బీజేపీ టికెట్లకు ఫుల్ డిమాండ్.. 2018తో పోలిస్తే ఈసారీ తీవ్ర పోటీ

  • 13 స్థానాల్లోనూ ఈసారి బీజేపీ నుంచి భారీగా ఆశావహులు
  • ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10 మందికిపైగా అప్లికేషన్లు
  • కరీంనగర్‌‌, హుజూరాబాద్‌లోనూ అప్లై చేసుకున్నరు..

కరీంనగర్/ జగిత్యాల, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ టికెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. గత ఐదేళ్లలో పార్టీ పుంజుకోవడంతో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఒక్కో నియోజకర్గంలో 5 నుంచి 10 మందికిపైగా ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు.  ఈ నెల 4 నుంచి 10వరకు హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13 నియోజకవర్గాల నుంచి 100కుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలిసింది. ఒకప్పుడు కరీంనగర్, రామగుండం, కోరుట్ల, వేములవాడలాంటి కొన్నిచోట్ల మాత్రమే బీజేపీ తరఫున పోటీ చేసేందుకు కాంపిటేషన్ ఉండేది.

2019లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  జిల్లాలో పార్టీ బలోపేతమైంది. బీజేపీలో కీలకనేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్​ నుంచి ఈటల రాజేందర్, బొడిగె శోభలాంటి వారు చేరడంతో పార్టీ క్షేత్రస్థాయిలో పుంజుకుంది. దీంతో 13 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ తరఫున టికెట్ ఆశించేవారి సంఖ్య 
పెరిగినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్, గజ్వేల్ లో సీఎం కేసీఆర్‌‌పై పోటీ చేస్తే హుజూరాబాద్‌లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కేయూ జేఏసీ లీడర్, కమలాపూర్ వాసి డాక్టర్ బండి శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు అప్లికేషన్లు ఇచ్చారు. 

మానకొండూరు ఎస్సీ రిజర్వుడు సీటుకు గతంలో సిరిసిల్లకు చెందిన గడ్డం నాగరాజు ఒక్కరే పోటీలో ఉండేవారు. ఇప్పుడు నాగరాజుతోపాటు గాయకుడు దరువు ఎల్లన్న, బీజేపీ ఎస్సీ మోర్చా నేత కుమ్మరి శంకర్, సొల్లు అజయ్ వర్మ, రాపాక ప్రవీణ్, నగునూరి శంకర్ టికెట్ ఆశిస్తున్నారు. 

మరో ఎస్సీ రిజర్వుడు స్థానం చొప్పదండి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మధ్య గతంలో తీవ్ర పోటీ ఉండేది. ఇప్పుడు వీరితోపాటు బత్తుల లక్ష్మీనారాయణ,  లింగంపల్లి శంకర్, జాడి బాల్ రెడ్డి, వినయ్ సాగర్, మామిడి చైతన్య, గోల్కొండ రాజు కూడా ఆశావహుల జాబితాలో చేరారు. హుస్నాబాద్ నుంచి కూడా బీజేపీ టికెట్ కు తీవ్ర పోటీ ఉంది. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, కర్నకంటి మంజులారెడ్డి, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాచర్ల కుమారస్వామి, లక్కిరెడ్డి తిరుమల, తీగల భరత్ గౌడ్, డాక్టర్ దేవిసెట్టి శ్రీకాంత్​రావు టికెట్ ఆశిస్తున్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ నుంచి బరిలో దిగేందుకు 12 మంది అప్లై చేసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ముదిగంటి రవీందర్ రెడ్డి, గత పార్లమెంట్​ఎన్నికల్లో పసుపు బోర్డు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పన్నాల తిరుపతిరెడ్డి, బల్దియా మాజీ చైర్‌‌పర్సన్‌ భోగ శ్రావణి, డాక్టర్​ఎడమల శైలేందర్‌‌రెడ్డి, పడాల తిరుపతి, అలిశెట్టి మదన్ మోహన్, అనుమళ్ల కృష్ణహరి, పులి శ్రీధర్, జొన్నల అమరేందర్, పన్నీరు నరేందర్, జున్ను రాజేందర్, సత్యం.. ఆశావహులుగా ఉన్నారు. 

కోరుట్లలో అత్యధికంగా నేతలు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు.  గత ఎన్నికల్లో చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి డాక్టర్ జె.ఎన్. వెంకట్ కమలం కండువా కప్పుకోవడంతో ఆయనకే టికెట్​ఖరారైంది. అయినా ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. కానీ ఈ మూడేళ్లలో కమలం పార్టీ పుంజుకోవడంతో ఇప్పుడు ఇక్కడ నేతల సంఖ్యా పెరిగింది.  జేఎన్  వెంకట్ ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నప్పటికీ.. టికెట్ ఆశిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, సురభి నవీన్ రావు, సీనియర్ లీడర్ సాంబారి ప్రభాకర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. వీరితోపాటు గతంలో బీజేపీ తరఫున పోటీచేసి ఓడిపోయి మరో పార్టీలో చేరిన ఓ డాక్టర్ తిరిగి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

వేములవాడ నుంచి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుతోపాటు జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, సిరిసిల్ల బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎర్రం మహేశ్, బొల్లారం తిరుపతి, మోతె గంగారెడ్డి ఆశిస్తున్నారు.  సిరిసిల్ల నుంచి బీజేపీ టికెట్ ఆశావహుల్లో వ్యాపారవేత్త లగిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, అడ్వకేట్ ఆవునూరి రమాకాంతారావు, బీజేపీ జిల్లా కార్యదర్శి రెడ్డబోయిన గోపీ ఉన్నారు.  ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లోనూ ఆశావహులు భారీగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లోనూ ఐదారుకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

కరీంనగర్‌‌లో 17 దరఖాస్తులు.. 

గతంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కరీంనగర్ నియోజకవర్గానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ అప్లికేషన్లు వచ్చాయి. సంజయ్ ఈసారి కరీంనగర్ నుంచి పోటీ చేయడం లేదని, ఈటల గజ్వేల్ కు వెళ్తారనే ప్రచారంతో ఈ రెండు నియోజకవర్గాల్లో తమకు అవకాశమివ్వాలంటూ పలువురు దరఖాస్తులు సమర్పించారు.

కరీంనగర్ స్థానం నుంచి టికెట్ ఆశించేవారిలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్ రావు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, సిటీ మాజీ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, మాజీ మేయర్ డి.శంకర్, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, కన్న కృష్ణ, గుగ్గిళ్లపు రమేశ్‌, నరహరి లక్ష్మారెడ్డి, దూలం కల్యాణ్‌, గుడిపాటి జితేందర్ రెడ్డి, పుల్లెల పవన్ కుమార్, దుర్గం మారుతి, బ్రహ్మం, చొప్పరి జయశ్రీ, పోతుగంటి సుజాత రెడ్డి అప్లికేషన్లు సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్ ఇప్పటికీ బీజేపీ నుంచి కరీంనగర్ టికెట్ ఇస్తామంటే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు.