లేదు. కానీ ఆత్మహత్యలను అంత తేలిగ్గా తీసి పారేయడానికి లేదు. వీటి సంఖ్య ఇంకా పెరగక ముందే ఆపాల్సిన అవసరం ఉన్నది.

నిమిషానికో ప్రాణం పోతున్నది

ప్రపంచ ఆరోగ్యం సంస్థ(డబ్ల్యూహెచ్ వో) లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పది లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రతి నిమిషానికో ప్రాణం పోతున్నట్టు లెక్క. ప్రతి రోజు దాదాపు 3000 బలవన్మరణాలు నమోదవుతున్నాయి. ప్రతి మూడు సెకండ్లకు ఒక సూసైడ్​ అటెంప్ట్​జరుగుతున్నది. చాలా దేశాల్లో15 ఏండ్ల నుంచి 24 ఏండ్ల వయసు గల వారి మరణాలకు గల మొదటి మూడు కారణాల్లో ఆత్మహత్య ఒకటిగా కనిపిస్తున్నది. అందుకే గత అయిదు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల రేటు ఏకంగా 60 శాతం పెరిగింది.

ప్రతి ఆత్మహత్య కంటే ముందు పదుల సార్లు ఆత్మహత్య యత్నాలు ఉంటున్నాయి. నేషనల్​క్రైమ్​రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2021లో ఇండియాలో1,60,000 ఆత్మహత్యలు జరిగాయి. ప్రత్యేకించి విద్యార్థుల సూసైడ్స్ బాగా పెరిగాయి. 2020లో 12,526 విద్యార్థి ఆత్మహత్యలు నమోదవగా 2021లో వాటి సంఖ్య13,089కి పెరిగింది. ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషించి, నివారణ చర్యలు తీసుకోనన్ని రోజులు ఆత్మహత్యల సంఖ్య పెరుగుదలను ఆపే ఆస్కారం ఉండదు. 

రిస్క్​ఫ్యాక్టర్లు..

ఆత్మహత్యకు ఉసిగొల్పే కారణాలను గుర్తిస్తే, వాటిని అర్థం చేసుకొని చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం, నిరాశ, శారీరక ఆరోగ్యపరమైన అంశాలు, జెనెటిక్​ఇష్యూస్, ఇంట్లో కుటుంబంతో మంచి సంబంధాలు లేకపోవడం, గొడవలు, ఒంటరితనం,  సొసైటీ పరంగా, ఆత్మీయుల పరంగా సరైన చేయూత దొరక్కపోవడం, కుటుంబంలో గతంలో ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడిన చరిత్ర ఉండటం లాంటివి ఆత్మహత్యల రిస్క్​పెంచే ఆస్కారం ఉంటుంది. రిలేషన్​షిప్​బ్రేకప్, ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలిక బాధలు, అనారోగ్యం లాంటి ఇబ్బందులను గుర్తించకపోవడం, గుర్తించినా వాటిని సరిగా డీల్​చేయలేని పరిస్థితుల్లో వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఆత్మహత్యకు, మానసిక రుగ్మతలకు గల లింక్​ను సంపన్న దేశాల్లో గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. మన దగ్గరా అలాంటి ప్రయత్నాలు జరగడం అవశ్యం. 

సూసైడ్స్​కు కారణాలు

ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయనేదానిపై ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు వచ్చాయి. వ్యక్తిగతంగా, సామాజికంగా ఆయా పరిస్థితులు వ్యక్తులను మరణం వైపు నెట్టుతుంటాయి. దాన్ని అధిగమించే క్రమంలో బలహీనతల వల్లే ఆత్మహత్యలు నమోదవుతుంటాయి. మానసిక రుగ్మతలను, ఒత్తిడులను ముందుగా గుర్తించి తగిన చికిత్స పొందలేకపోవడం, అనారోగ్యం, నిరాశా నిస్పృహలు, సమస్యలను ఎదుర్కోలేకపోవడం, స్కూల్​ సంబంధిత సమస్యలు, బ్రేకప్/ సంబంధాలు తెగిపోవడం, వేర్పాటు, విడాకులు, తిరస్కరణ, భౌతిక/లైంగిక వేధింపులు, బెదిరింపులు, చుట్టూ విధ్వంసకర, అనారోగ్యకర పరిసరాలు ఉండటం, కుటుంబ గొడవలు వంటి సమస్యల నుంచి బయటపడలేని వ్యక్తులు, వాటికి చావే పరిష్కారంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

పరీక్షల్లో ఫెయిల్​అవుతున్నందుకు, కుటుంబ సమస్యల వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తేలింది. ప్రాణం తీసుకోవాలనుకునే వ్యక్తులు అందుకు ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. విషం, పురుగుల మందు తాగడం, ఉరేసుకోవడం, గన్​తో కాల్చుకోవడం, డ్రగ్​ఓవర్​డోస్, రైలు, రోడ్డు ప్రమాదాలు, ఊపిరాడకుండా చేసుకోవడం, నీటిలో దూకడం లాంటి మార్గాల ద్వారా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

నివారణ మార్గాలు

ఆత్మహత్యలను ఆపగలమా? అనే సందేహం రావడం సహజం. వ్యక్తుల స్థితిని బట్టి వారికి చేయూతనివ్వడం, అవగాహన కల్పించడం తదితర చర్యలతో ఆత్మహత్యలను ఆపొచ్చు. సూసైడ్​కు దారి తీసే అంశాలను గుర్తించగలగడం అత్యంత ప్రధాన అంశం. ఒకే విషయంపై దీర్ఘంగా ఆలోచిస్తుండటం, మానసికంగా ఆనందంగా లేకపోవడం, ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం, బలహీనంగా తయారుకావడం, ఎవరితో సరిగా మాట్లాడలేకపోవడం, నేను బతకడం వృథా, నాకే ఎందుకు ఇలా అవుతుంది?, నేను పుట్టి ఉండకూడదు లాంటి మానసిక స్థితిని గుర్తించి, వారితో మంచిగా మాట్లాడుతూ, ‘మీకొచ్చిన సమస్య చాలా చిన్నది’ అని చెప్పి వారికి భరోసా, మనోధైర్యం ఇవ్వడం ద్వారా వారి ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపొచ్చు.

ఇతరులను అర్థం చేసుకోవడం, వారి సమస్యలపై అవగాహన పరచడం ద్వారా ప్రాణం తీసుకోవాలన్న వారి ఆలోచనలను మార్చవచ్చు. మానసికంగా కుంగిపోయిన వారు ఆత్మహత్యల వైపు వెళ్లకుండా, ఇప్పటికే ఒకటి రెండు సార్లు ఆత్మహత్యయత్నాలు చేసి డిప్రెషన్​లో ఉన్న వ్యక్తులను ఆత్మహత్య చేసుకోకుండా ఆపే చికిత్స విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

మెడికేషన్, సైకోథెరపీ లాంటి​చర్యల వల్ల వారికి సరైన కౌన్సెలింగ్​ఇచ్చి మామూలు స్థితిలోకి తీసుకురావొచ్చు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా ఇప్పుడు ప్రధానమేనన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎదుటి వారి మంచి చెడ్డలతో మనకు సంబంధం లేదన్న ధోరణి ఉండటం వల్లే సామాజిక సంబంధాలు దెబ్బతిని ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆ పరిస్థితి మారాలి. పక్కవారి కష్టసుఖాల్లో వీలైనంత పాలుపంచుకోవాలి. ప్రభుత్వాలు కూడా విపరీతంగా పెరుగుతున్న ఆత్మహత్యలను కట్టడి చేసే విషయంలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి. -ఎం.అపర్ణ, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్