కంపెనీ ఇచ్చిన క్రిస్మస్ పార్టీ.. 100 మంది ఉద్యోగులకు అస్వస్థత

ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్ అనుబంధ సంస్థకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులు ఈ నెలలో కంపెనీ క్రిస్మస్ పార్టీ తర్వాత అస్వస్థతకు గురయ్యారని ఓ నివేదిక తెలిపింది. వారు తీసుకున్న ఆహారం వల్లే వారంతా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారని యూరోపియన్ ఏరోనాటిక్స్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. కంపెనీ నిర్వహించిన క్రిస్మస్ లంచ్ తర్వాత దాదాపు 100 మంది ఎయిర్‌బస్ అట్లాంటిక్ ఉద్యోగులు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. అయితే వారు ఏ రకమైన ఆహారం తీసుకున్నారు, దేని వల్ల వారంతా అనారోగ్యానికి గురయ్యారన్న విషయం మాత్రం అధికార ప్రతినిధి పేర్కొనలేదు.

ఫాక్స్ న్యూస్ ప్రకారం, పశ్చిమ ఫ్రాన్స్‌లోని లోయిర్-అట్లాంటిక్ ప్రాంతంలోని మోంటోయిర్-డి-బ్రెటాగ్నే వద్ద ఉన్న కంపెనీ రెస్టారెంట్ లో ఈ విందును నిర్వహించింది. ఈ లంచ్ కు 2వేల 600 మంది ఉద్యోగులు హాజరయ్యారు. భోజనం తీసుకున్న తర్వాత అనారోగ్యం పాలయ్యారు.. కానీ అందులో ఎవరూ తీవ్రమైన అనారోగ్యానికి గురి కాలేదు. వారంతా ఎప్పటిలాగే మరుసటి రోజు ఆఫీస్ కు వచ్చారని ప్రతినిధి ధృవీకరించారు. తిన్న తర్వాత దారుణమైన కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డామని ఉద్యోగుల్లో కొందరు పేర్కొన్నారు.

ఓ నివేదిక ప్రకారం, ఈ విలాసవంతమైన భోజనంలో ఫోయ్ గ్రాస్, స్కాలోప్స్, ఎండ్రకాయలు, ఐస్ క్రీంలు, హాజెల్‌నట్ చాక్లెట్ మూసీ వంటి డెజర్ట్‌లు ఉన్నాయి. దీని ధర ఒక్కొక్కరికి 16 డాలర్లు. పార్టీ తర్వాత 24-48 గంటల్లో వారికి వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపించాయి. ఎయిర్‌బస్ అట్లాంటిక్ వర్క్స్ కమిటీ కార్యదర్శి జీన్-క్లాడ్ ఇరిబారెన్, కంపెనీ క్యాంటీన్ ద్వారా ఆహారాన్ని తయారు చేసినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారీ తాము 2వేల 600మంది ఉద్యోగులకు క్రిస్మస్ విందు ఏర్పాటు చేశామన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి శాంపిల్స్ సేకరించామని, ఇది తేలేందుకు సమయం పడుతుందని చెప్పారు. కానీ ఫ్రెంచ్ ఆరోగ్య అధికారుల ప్రకారం, ఈ ఫుడ్ కు 700 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు.