విధుల పట్ల డాక్టర్ల అలసత్వం, ఆసుపత్రి అపరిశుభ్రత వాతావరణం ఓ పదేళ్ల బాలుడి మరణానికి కారణమయ్యాయి. క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్న బాలుడు చికిత్స కోసం ఆసుపత్రికి రాగా.. హాస్పిటల్ బెడ్‌పైనే ఎలుక కాటుకు బలయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో చోటుచేసుకుంది.
వారం రోజుల క్రితం ఓ జంట క్యాన్సర్‌తో పోరాడుతున్న తమ పదేళ్ల కుమారుడిని చికిత్స కోసం రాజస్థాన్‌లోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకొచ్చారు. బాలుడు అక్కడ చికిత్స పొందుతుండగా.. ఈనెల 11న ఎలుక అతన్ని కరిచింది. ఎలుక కరిచిన వెంటనే బాలుడు ఏడవడం మొదలు పెట్టాడు. బిడ్డ ఏడవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతనిపై కప్పి ఉన్న దుప్పటిని తొలగించి చూడగా.. బాలుడి కాలి నుండి రక్తం కారుతున్నట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ప్రథమ చికిత్స చేసి ఎలుక కరిచిన ప్రాంతానికి కట్టు కట్టారు.
ఇది జరిగిన రెండ్రోజుల తరువాత ఎలుక కాటుకు గురైన బాలుడు సెప్టిసిమియా షాక్, అధిక ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ జసుజా ధృవీకరించారు. ఎలుక కాటుకు గురయ్యాక బాలుడిలో అధిక జ్వరం, న్యుమోనియాతో పాటు శరీర అంతర్లీన పరిస్థితి ఏర్పడినట్లు తెలిపారు. సెప్టిసిమియా షాక్ వల్ల ఇన్‌ఫెక్షన్ ఎక్కువ కావడంతో బాలుడు మృతి చెందినట్లు డాక్టర్ జసుజ తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన రాజస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాలుడి మృతికి గల కారణాలను, ఆసుపత్రి పరిశుభ్రతపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు అనుబంధంగా ఉన్న సవాయ్ మాన్ సింగ్ (ఎస్‌ఎంఎస్) మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను జరిగిన ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని వైద్య విద్యాశాఖ కార్యదర్శి అంబరీష్ కుమార్ ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా దవాఖానలో పరిశుభ్రత ప్రమాణాలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్ జాసుజ హామీ ఇచ్చారు.