
హైదరాబాద్, వెలుగు: రానున్న రోజుల్లో పదివేల మంది పూర్వ విద్యార్థులతో భారీ స్థాయిలో సదస్సు నిర్వహిస్తామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ. ఘంటా చక్రపాణి అన్నారు. శనివారం అంబేద్కర్ వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సామాజిక సాధికారత ఉత్సవాల్లో భాగంగా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్నీ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘంటా చక్రపాణి హాజరయ్యారు.
అంబేద్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని, పూర్వ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో సమాజాభివృద్ధికి పాటు పడుతున్నారని వివరించారు. సింగరేణి సీఎండీ బలరాం మాట్లాడుతూ.. ఆటో నడుపుకునే తనకు అంబేద్కర్యూనివర్సిటీ కొత్త జీవితాన్ని ఇచ్చిందన్నారు. అంబేద్కర్ వర్సిటీ తన జీవితాన్ని మార్చిందని చెప్పారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్సూర్య ధనంజయ్ మాట్లాడుతూ.. ఓ మారుమూల తండా నుంచి వచ్చిన తనను అంబేద్కర్ యూనివర్సిటీ అమ్మలా ఆదరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కట్టా హైమవతి, జీఎస్టీ (ఆంధ్రప్రదేశ్) సెంట్రల్ కమిషనర్ సాధు నరసింహ రెడ్డి, సైబరాబాద్ (శంషాబాద్ ట్రాఫిక్ డివిజన్) ఏసీపీ పరికె నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.