సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్పీఎఫ్​లో .. మాజీ అగ్నివీర్ లకు10% రిజర్వేషన్

 న్యూఢిల్లీ: మాజీ అగ్నివీర్ లకు  సెంట్రల్  ఇండస్ట్రియల్  సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బోర్డర్  సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్  ఫోర్స్ (ఆర్పీఎఫ్) తోపాటు పలు కేంద్ర సాయుధ బలగాల సంస్థలు10 శాతం రిజర్వేషన్  ఇవ్వనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుందని సీఐఎస్ఎఫ్  డైరెక్టర్  జనరల్  నీనా సింగ్  తెలిపారు. 

భవిష్యత్తులో భద్రతా సంస్థలు చేపట్టే కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 10 శాతం మాజీ అగ్నివీర్ లకు రిజర్వు చేస్తాయని ఆమె వెల్లడించారు. ‘‘ఫిజికల్  టెస్టులు, ఏజ్  రిలాక్సేషన్లలో మాజీ అగ్నివీర్ లకు మినహాయింపులు ఉంటాయి. మొదటి సంవత్సరంలో ఐదేండ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది. తదనంతర కాలంలో అది మూడేండ్లకు తగ్గిపోతుంది. 

దీంతో మాజీ అగ్నివీర్ లతో పాటు భద్రతా బలగాలకు లాభం కలుగుతుంది. ఆయా సంస్థలు శిక్షణ పొందిన సిబ్బందిని పొందుతాయి” అని నీనా సింగ్  పేర్కొన్నారు. మాజీ అగ్నివీర్ లకు 10 శాతం రిజర్వేషన్  ఇస్తామని బీఎస్ఎఫ్  డైరెక్టర్  జనరల్  నితిన్  అగర్వాల్  కూడా వెల్లడించారు.