10 ఏండ్ల ఆర్థిక నిర్వాకం

10 ఏండ్ల ఆర్థిక నిర్వాకం

తెలంగాణా ఏర్పడి 10 ఏండ్లు పూర్తి అవుతున్నది. ప్రజలకు సంబంధించిన అనేక విషయాలలో తీవ్రమైన సంక్షోభ పరిస్థితి ఉన్నది.    ప్రజలు నవంబర్ 2023 ఎన్నికలలో తమ సత్తా చూపి ఇటువంటి ధోరణులకు ముగింపు పలికినారు. కాకపోతే, అప్పటి నాయకులు వదిలిపెట్టిన ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. తెలంగాణా ఏర్పడిన నాటి నుంచి వటవృక్షాల మాదిరి పెరిగిన పాలనా లోపాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆర్ధిక నిర్వహణ అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. నిధుల నిర్వహణలో అనేక లోపాలు తెలంగాణ ఏర్పడిన మొదటి నుంచి కనపడుతూనే ఉన్నాయి.

జూన్ 2014లో ఏర్పాటైన ప్రభుత్వం తరుచూ ప్రకటిస్తున్న “రెవెన్యూ మిగులు రాష్ట్రం” వాదనకు విరుద్ధంగా తెలంగాణను “రెవెన్యూ లోటు రాష్ట్రం”గా  కాగ్ నివేదిక ప్రకటించింది. 2018-–19 ఆమోదించిన రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం రెవెన్యూ మిగులు రూ.5,520 కోట్లుగానూ, ఆర్థిక లోటు రూ.29,077 కోట్లుగానూ అంచనా వేసింది. అప్పటి కాగ్ నివేదికతో ద్రవ్యలోటు పై ప్రశ్నలు తలెత్తినాయి.  రూ.29,077 కోట్ల ఆర్థిక లోటుతో ఉన్న బడ్జెట్‌‌లో రుణాలను ప్రభుత్వ రాబడిగా చూపి ‘మిగులు రాష్ట్రం’గా పేర్కొన్న  వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత దుర్మార్గమా అనిపించింది.

మచ్చుకు లేని ఆర్థిక క్రమశిక్షణ

తెలంగాణా ఏర్పడిన నాటి నుంచి ‘ధనిక’ రాష్ట్రంగా అభివర్ణించిన పాలకులు ప్రజాధనం ఇష్టారీతిన ఖర్చు పెట్టడం, పాలనా పద్ధతులు పాటించకపోవడం, అవసరం లేని చోట ఎక్కువగా నిధులు పెట్టి, ప్రాధాన్యతలు సరిగా గుర్తించకపోవటం, సంప్రదింపులు పూర్తిగా మృగ్యం చేయటం వంటివి అలవాటుగా మారి, తెలంగాణ ఆర్థిక నిర్వహణ గందరగోళంగా తయారు అయ్యింది. నిధుల లేమి, లోపించిన చిత్తశుద్ధి, సమన్వయ లేమి, అవగాహన లోపం, వివక్ష, కొరవడిన సానుభూతి, చట్టాలలో లొసుగులు వంటి కారణాల వల్ల ఆర్థిక క్రమశిక్షణకు ఉద్దేశించిన చట్టాలు, ప్రభుత్వ విధి విధానాలు, ఉపయోగం లేకుండా ‘ఉత్సవ విగ్రహ’ పాత్రకు మిగిలిపోయినాయి. అనేక రంగాలకు కేటాయింపులు ఎన్ని ఉన్నా, నిధులు సరైన స్థాయిలో, సరైన రీతిలో సరిగ్గా ఖర్చు కాకపోవడంతో సమస్యలు ఇంకా జటిలం అయినయి.

రూపాయి రాక–పోక

2014--–15 లో రాష్ట్ర పన్నులు రూ.29,288 కోట్లు కాగా 2020–--21 నాటికి అవి రూ.66,650.37 కోట్లకు చేరుకున్నవి. 2020--–21లో రూ.76,196 కోట్ల అంచనాకు దగ్గరగానే పన్నులు వసూలు అయినాయి. ప్రభుత్వం 2021--–22లో రూ.92,910 కోట్లు, 2022–--23లో రూ.1,08,212 కోట్లు వస్తాయని ఆశ పెట్టుకుంది. ఈ పన్నుల వల్ల ప్రజల మీద పడే భారం గురించి ఆలోచించలేదు.   ప్రభుత్వ రాబడిలో జీతభత్యాలకు 2014-–-15లో రూ.17 వేల కోట్లు ఖర్చు కాగా 2022--–23 నాటికి రూ.55  వేల కోట్లకు చేరింది. రాబడిలో ఇది 38 శాతం ఉంటుంది. అప్పుల మీద, వడ్డీల మీద చెల్లింపులు ఇంకొక 34 శాతం ఉండవచ్చు. దాదాపు 69 శాతం స్థిర చెల్లింపులకుపోగా, మిగిలింది 31 శాతం మాత్రమే సంక్షేమానికి, ఆర్థిక రంగానికి పెట్టే అవకాశం మిగిలింది.

పెరిగిన రెవెన్యూ రాబడి

రెవిన్యూ రాబడి 2014--–15 నుంచి 2021–-- 22 మధ్య 115 శాతం పెరిగింది. 6 రకాల రాబడులలో అన్నీ పెరిగాయి.  ఎక్సైజ్ రాబడి 29 శాతం నుంచి 33శాతానికి పెరిగింది. 144 శాతం పెరుగుదల  జీఎస్టీద్వారా వచ్చే రాబడి కూడా 2018--–19 లో రూ.28,786 కోట్ల నుంచి 2021–--22 నాటికి రూ.34,489 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ రాబడులు అన్నీ కూడా ఒక ఉచ్ఛ దశకు చేరుకున్నాయి.  ఇప్పటికే మద్యం వినియోగం పెరగడం వల్ల ప్రభుత్వ రాబడి ఈ రూపేణా పెరిగింది. కానీ, కుటుంబాలు చితికిపోతున్నాయి. 

కార్పొరేషన్ల పేర అప్పులు

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే నాటికి ప్రభుత్వ అప్పులు రూ.69,479.49 కోట్లు ఉండగా, తరువాతి కాలంలో అవి గణనీయంగా పెరిగినాయి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6 లక్షల కోట్లు దాటినాయి. ప్రభుత్వం నేరుగా తీసుకుంటే FRBM నిబంధనలు అడ్డు వస్తాయని మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులకు నిధుల కోసం  ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ల నుంచి అప్పులు చేసింది. మొత్తం 17 ఎస్​పీవీలు, సంస్థల పేరు మీద ₹1,85,029 కోట్ల బడ్జెట్ యేతర రుణాల సేకరణ చేసింది గత ప్రభుత్వం.

అప్పులకు సమాన సంపద సృష్టించలేదు

ఈ అప్పులు తీర్చడానికి అప్పులు, అప్పుల వడ్డీ కట్టటానికి అప్పులు, చివరికి అధిక పన్నులుగా మారుతాయి. లేదా, ఆయా వస్తువులు, సేవల ఖరీదు ధరగా కూడా మారవచ్చు. అధికారంలో ఉండడానికి, అధికారం నిలుపుకోవడానికి తెలంగాణలో గత అధికార పార్టీ చేసిన అప్పులు ప్రజల నెత్తి మీద భారం కనీసం ఒక దశాబ్దం వరకు ఉండవచ్చు. ఈ అప్పులు కూడా అవసరమున్న ‘సామూహిక సంపద’ సృష్టికి కాకుండా మృగ్యమైన పనుల మీద ఖర్చు చేసింది ఆ ప్రభుత్వం. వీటిని అభివృద్ధి పథకాలుగా, ప్రాజెక్టుల మాదిరి చూపించారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది.

ఆరోగ్యరంగానికి హీనంగా కేటాయింపులు 

మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కాగ్ రాష్ట్ర ఆర్థిక ఆడిట్ నివేదిక ప్రకారం, తెలంగాణ ఆరోగ్య రంగ వ్యయంలో వెనుకబడి ఉంది. మొత్తం వ్యయంలో కేవలం 4% మాత్రమే వైద్యం మీద ఖర్చయింది. 2017-–18లో వివిధ రాష్ట్రాలలో ఆరోగ్యం మీద కేటాయింపు బడ్జెటులో 5.09% ఉండగా, తెలంగాణలో 4.59% మాత్రమే కేటాయించారు. 2021–-22లో రాష్ట్రాలు ఆరోగ్యానికి 6.2% కేటాయించగా తెలంగాణ కేవలం 4.19% కేటాయించింది. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు పెంచితే, తెలంగాణా ప్రభుత్వం తగ్గించింది. 

ప్రాధాన్యాలు తప్పిన పాలన

స్థూలంగా చూస్తే, నీళ్ళు, నిధులు, నియామకాలు లక్ష్యంగా ఉద్యమం చేసి తెలంగాణా రాష్ట్రం తెచ్చుకుంటే, పదేండ్లలో గత పాలకులు తమ స్వార్థ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ,  ప్రజల గోసను నిర్లక్ష్యం చేస్తూ, అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అభివృద్ధి ప్రాధాన్యతలను మారుస్తూ, ప్రజల మీద విపరీతమైన భారం మిగిల్చారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోకుండా నిర్లజ్జగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారు. అవినీతి విపరీతంగా పెరిగింది. 

అప్పుల్లో కూరుకుపోయింది

తెలంగాణా రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది. అనేక పథకాలకు నిధుల లేమి స్పష్టంగా కనపడుతున్నది. పైకి ఆర్థిక నిర్వహణ, చెల్లింపులు బాగానే ఉన్నట్లు కనపడుతున్నా తెర వెనుక ఏమి జరుగుతున్నదీ తెలియలేదు. పాలనలో పారదర్శకత కొరవడింది. తెలంగాణా ప్రభుత్వం నిర్దిష్ట గణాంకాలు, లెక్కలు ప్రజలకు తెలియనివ్వలేదు. శాసన సభలో ప్రతి ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ పుస్తకాలలో విధిగా చూపెట్టే ఆర్థిక సమాచారం కూడా తగ్గించారు. మార్కెట్లో రుణాలు తీసుకుని ప్రతి రుణానికి కడుతున్న వడ్డీ ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు. ఋణం తీసుకుని పెట్టుబడి కింద వ్యయం చేస్తే భవిష్యత్తులో రాబడి రావచ్చు. లేదా ఖర్చు తగ్గవచ్చు. అయితే అప్పులు చేసి, దేని మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు?  నిధుల ఖర్చు పారదర్శకంగా లేకపోవడంతో అవినీతి పెరిగిపోయింది. పెట్టుబడి పెట్టిన భారీ ప్రాజెక్టులలో నిర్వహణ ఖర్చుల మీద దృష్టి లేక ఫలితాలు దక్కలేదు.


మద్యం రాబడి..విద్య, వైద్యాన్ని  కొల్లగొట్టింది

గత పదేండ్లలో కుటుంబాలను పీల్చి పిప్పి చేసే మద్యం రాబడి దాదాపు రూ.40 వేల కోట్లకు చేరింది. ఇంకొక వైపు, తెలంగాణలో నిత్యావసర సేవల కొరత వల్ల అనేక ప్రతికూల పరిణామాలు చూస్తున్నాం. కొరవడిన వైద్య సేవలు, విద్య వల్ల ఆర్థిక అవకాశాలు అంది పుచ్చుకునే అవకాశం తెలంగాణ యువతకు లేకుండాపోయింది. ఈ పరిణామాలు సమాజంలో అశాంతి, నేరాల పెరుగుదలకు దోహదం అయ్యాయి. 

- డా. దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​