10 గేయాలు, 21 పేజీల గాంధీ గేయ కథ

10 గేయాలు, 21 పేజీల గాంధీ గేయ కథ

బాల సాహిత్యాన్ని నిరంతరం ప్రోత్సహించే డా।। పత్తిపాక మోహన్ రాసిన గ్రంథాలలో “బాలల తాతా బాపూజీ” ఒకటి. ఇందులో 10 గేయాలు, 21 పేజీల గాంధీ గేయ కథ ఉన్నాయి.

ఈ గేయాలలో గాంధీ – మహాత్ముడు, మనలో ఒకడు, మనుషుల్లో మహర్షి, సబర్మతి మౌని, అస్తమించని సూర్యుడు, భరతజాతికి స్ఫూర్తి ప్రదాత. అతనిది సత్యదీక్ష, ధర్మయుద్ధం, సత్యాగ్రహం, సమతావాదం.

“భూమి మీద నడచినాడు 

మన కాలపు బుద్ధుడు”

ఏదైతే ఆదర్శం అన్నాడో దానిని ఆచరించి చూపాడు. ‘నా జీవితమే నా సందేశం’ అన్నాడు గాంధీ. “పల్లెలు బాగుంటేనే / సంపదలు, సౌభాగ్యం / వృత్తులన్ని సాగితేనే / ఊరంతా ఉత్సవం” అని ప్రకటించాడు.

ఇక గాంధీ గేయకథలో – మనిషిగనే పుట్టి మనీషిగా మారిన, స్వాతంత్ర్యం సాధించి చరితార్థుల చేరిన, జాతిపితగా వెలిగిన గాంధీ జీవిత చరిత్ర ఉంది.

శ్రవణకుమారుని కథ, సత్య హరిశ్చంద్రుని గాథ, గాంధీ పై చెరగని ముద్ర వేయడం, 13 ఏండ్ల ప్రాయంలోనే వివాహం, కస్తూర్బా గాంధీల ఆదర్శ దాంపత్యం, ఇంగ్లండులో బారిష్టర్ చదివి తిరిగి రావడం, బారిష్టరు వృత్తి కొరకు దక్షిణాఫ్రికా వెళ్ళడం, అక్కడి భారతీయుల కడగండ్లను చూసి వారిని సంఘటితం చేసి హక్కుల కోసం పోరాడడం, తెల్లవారితో కూర్చోవద్దని తనని రైలు నుంచి గెంటేయడం, ఆ అవమానం తనలో ఉద్యమాగ్ని రగిలించడం -– ఇవన్నీ ఇందులో ఉన్నాయి.

“సత్యాగ్రహమను మాటకు / పర్యాయం గాంధీ / దక్షిణాఫ్రికా ఖండం। దాని కయ్యె నాంది.”

నల్లజాతి ఉద్యమానికతడే ఒక పతాకమైనాడు. తర్వాత మన దేశానికి వచ్చాడు. దేశమంత కలయ తిరిగి చైతన్యం నింపినాడు.

“దళిత జాతి ఉద్ధరణే । ధర్మంగా తలచినాడు / అంటరాని వారు కాదు / హరిజనులని పిలచినాడు”

స్వదేశీయ భావన, విదేశీ వస్తు బహిష్కరణ, దండియాత్ర, చంపారన్​లో రైతుల కోసం దీక్ష, రోగులకు సేవ, ప్రజా చైతన్యం కోసం పత్రికల స్థాపన, స్వాతంత్ర్య పోరాటం – అన్నీ ఇందులో ఉన్నాయి.

‘‘కోటానుకోట్ల జనులు । తన మార్గం నడువగా । 
స్వాతంత్ర్య కాంక్షతో । దేశమంత రగిలింది” 
ఉద్యమమే గాంధీగా / గాంధీయే ఉద్యమంగ ।
దేశమంత కదిలింది / అడుగు అడుగు కలిపింది”. 
“జాతినంత కలిపినట్టి । జనజాగృత ధీరుడు । 

అహింసతో స్వాతంత్ర్యం । సాధించిన వీరుడు”.

గాంధీ జననం నుంచి మరణం దాకా సాగిన జీవన ప్రస్థానం రేఖామాత్రంగా స్పృశించిన కావ్యమిది. ఇతని కవితలకు తగ్గట్టుగా, గాంధీజీ జీవితంలోని వివిధ ఘట్టాలకు30 పూర్తి పేజీలలో కూరెళ్ళ శ్రీనివాస్ వేసిన బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ బొమ్మలతో ఈ కవితలకు అందం పెరిగింది.

గాంధీజీ చరిత్ర... గేయాలలో హాయిగా పిల్లలు పాడుకునేలా రచించిన రచయితకు అభినందనలు.

(రేపు (14-–11-–2022న) డా।।పత్తిపాక మోహన్ ఢిల్లీలో బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోనున్న సందర్భంగా..)

- ఎ. గజేందర్ రెడ్డి 
9848894086