మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. 4వ తరగతి చదువుతున్న ఇందు అనే చిన్నారి మిస్ అయింది. నిన్న ఉదయం పాప తండ్రి దమ్మైగూడలోని ప్రభుత్వ పాఠశాల వద్ద వదిలిపెట్టి వెళ్లగా.. ఆ తర్వాత నుంచి పాప కన్పించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పాప కోసం గాలిస్తున్నారు.
పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నారు. బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు రక్షణ కరువైందని స్కూల్ సమీపంలో సీసీ కెమెరాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.