హైదరాబాద్, వెలుగు: పోలీస్ సిబ్బంది నియమావళికి విరుద్ధంగా నిరసన చేపట్టిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందికి ఆ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో యూనిఫారమ్తో నిరసనలో పాల్గొన్న 21 మందికి నోటీసులు పంపినట్లు టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. కొద్దిరోజులుగా కొంతమంది సిబ్బంది బెటాలియన్ ప్రాంగణంతో పాటు బహిరంగ ప్రదేశాలలో అనధికారిక నిరసనలు చేశారని అన్నారు. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించినా వినిపించుకోకుండా పోలీస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.