- హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కంట్రోల్ ఎస్ కంపెనీ
- కొత్త క్యాంపస్ ఏర్పాటుకు హెచ్‌సీఎల్ అంగీకారం
- డ్రోన్ల తయారీకి జేఎస్‌డబ్ల్యూ రూ. 800 కోట్ల పెట్టుబడులు
- దావోస్ వేదికగా రాష్ట్ర సర్కార్ తో ఒప్పందాలు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ఎస్ డేటా సెంటర్స్ కంపెనీ, కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ ముందుకొచ్చాయి. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు రాష్ట్ర సర్కార్‌తో కంట్రోల్ ఎస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఈ ఒప్పందం జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ తో 3,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ధి సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.
హెచ్ సీఎల్ కొత్త సెంటర్..
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. దీంతో దాదాపు 5వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దావోస్ లో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. కొత్త సెంటర్ తో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ తెలిపారు.
రాష్ట్రంలో హెచ్‌సీఎల్ సేవల విస్తరణను సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకున్నదని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో కొత్త సెంటర్ ప్రారంభించాలని ఆహ్వానించారు. స్థానిక యువతకు ఉద్యోగాలు క్పలించడంతో పాటు హైదరాబాద్‌లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్‌సీఎల్ ప్రతినిధులను కోరారు.
ALSO READ : 45 వేల కోట్లతో రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి
ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. కాగా, కొత్త క్యాంపస్ ఏర్పాటుతో హైదరాబాద్ లో హెచ్‌సీఎల్ సెంటర్ల సంఖ్య ఐదుకు చేరనుంది. కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమివ్వనున్నారు. అత్యాధునిక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్లను అందించనున్నారు.
ట్రిలియన్ట్రీ ఉద్యమంలో భాగమవుతాం : సీఎం రేవంత్
ఒక ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని సతత హరితంగా మార్చే ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమం’లో భాగమవుతానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటా నని ప్రతిజ్ఞ చేశారు. ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు దావోస్ లో తెలంగాణ పెవిలియన్ ను సందర్శించి.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి పర్యావరణ ప్రమాణం చేయించా రు.
తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతి అంశంలోనూ నెట్ జీరో విధానాల ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, నేచర్ పాజిటివ్ పిల్లర్ సహ వ్యవస్థాపకురాలు నికోల్ ష్వాబ్, 1t.org నిర్వాహకులు ఫ్లోరియన్ వెర్నాజ్ పాల్గొన్నారు.