గవర్నర్ ఆమోదం లేకుండానే.. 10 బిల్లులకు రైట్ రైట్

గవర్నర్ ఆమోదం లేకుండానే.. 10 బిల్లులకు రైట్ రైట్
  • తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం
  • సుప్రీం తీర్పును అమలు చేసిన ప్రభుత్వం
  • భారత రాజ్యాంగ చరిత్రలో ఇదే తొలిసారి

చెన్నయ్: తమిళనాడు ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం విశేషం. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ చర్యలకు ఉపక్రమించింది.  గతంలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకుంటున్నారని ఆరోపిస్తూ.. 2023లో  రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. 

రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలోనూ ఆయన తీరు మార లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది.  దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తీర్పు చెప్పింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని మంగళవారం పేర్కొంది. 

గవర్నర్‌ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి పెట్టడం న్యాయ సమ్మతం కాదని తెలిపింది.  కేసు విచారించిన జస్టిస్‌ జేబీ పర్దీవాలా, జస్టిస్‌ ఆర్‌మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టంచేసింది.  దీంతో ఆ పది బిల్లులను చట్టాలుగా  నోటిఫై చేసింది స్టాలిన్ సర్కారు.