- మధ్యప్రదేశ్‌లో 10 ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశం
- అధిక ఫీజులు, పుస్తకాల రేట్లు పెంచడంపై కేసుల నమోదు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో స్టూడెంట్ల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.64.59 కోట్ల ఫీజులను తిరిగి చెల్లించాలని జబల్పూర్జిల్లాలోని 10 ప్రైవేటు స్కూళ్లను ప్రభుత్వం ఆదేశించింది. గత ఆరేండ్లుగా ఈ స్కూళ్ల మేనేజ్మెంట్లు స్టూడెంట్ల నుంచి అధిక ఫీజులు గుంజినట్టు మధ్యప్రదేశ్ నిజి విద్యాలయ అధినియం–2017 (స్కూళ్ఫీజుల రూల్స్ అమలును పరిశీలించే కమిటీ) తనిఖీల్లో గుర్తించింది.
ఇలా రూల్స్‌కు వ్యతిరేకంగా వసూలు చేసిన రూ.64.59 కోట్లను స్టూడెంట్ల పేరెంట్స్ కు తిరిగి రీఫండ్‌చేయాలని జబల్ పూర్ కలెక్టర్ దీపక్ సక్సేనా, డీఈవో ఘనశ్యామ్ సోని స్కూళ్లను ఆదేశించారు. ఘనశ్యామ్ సోని మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ నిజి విద్యాలయ అధినియం (స్కూల్ఫీజుల రూల్స్‌ను అమలును పర్యవేక్షించే కమిటీ) 2018–19 నుంచి 2024–25 వరకు ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేసిన ట్యూషన్తదితర ఫీజులపై తనిఖీలు నిర్వహించిందని అన్నారు.
విద్యాసంస్థల అకౌంట్ల పరిశీలనలో 10 ప్రైవేటు స్కూళ్లు మొత్తం 81,117 మంది స్టూడెంట్ల నుంచి రూ. 64,58,76,812 మేర అధిక ఫీజులు వసూలు చేసినట్టు కమిటీ గుర్తించిందని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఈ వసూళ్లకు పాల్పడినట్టు తెలిపారు. అలాగే ఫీజులు, పాఠ్యపుస్తకాల ధరలను అక్రమంగా పెంచినందుకు పలు స్కూళ్లమేనేజ్మెంట్లు, పుస్తకాల షాపులపై మే 11 ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశామన్నారు. జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ సక్సేనా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే స్కూల్ మేనేజ్మెంట్లు, పుస్తకాల షాపులు ఎక్కువ ధరలకు అమ్మడంపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కొన్ని స్కూళ్లు పర్మిషన్ తీసుకోకుండా 10 శాతానికి పైగా, మరికొన్ని 15 శాతానికి పైగా ఫీజులు పెంచాయని చెప్పారు.