తెలంగాణలో రక్తమోడిన రహదారులు.. 10మంది మృతి

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది చనిపోయారు దాదాపు 50 మందికి  గాయాలయ్యాయి. మహబూబ్ నగర్  జిల్లా   జడ్చర్ల మండలం  గంగాపూర్ సమీపంలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  కల్వకుర్తి  రహదారిపై   టిప్పర్ అదుపుతప్పి  ఎదురుగా వస్తున్న.. రెండు బైకులు,  ఒక ట్రాక్టర్ పైకి  దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.  డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే   ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు  అవనిగడ్డకు చెందిన తండ్రీ   కొడుకులు కాగా... మిగతా  ఇద్దరిలో ఒకరు గంగపూర్ కు  చెందిన వారు, మరొకరు  చెన్నంపల్లికి  చెందిన వ్యక్తిగా  పోలీసులు గుర్తించారు. 

వికారాబాద్ జిల్లా కొడంగల్ ట్యూబ్ ఫ్యాక్టరీ దగ్గర హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే హైవేపై రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో యూసుఫ్ గుడాకు చెందిన నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... వివరాలు సేకరిస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్ హైవేపై టవేరా కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 16 మంది ఉన్నట్లు గుర్తించారు.  వీరంతా పని కోసం నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వరంగల్ రూరల్ జిల్లాలో  శాయంపేట మండలం మందారిపేట శివారులో ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయపడ్డారు. వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. గాయపడ్డవారిని పరకాల సివిల్ హాస్పిటల్ కు తరలించారు.